సీఎం కేసీఆర్ సొంత ఇలాకా గజ్వేల్ మున్సిపాలిటీలో గలాటా మొదలైంది. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా తీరును వ్యతిరేకిస్తూ 14మంది కౌన్సిలర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ను పదవి నుంచి తొలగించాలని కొద్ది రోజులుగా జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెబుతున్నా పట్టించుకోకపోవడంతో వారంతా మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. ఈమేరకు సిద్ధిపేట కలెక్టర్ ను కలిసి కౌన్సిలర్లు అవిశ్వాస ప్రకటన నోటిసులను అందజేశారు.
కౌన్సిలర్లు అవిశ్వాస నోటిసులు కలెక్టర్ కు అందించడంతో మున్సిపల్ చైర్మన్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ప్రవేశపెడుతున్న అవిశ్వాసం నోటిసులపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం అంశంపై స్టే విధించేందుకు అంగీకరించింది. దీంతో కౌన్సిలర్లు ఏమి చేయలేక మున్సిపల్ చైర్మన్ తీరును నిరసిస్తూ అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం. రాజమౌళి గుప్తాను పదవి నుంచి తప్పిస్తే గాని పట్టువదిలేలా కౌన్సిలర్లు కనిపించడం లేదు. దీంతో అధికార బీఆర్ఎస్ లో ఆందోళన కనిపిస్తోంది.
గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తాపై అవిశ్వాసం ప్రకటించిన కౌన్సిలర్లు ఆయనపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పెద్దమొత్తంలో నిధుల దుర్వినియోగం జరుగుతుందని…అన్నింట్లో రాజమౌళి గుప్తా అక్రమాలకు పాల్పడుతున్నారని సొంత పార్టీ కౌన్సిలర్లు ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది. అయితే.. తాము పార్టీకి విదేయులుగానే ఉంటామని కానీ రాజమౌళి గుప్తా అవినీతిని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని తేల్చి చెబుతున్నారు. మున్సిపల్ చైర్మన్ పై అసమ్మత్తి గళం వినిపిస్తోన్న 14మంది కౌన్సిలర్లతో మాట్లాడి నచ్చజెప్పెందుకు కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించడం లేదని తెలుస్తోంది.
తమ వినతులను పార్టీ అధిష్టానం పట్టించుకోకపోతే రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడకూడదని 14మంది కౌన్సిలర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : BRSలో ముదురుతున్న మున్సిపల్ రాజకీయం