తెలంగాణ రాజకీయాల్లో భారీ కుదుపు. బుధవారం సాయంత్రం నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రలోభాలు జరిగాయంటూ బయటకొచ్చిన వార్త సంచలనంగా మారింది. ఈ ఎపిసోడ్ పై బీజేపీ , టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ట్విస్ట్ ఏంటంటే… నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు నడిపిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు, గతంలో టీఆర్ఎస్ నేతలతో కనిపించడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది. .
ముగ్గురు ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత సిబ్బంది లేకుండానే తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్ కు వెళ్లారు. వారితోపాటు సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి , సింహయాజులు అనే స్వామిజీ తోపాటు నందకుమార్ అనే మరో వ్యాపారవేత్త ఎమ్మెల్యేలతో బేరసారాలు నడిపినట్లు తెలుస్తోంది. నందకుమార్ అనే వ్యక్తి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరాలంటూ నలుగురు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి వంద కోట్ల మేర ఆఫర్ చేసినట్లుగా సమాచారం. ఈ తంతు కొనసాగుతూ ఉండగానే పోలీసులు రైడ్ చేయడంతో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెల్లమొహం వేశారు. మీడియా కూడా ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో తమ బండారం బయటపడిందని ఆందోళన చెందిన ఎమ్మెల్యేలు… తమ సచ్ఛీలతపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. తరువాత మాట్లాడతామంటూ అక్కడి నుంచి జారుకున్నారు.
అయితే… ఈ విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కేసీఆర్ కు సమాచారం అందించారని ఆ పార్టీ నేతలు ప్రకటించుకుంటున్నారు. కానీ ఇదే విషయం ఫామ్ హౌస్ లో పట్టుబడిన వెంటనే ఆ ఎమ్మెల్యేలు అక్కడే ఎందుకు ప్రకటించలేదన్నది అందరి ప్రశ్న. తమను ప్రలోభాలకు గురి చేశారని ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ ప్రకటించలేదు. సరికదా.. తమ బండారం బయటపడిందనే ఆందోళన వారి మొహాల్లో స్పష్టంగా కనిపించసాగింది. కేసీఆర్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సమాచారం అందిస్తే.. అంత రహస్యంగా వ్యక్తిగత, భద్రత సిబ్బంది లేకుండానే ఫామ్ హౌస్ లో బేరసారాలకు ఆ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళారన్నది మరో ప్రశ్న. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మునుగోడులో మోహరించి ప్రచారం చేస్తుంటే.. ఈ నలుగురు మాత్రం నియోజకవర్గాలను కూడా వదిలేసి ఫామ్ హౌస్ కు ఎందుకొచ్చారన్నది ఇంకో ప్రశ్న.
రఘునందన్ లీక్ చేశాడా ..?
అయితే, బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా టీఆర్ఎస్ అధిష్టానం అడ్డుకోగలిగిందని అంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు 400 కోట్లను ఆఫర్ చేసి బీజేపీలో చేర్చుకొని తెలంగాణలో టీఆర్ఎస్ దుకాణం బంధ్ అయినట్లేనని సందేశాన్ని మునుగోడులో ప్రచారం చేసుకొని లబ్ది పొందాలని కమలదళం భావించి ఉండొచ్చూ. అదే సమయంలో బీజేపీ సీక్రెట్ గా నిర్వహించే ఆపరేషన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ద్వారా తెలిసే ఛాన్స్ లేకపోతే మరెవ్వరు ఈ సమాచారాన్ని గులాబీ బాస్ కు చేరవేశారు అన్నది అందరి మెదల్లో నానుతోన్న ప్రశ్న. అయితే, ఈ సమాచారం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మంత్రి కేటీఆర్ తో పంచుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయనను టీఆర్ఎస్ లో చేరేందుకు ఆహ్వానించారని వార్తలు వచ్చాయి. ఈ సమయంలోనే ఈ ఆరోపణలు రావడం ఆసక్తికరంగా మారింది.
మరో కోణం :
ఈ కొనుగోలు వ్యవహారమంతా కాంగ్రెస్ ను దెబ్బతీసే వ్యూహంతో టీఆర్ఎస్ , బీజేపీలు చేసి ఉండొచ్ఛునన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించే సూచనలు నానాటికీ తగ్గుపోతున్నాయి. ఇక, బీజేపీ పోటీనిచ్ఛే పరిస్థితి ఎమాత్రంలేదు. అదే సమయంలో ఓటింగ్ శాతాన్ని మెరుగుపరుచుకుంటూ కాంగ్రెస్ పుంజుకుంటుంది. బీజేపీ మాత్రం మూడో స్థానానికి పరిమితం అవుతోంది. ఈ నేపథ్యంలో మునుగోడులో రోజులు గడిచేకొద్దీ కాంగ్రెస్ బలపడటం… రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం మునుగోడుపై ఉంటుందని భావిస్తోన్న టీఆర్ఎస్ , బీజేపీలు ఈ కొనుగోలు డ్రామా చేసి ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మునుగోడులో కాంగ్రెస్ గెలవకూడదని పట్టుదలతో నున్న రెండు పార్టీలు… ఈ కొనుగోలు పాలిటిక్స్ తో జనాల అటెన్షన్ ను మళ్ళీ తమ వైపు తిప్పుకునేందుకు ఈ వ్యూహం రూపొందించినట్లు చెబుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేలతో బేరం నడిపిన వ్యక్తులు టీఆర్ఎస్ , బీజేపీ నేతలకు సన్నిహితులు కావడం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది.