ఎమ్మెల్యే రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఇంకా ఎత్తివేయకపోవడంతో ఇటీవల కొత్త చర్చ జోరందుకుంది. ఎన్నికల నాటికీ కూడా ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు.
బీజేపీ ప్రయోజనాలకు తాను పెద్దపీట వేస్తానని..వ్యక్తిగతంగా ఆలోచించనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అంబర్ పేట్ అసెంబ్లీ స్థానం నుంచి రాజాసింగ్ పోటీ చేయనున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. తనకు అలాంటి ఉద్దేశ్యమే లేదని స్పష్టం చేశారు. తనపై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేస్తుందన్న నమ్మకాన్ని రాజాసింగ్ వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పెద్ద అభిమానిని అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. పార్టీ కోసం , పార్టీ ప్రయోజనాల కోసం పని చేసే నేతలను బీజేపీ వదులుకోదని అందులో భాగంగా తనపై విధించిన సస్పెన్షన్ త్వరలోనే ఎత్తివేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గత ఏడాది ఆగస్టులో ముస్లింల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ప్రయోగించడంతో జైలుకు పంపారు. బీజేపీ కూడా ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పీడీ యాక్ట్ కింద అరెస్టై రెండు నెలల జైలు జీవితం గడిపిన రాజా సింగ్ నవంబర్ లో జైలు నుంచి విడుదలయ్యాడు.
ఈ క్రమంలోనే సైలెంట్ అయిన రాజాసింగ్.. తనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయకపోవడంతో వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని వార్తలు వఛాయి. తాను బీజేపీ నుంచి మాత్రమే పోటీ చేస్తానని..లేదంటే పోటీకి దూరంగానే ఉంటానని రాజాసింగ్ తేల్చిచెప్పారు.