వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త మొహానికి అవకాశం ఇస్తారా..? సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సైడ్ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారా..? ఇటీవల సర్వే ఫలితంతో కేసీఆర్ గువ్వల బాలరాజుకు మరోసారి అవకాశం ఇవ్వొద్దనుకుంటున్నారా..? ఇదే సమయంలో మరో కొత్త వ్యక్తిని బీఆర్ఎస్ వర్గాలే ఎంకరేజ్ చేస్తున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. అప్పుడే వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. దళిత బంధుతో దళితుల ఓట్లు గంపగుత్తగా తనఖాతాలో పడుతాయని..అర్థ బలం, అంగబలంతో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతానని..మంత్రి అవుతానని లెక్కలేసుకుంటున్నారు. కేసీఆర్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని క్యాడర్ కు చెప్పుకుంటున్నారు. విజయం ఖాయమని ధీమాగా ఉన్నారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లుగా.. వచ్చే ఎన్నికల్లో గువ్వల బాలరాజును పక్కన పెట్టాలని ప్రగతి భవన్ పెద్దలు ఆలోచిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తామని ఇటీవలి కేసీఆర్ ప్రకటన వ్యూహత్మకమేనని అందరికీ తెలుసు. ఎమ్మెల్యేలను చేజారిపోకుండా ఉంచేందుకే కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. 25నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని వ్యాఖ్యానించారు. తన సర్వేలో ఇది బయటపడిందని చెప్పారు. ఎర్రబెల్లి సర్వేలో భారీగా జనం వ్యతిరేకత మూటగట్టుకున్న ఎమ్మెల్యేల జాబితాలో గువ్వల మొదటి ప్లేసులో ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో.. ఇటీవల కేసీఆర్ నిర్వహించిన సర్వేలో ఇదే ఫలితం వచ్చినట్లు తేలింది. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తరహాలో రాజకీయాల్లో వివాదాస్పద పొలిటిషియన్ గా గువ్వల బాలరాజుకు నియోజకవర్గం అంతటా పేరుంది. అధికారులపై చేయి చేసుకోవడం.. ప్రశ్నించిన సామాన్య జనాలపై దురుసుగా వ్యవహరించడం వంటి సంఘటనలతో నియోజకవర్గం అంతటాగువ్వల వ్యతిరేకత మూటగట్టుకున్నారు.
వీటన్నింటిని పరిశీలించిన ప్రగతి భవన్ పెద్దలు..వచ్చే ఎన్నికల్లో గువ్వల బాలరాజును పక్కన పెట్టేయలన్న తలంపుతో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. గువ్వల బాలరాజు స్థానంలో మరో యువనేతను బీఆర్ఎస్ నేతలే ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. గువ్వలకు టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని తేలాక కూడా ఆయనను బరిలో నిలపడం మూర్ఖత్వమే అవుతుందన్న ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని అంటున్నారు. అందుకే నియోజకవర్గంలో పర్యటించేందుకు ఓ యువనేతకు ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని చెబుతున్నారు.