అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లు మారింది కేంద్ర క్యాన్సర్ ఆరోగ్య నిధి (ర్యాన్) పథకం. కాన్సర్ తో బాధపడే నిరుపేదలకు ‘వన్ టైం సెటిల్మెంట్’ కింద రూ. 15 లక్షలు ఇవ్వడం ఈ పథకం గొప్పతనం. గత నాలుగేళ్ళుగా ఈ పథకాని కేంద్రం అమలుచేస్తోంది. దాదాపు 23 రాష్ట్రాల కాన్సర్ పీడితులు దీని ద్వాఆ లబ్ది పొందుతున్నారు. కానీ ఈ ఏడాది కేంద్రం విడుదలచేసిన లబ్దిదారుల జాబితాలో తెలంగాణ నుంచి ఒక్క క్యాన్సర్ రోగి కూడా దరఖాస్తు చేయకపోవడం దురదృష్టకరం.
దేశంలో 5 కోట్లమది, తెలంగాణలో దాదాపు 20 లక్షల మంది కాన్సర్ తో బాధపడుతున్నట్లు ఆ మధ్య ఓ సర్వేలో తెలిసింది. ఇందులో నిరు పేదలే ఎక్కువ. ఉచితంగా చీరలు ఇస్తున్నారని ప్రకటిస్తే తొక్కిసలాటలో ప్రాణాలు వదిలే పేదలున్నారు. మరి ఇంత పెద్ద మొత్తానికి ఒక్కరు కూడా ఆశ పడకపోవడం ఏమిటి? ఒక్కరు కూడా దరఖాస్తు చేయకపోవడం ఏమిటి?
కర్ణుడి చావుకు వంద శాపాలు ఎలాగో ఈ పథకం విజయవంతం కాకపోవడానికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి. కేవలం ప్రచార ఆర్భాటాల కోసం కొన్ని పథకాలను కేంద్రం ప్రవేశ పెట్టింది. పావలా కోడికి రూపాయి గరంమసాలా అన్నట్లు – ‘స్వచ్చ భారత్’ లాంటి చెత్త పథకానికి కొన్ని వేల కోట్లు ఖర్చు చేసింది. మరి ఇంత మంచి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో ఎందుకు విఫలమయ్యింది.
దానికితోడు కేంద్రం పథకాల మీద సీత కన్ను వేసే తెలంగాణ ప్రభుత్వం ఎప్పటిలా దీని మీద కూడా సితకన్ను వేసింది. జనానికి, ముఖంగా క్యాన్సర్ రోగులకు చేరవేయలేక పోయింది. దీనికి తోడు ఈ పథకం ద్వార లబ్ది పొందాలంటే రోగికి కావలసిన నియమనిభందనలు చాంతాడులా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ నుంచి కేవలం 95 మంది మాత్రమే లబ్ది పొందారు అంటే ఎంత కఠినతరమో అర్థం చేసుకోవచ్చు.
ఏది ఏమైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడైనా నిరు పేదలు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ప్రధానమైన నిభందనలు – క్యాన్సర్ రోగులు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి క్యాన్సర్ రోగ నిర్ధారణ సర్టిఫికేట్ పొందాలి. దీనితో పాటు మీ ఆదాయ ధృవ పత్రాన్ని, రేషన్ కార్డ్, ఆధర్ కార్డ్, అడ్రెస్ ప్రూఫ్, ఫోటోలను దరకస్తుకు జతచేసి హెల్త్ మినిస్టర్, క్యాన్సర్ పేషెంట్ ఫండ్ (హెచ్. ఎం. సి. సి. ఎఫ్), న్యూ ఢిల్లీ కి పంపాలి. ఆ తర్వాత వాళ్ళు అడిగే ఇతర వివరాలు ఇవ్వాలి.