సీనియర్ వేధింపులు భరించలేక మొన్న ప్రీతి అనే మెడికో విద్యార్ధిని మత్తు ఇంజెక్షన్ తీసుకొని ఆదివారం రాత్రి కన్నుమూసింది. తాజాగా ఓ యువకుడి వేధింపులు, అసభ్యకర మెసేజ్‌లతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇంజనీరింగ్ విద్యార్థిని ఆదివారం వరంగల్‌లోని రామన్నపేటలో ఆత్మహత్యకు పాల్పడింది. తను ప్రేమించిన ప్రియురాలిని తన స్నేహితుడు ప్రేమిస్తున్నాడని పీకలదాక మద్యం తాగించి అత్యంత పాశవికంగా నవీన్ అనే కుర్రాడి హత్యోదంతం.. ఏంటి వరుసగా ఈ సంఘటనలు. ఏంటి పేగులు మెలిపెట్టే విషాదం. ఏంటి వైపరీత్యం.. ?
ప్రీతి అనే మెడికో విద్యార్ధినిని సైఫ్ అనే సీనియర్ విద్యార్ధి వేధించడంతో ఆమె మనస్తాపానికి గురైంది. సీనియర్ వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ప్రిన్సిపాల్ వద్దకు కూడా సీనియర్ వేధింపుల విషయాన్ని తీసుకెళ్ళింది. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి తోడు అతని వేధింపులు తీవ్రతరం కావడంతో ప్రీతి భరించలేకపోయింది. మత్తు ఇంజెక్షన్ తీసుకొని కన్నవారికీ కడుపుకోతను మిగిల్చింది. సీనియర్ వేధిస్తున్నాడని ప్రీతి ఫిర్యాదు చేసినప్పుడు విషయం హెచ్వోడీకి ప్రిన్సిపాల్ చేరవేశాడు. హెచ్వోడీ అయిన సైఫ్ ను మందలించి, వివాదాన్ని పరిష్కరిస్తే ప్రీతి నేడు మనందరి మధ్యే ఉండేదేమో. కానీ అలాంటి చర్యలేమి తీసుకోలేదు. ర్యాగింగ్ ఘటనలు మెడికల్ కాలేజ్ ల్లో చాలా జరుగుతున్నాయి. బయటకు వస్తున్నాయి కొన్నే.. కానీ బయటకు రాకుండా ఉండిపోతున్నవి చాలానే ఉన్నాయి. విద్యార్థుల మధ్య సహృద్భావ వాతావరణం నింపాల్సిన యాంటీ ర్యాగింగ్ కమిటీలు పేరుకు మాత్రమే కనిపిస్తాయి తప్ప వీటి వలన ఎలాంటి ప్రయోజన లేదని తాజాగా తేలిపోయింది.
ప్రీతి ఘటన మరవకముందే యువకుడి వేధింపులు, అసభ్యకర మెసేజ్ లు పంపుతుండటంతో ఇంజినీరింగ్ గిరిజన విద్యార్ధిని రామన్నపేటలో ఆత్మహత్యకు పాల్పడింది. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పబ్బోజు శంకర్, రమా దేవి కూతురు పబ్బోజు రక్షిత (20) వరంగల్ నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. యువకుడి ప్రేమ పేరుతో వేధింపులు, సెల్‌ఫోన్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టడంతో రక్షిత తీవ్ర మనస్తాపానికి గురై ఉరేసుకొని చనిపోయింది. ప్రేమ పేరుతో వేధించడం ప్రేమ ఎలా అవుతుంది..? ప్రేమను ప్రేమతోనే గెలవాలన్న సోయిని నేటి యువత ఎందుకు మర్చిపోతుంది..? వేధించడం.. ఒత్తిడి చేయడం వలన నచ్చిన అమ్మాయి ప్రేమిస్తుందా..? యువత ఎందుకు పెడదోవ పడుతుంది. భవిష్యత్ ను నిర్మించుకోవాల్సిన వయస్సులో భవిష్యత్ ను ధ్వంసం చేస్తున్న దుర్మార్గుల దుర్మార్గ ఆలోచనలకు బీజం ఎక్కడ పడుతుంది..? ఇంతటి విషపూరిత ఆలోచనలు ఎలా పుట్టుకొస్తున్నాయి.? ప్రేమ పేరుతో జరుగుతోన్న వేధింపులతో రక్షిత చనిపోయింది. కానీ ఆమె ఆత్మహత్యకు కారణమైన యువకుడు జీవితం జైలు గోడలకు పరిమితం అవుతే.. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పడే ఆవేదన గురించి యువత ఎందుకు ఆలోచించడం లేదు..?
తెలంగాణలో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసును పరిశీలిస్తే యువత పెడదోవ పడుతున్న తీరు ఆందోళన కల్గిస్తోంది. టీనేజ్ వయస్సులో హత్య చేయాలనే ఆలోచనకు యువత వస్తుందంటే సమాజం ఎంత వేగంగా వినాశనం వైపు ప్రయనిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కలిసిమెలిసి తిరిగి, మందేసి.. చిందేసి.. కలిసి కబుర్లు చెప్పుకున్న స్నేహితుడిని మిత్రుడే చంపేశాడు. కారణం అమ్మాయి. ప్రేమ వ్యవహారం. నవీన్ అనే యువకుడిని అతని స్నేహితుడు హరి కత్తితో మెడ కోసి.. తలను మొండెం నుంచి వేరు చేశాడు. ఆ తర్వాత మర్మాంగాన్ని కోసేసి… నవీన్ శరీరం నుంచి గుండెను బయటకు తీశాడు. చేతి వేళ్లను కూడా కట్ చేసి అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఇంతటి కిరాతక ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. లోపం ఎక్కడుంది..? పెరిగే వాతావరణం కారణమా..? చెడు స్నేహాలా..? పెంపకంలో లోపమా..?ఆలోచించండి.
ఈ మూడు ఘటనల్లో బాధితులు గిరిజన సామజిక వర్గానికి చెందిన వ్యక్తులే. విద్యాలయాల్లో కులవివక్ష ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. కానీ మనకు కనిపించకుండానే అది పాతుకుపోయింది. ర్యాగింగ్ భూతంతో కిందిస్థాయి కులాలకు చెందిన విద్యార్థులు టార్గెట్ అవుతున్నారనే ఈ విషయం తాజా ఘటనలతో అర్థం అవుతుంది. మొన్న రోహిత్ వేముల విషయంలో దళిత విద్యార్ధి అనే కారణంతోనే సస్పెండ్ చేసి ప్రాణాలు తీసుకునేలా చేసింది. ఆ తరువాత అతని కులాన్ని ఎంత వివాదం చేశారో అందరికీ తెలుసు. ఇప్పుడది పెకిలించలేని విధంగా వెళ్ళునుకుపోయింది. దీనిని బట్టి చూస్తుంటే వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు వ్యవస్థీకృతంగానే జరుగుతున్నాయని అర్థం అవుతుంది.
అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసే ఘటనలు జరిగి సమాజమంతా ఓ దుఖిత సందర్భంలో ఉండగా కేసీఆర్ , కేటీఆర్ లు మౌనం వీడటం లేదు. విద్యా సంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలను పటిష్టం చేస్తామని…ప్రీతి ఘటనకు బాధ్యులైన వారిని శిక్షిస్తామని కాని చెప్పడం లేదు. ట్వీటర్ పిట్టకు గిరిజన బిడ్డల కన్నీటి గోసను వినబడనట్టు ఉంది..అందుకే ఆయనగారు స్పందించలేదు..కనీసం గిరిజన మంత్రి,ఎమ్మెల్యేలు ,ఎంపీలు అయినా ఈ విషయంలో అగ్రెసివ్ గా స్పందిస్తారనుకుంటే అదీ లేదు. ఇక్కడ రాజకీయ నేతలకు కావాల్సింది రాజకీయ ప్రయోజనాలు తప్పితే బాధిత కుటుంబాల కన్నీటికి విలువ ఇచ్చేవాడెవడు..?ఆలోచించండి…