వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్యయత్నం చేయడానికి కారణం సీనియర్ విద్యార్ధి వేధింపులేనని స్పష్టం చేశారు సీపీ రంగనాథ్. రెండు నెలలుగా సీనియర్ విద్యార్ధి సైఫ్ నుంచి ఆమెకు వేధింపులు ఎదురు అవుతున్నాయని ఈ క్రమంలోనే ఆ వేధింపులు తీవ్రరూపం దాల్చడంతో ఆత్మహత్యయత్నం చేసిందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని బయటపెట్టారు.
సైఫ్ ఆధిపత్యపు అహంకారాన్ని ప్రీతి ప్రశ్నించడంతోనే ఆమెను లక్ష్యంగా చేసుకొని వేధించినట్లు తేలిందని సీపీ తెలిపారు. అందరి ముందు ప్రీతిని అవమానించడంతో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు. ప్రీతి ధైర్యం కల్గిన అమ్మాయి అని.. అలాగే ఆమె సున్నిత మనస్తత్వం అని తెలిపారు. కేసు షీట్ విషయంలో ప్రీతిని అవమానించేలా సైఫ్ ప్రశ్నించడమే ఈ వివాదానికి కారణమైందన్నారు.
ఫిబ్రవరి 18న వాట్సప్ గ్రూపులో సైఫ్ పెట్టిన మెసేజ్ పై ప్రీతిని వ్యక్తిగతంగా సైఫ్ ను ప్రశ్నించిందని..తనను ఉద్దేశించి గ్రూప్ లో చాట్ చేయడం సరైంది కాదని.. ఏదైనా ఉంటె HODల వద్దకు తీసుకెళ్లాలని ఆమె సూచించింది. అయినప్పటికీ సైఫ్ తగ్గలేదని.. పైగా ఆమెపై పైచేయి సాధించేందుకు ప్రయత్నించినట్లు ప్రీతీ తన స్నేహితులకు చేసిన చాటింగ్ లో వాపోయింది. తనకు బ్రెయిన్ లేదంటూ సైఫ్ హేళన చేశాడని స్నేహితులతో ఆవేదనను పంచుకుంది ప్రీతి .
సైఫ్ వేధింపులు తాళలేకనే ప్రీతి ఇలా ఆత్మహత్యాయత్నం చేసినట్టు చాటింగ్ ద్వారా తెలుస్తోందని వరంగల్ సీపీ తెలిపారు. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్ ను అరెస్ట్ చేశామని.. మొదటి నుంచి సైఫ్ వల్ల ప్రీతి ఇబ్బందిగా భావిస్తోందని తెలిపింది.