గతమెంతో ఘనం. వర్తమానం ఆగమాగం అన్నట్లు తయారైంది సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి. శని, ఆదివారాల్లో సెలవు. ఆకర్షణీయమైన జీతమని తెగ మురిసిపోయేవారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. కానీ ప్రస్తుత ఉద్యోగులు మాత్రం ఆందోళనతో జీవితాన్ని గడుపుతున్నారు. ఎప్పుడు ఎవరిని లే ఆఫ్ పేరుతో ఊడపీకుతారోనని దినదినం గండంగా బతుకీడుస్తున్నారు.
సర్వేలో నమ్మశక్యం కానీ నిజాలు
సిగ్న అనే ఇంటర్నేషనల్ హెల్త్ సంస్థ సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై ఇటీవల సర్వే చేపట్టింది. సర్వేలో పాల్గొన్న వారంతా 25సంవత్సరాల లోపు వారే. ఉద్యోగం, జీతాలు, కుటుంబ పరిస్థితి, ఆఫిసు వాతావరణం , తోటి ఉద్యోగులతో సహచర్యం, జీతాల పెరుగుదల వంటి అంశాలపై సర్వే చేసింది. ఈ ప్రశ్నలకు సమాధానమిస్తూ పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నూటికి 23 శాతం మంది పని వల్ల తాము ఒత్తిడికి గువుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
తమకు వచ్చే జీతాలు ఏమాత్రం సరిపోవడం లేదని 90 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఆఫీసులో తోటి ఉద్యోగుల తీరు బాగోలేదని 34 శాతం మంది చెప్పారు. ఉద్యోగంలో ఎదుగుదల లేక… మానసిక కుంగుబాటుకు గురై తరుచుగా అనారోగ్యానికి గురి అవుతున్నామని 60 శాతం మంది అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం వలన వేగంగా అభివృద్ధి సాధిస్తున్నా.. ఆ రంగంలోని వారు మానసిక సమస్యలకు గురి అవుతున్నారు. కొన్ని సంస్థల్లో ఆకర్షణీయమైన జీతాలు వస్తున్నా అవేవి ఉద్యోగులను సంతృప్తి పరచడం లేదు. జీవితంలో ఎదో కోల్పోతున్నామన్న భావనను వెంటాడుతుందని చెప్పుకొస్తున్నారు.
హై పొజిషన్ లో ఉన్నవారు మాత్రం ప్రాజెక్టు పనులు గడువులోగా కంప్లీట్ చేయడం కోసం రేయింబవళ్ళు పని చేయాల్సి వస్తోంది. తద్వారా కుటుంబాలకు, బంధుత్వాలకు దూరం కావాల్సి వస్తుందని.. ఫలితంగా జీవితంలో ఆనందం అనే అనుభూతి మాయం అవుతుందని చెప్పుకొచ్చారు.