ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం.. ఆపదలో ఉన్న వారికి చిన్న సాయం.. అవసరంలో ఉన్న వారికి నిలదొక్కుకునే బలం.. వారి జీవితాలను మార్చేస్తాయి. అవి ఎంతో పెద్దవి కాకపోయినా ఆ సమయంలో వారి ఊపిరి నిలవడానికి, వారు తిరిగి నిలబడడానికి ఊతాన్ని ఇస్తాయి. బలాన్ని పుంజుకునేందుకు తోడ్పడతాయి. వారిని మంచి వైపు నడిచేలా ప్రోత్సహిస్తాయి. అలాంటి అన్నార్తుల, దీనుల, ఆర్తులకు అండగా నిలవాలని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ను సానా సతీష్ బాబు స్థాపించారు. సమాజంలోని ఏ ఒక్క వ్యక్తి కూడా నిస్సహాయులుగా మిగిలిపోవద్దనే గొప్ప సంకల్పంతో ఆయన ఫౌండేషన్ ద్వారా సహాయ కార్యక్రమాలను చేపడుతున్నారు. కాకినాడ జిల్లాలో సహాయం అవసరం ఉన్న వారికి ఊరు, పేరు తెలిసినా వెంటనే స్పందిస్తూ వారి వద్దకు వెళ్లేలా ఫౌండేషన్ ప్రతినిధులను సన్నద్ధం చేశారు. అందుకే ఎందరో నిస్సహాయులు, నిర్భాగ్యులు ఫౌండేషన్ ద్వారా సహాయం పొందుతూ తమ జీవితాల్లో వెలుగులు నింపుకుంటున్నారు. అడగనిదే అమ్మ అయినా పెట్టదని సామెత. కానీ చెప్పకుండానే సమస్యను తెలుసుకొని, సమస్యకు పరిష్కారం చూపాలనే ఆలోచన సమాజం పట్ల ప్రేమను, తన పుట్టిన ఊరు బాగుపడాలనే సానా సతీష్ బాబు ఆశయాన్ని మన కళ్లకు కడుతుంది. ప్రతి గుండెను తాకుతూ మానవత్వ పరిమళాలను పంచుతుంది. తమలాగా ప్రజలకు సేవ చేయాలనుకునే ప్రతి స్వచ్ఛంధ సేవా సంస్థకు, పరోపకారులకు ఆదర్శంగా నిలుస్తుంది. అంతటి ఉత్తమ ఆచరణతో సానా సతీష్ బాబు ఫౌండేషన్ సమాజ సేవలో భాగమవుతుంది.
పునాదులు బలంగా ఉంటేనే, నిర్మాణం పది కాలాల పాటు దృఢంగా ఉంటుంది. వందలాది మంది నీడను ఇవ్వగలుగుతుంది. దాని అసలైన లక్ష్యాన్ని నెరవేర్చగులుతుంది. ఎందుకంటే పునాదులే బలంగా లేకపోతే నిర్మాణం ఎంత అందంగా ఉన్నా ఏదో ఒక రోజు నేల కూలుతుంది. చిన్న చిన్న లోపాలతో అనర్థాలకు దారి తీస్తుంది. అందుకే ఒక నిర్మాణానికి పునాదులు ఎంత అవసరమో సమాజానికి విద్య అంతే అవసరం. విద్యార్థి స్థాయిలోనే నేటి బాలలు విఫలమైతే, రేపటి సమాజం కూడా విఫలమవుతుంది. అందుకే సానా సతీష్ బాబు ఫౌండేషన్ విద్యా రంగంపై ప్రధాన దృష్టిని కేంద్రీకరించింది. భావి భారత పౌరుల వ్యక్తిత్వ, మానసిక, శారీరక పరిపక్వతకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు చేయూతనిస్తోంది. కాకినాడ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులను స్వచ్ఛంధంగా కల్పిస్తోంది. విద్యార్థులకు అవసరమైన స్టేషనరీలు, బస్ పాసులు అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలు అనే కాకుండా ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే పేద విద్యార్థులకు కూడా సానా సతీష్ బాబు ఫౌండేషన్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తోంది. ఉపాధ్యాయులను గౌరవించి బోధనలో వారి ఉత్సాహం మరింత రెట్టించేలా ప్రోత్సహిస్తోంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి పౌరుల వ్యక్తిత్తవ నిర్మాతలే ఉపాధ్యాయులు.
అనుభవం గొప్ప పాఠాలను నేర్పిస్తుందని పెద్దల మాట. అలాంటి పెద్లలే నేడు కన్నబిడ్డల నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వారి అనుభవసారం సమాజానికి దూరమై సమాజం పెడత్రోవ పడుతోంది. పెద్దలను వృద్దాశ్రమాల దారి పట్టిస్తోంది. అటువంటి పెద్దల అనుభవ సారాన్ని ఆకళింపు చేసుకోవడానికి, వారి బిడ్డలుగా తామున్నామనే భరోసాను కల్పించడానికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చిత్తశుద్ధితో పనిచేస్తోంది. కాకినాడలోని వృద్దాశ్రమాలను గుర్తించి అక్కడ మౌలిక వసతులను మెరుగుపరుస్తోంది. పెద్దలకు సాంత్వన చేకూర్చేలా కార్యక్రమాలను చేపడుతోంది. నువ్వు నూరేళ్లు సల్లంగ బ్రతకాలి అనే ఆశీర్వచనాలను సానా సతీష్ బాబుకు అందిస్తోంది. అలా ముదసరి ముఖాల వెనుక పసి మనసులను సానా సతీష్ బాబు ఫౌండేషన్ తన సేవ ద్వారా చేరవవుతోంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు సానా సతీష్ బాబు ఫౌండేషన్ కాకినాడ జిల్లా వ్యాప్తంగా చేస్తోంది. పేదరికంలో ఉండి అనారోగ్యంతో బాధపడేవారికి ఆర్థిక సాయం మాత్రమే కాదు, అవసరమైన మందులను కూడా సమకూరుస్తోంది. వారి ఆరోగ్యం మెరుగుపడి జీవితాన్ని ఆరోగ్యవంతంగా గడపడానికి తోడ్పాటునిస్తోంది. ఎండనక వాననక కష్టించే వీధి వ్యాపారులకు బాసటగా నిలిచి సహాయాన్ని చేస్తోంది. వారికి కనీస వసతులను సమకూరుస్తూ వారి మోముపై చిరు నవ్వుల పువ్వులను పూయిస్తోంది. అందుకే సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రజల మనస్సులో చోటు సంపాదించుకుంది. నిరాశ్రయులు, నిస్సహాయులు, నిర్భాగ్యులకు ఒక ఆశాకిరణంగా నిలుస్తోంది.