కాకినాడ ఓడరేవును అక్రమ రవాణాకు అడ్డాగా మార్చేస్తున్నారు అధికార వైసీపీ నేతలు. అందులో ముఖ్య భూమికను పోషిస్తున్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అక్రమ రవాణాకు ద్వారంగా వ్యవహరిస్తూ అక్రమార్కులకు తలలో నాలుకల మెదలుతున్నారు. అందుకే అవినీతిపరులందరూ ఆయనకు అనుయాయులుగా, అభిమానులుగా మారిపోతున్నారనే మాటలు వినిపిస్తుంటాయి. అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసే ప్రధాన దందాల్లో బియ్యం అక్రమ రవాణా ఒకటనే ఆరోపణలున్నాయి. అందులోనూ పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని సైతం ఆయన అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారనే అనుమానాలు లేకపోలేదు. పైకి బాయిల్డ్ రైస్, బ్రోకెన్ రైస్ ఎగుమతి చేస్తున్నట్లుగా చెబుతున్నా, లోపల మాత్రం రేషన్ బియ్యమే అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలకు ఇక్కడి పేదలకు అందాల్సిన బియ్యం స్మగ్లింగ్ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నట్లు పలువురు అంటున్నారు. అంటే పేదల నోటి దగ్గర కూడును కూడా లాగేస్తున్నాడన్న మాట ఈ కాకినాడ సిటీ కేడీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.
అయితే ద్వారంపూడి దందా కేవలం కాకినాడ జిల్లాకే పరిమితం కాలేదనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలకు ఈ బియ్యం అక్రమ రవాణాతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకానొక అంచనా ప్రకారం రాష్ట్రంలో జరుగుతున్న బియ్యం కుంభకోణం వెనుక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దోపిడీకి ద్వారాలు తెరిచి వేలాది కోట్లు ఆర్జిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బియ్యం మాఫియాను నడపడమే కాదు, ప్రభుత్వ పెద్దల జేబులను కూడా నింపుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. తద్వారా జగన్ రెడ్డికి లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ద్వారంపూడి కాకినాడ పోర్టునే కేంద్రంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే రాష్ట్రంలో బియ్యం దిగుబడులు తక్కువగా ఉన్నప్పటికీ కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. 2018-19లో బియ్యం దిగుబడులు 82.30 లక్షల టన్నులుంటే, 2020-21 నాటికి 78.90 లక్షల టన్నులకు తగ్గాయని లెక్కలు చెబుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో బియ్యం ఎగుమతులు 2018-19లో 18.09 లక్షల టన్నులుంటే.. 2020-21 నాటికి 31.51 లక్షల టన్నులకు, 2021-22 నాటికి ఏకంగా 48.26 లక్షల టన్నులకు ఎలా చేరాయనే లెక్కలు అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. నాటి లెక్కల ప్రకారం పంట దిగుబడులు పెరగలేదని కేంద్ర నివేదికలు చెబుతుంటే.. ఎగుమతులు ఎలా పెరుగుతున్నాయనే ఆలోచనలు ప్రజల బుర్రలను తొలచేస్తున్నాయి. రేషన్ బియ్యం పక్కదారి పట్టించి విదేశాలకు ఎగుమతి చేయడం వల్లనే అనే వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. మొత్తానికి ఈ కాకినాడ సిటీలో ఉన్న కేడీ ఎమ్మెల్యే పేదల తిండికి కూడా ఎసరుపెట్టడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.