తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకురాలు ఇందిరా శోభన్ టీడీపీలో చేరనున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని…టీడీపీలో చేరేందుకు ఆమె అంగీకరిస్తే త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో అగ్రెసివ్ గా కనిపించే మహిళా నేతల్లో ఇందిరా శోభన్ ఒకరు. కాంగ్రెస్ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఇందిరా శోభన్.. ఉత్తమ్ వ్యవహారశైలి నచ్చక కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆ తరువాత రాజన్న రాజ్యం అంటూ వైఎస్సార్ తెలంగాణపార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల పార్టీలో చేరారు. అక్కడ ఆధిపత్య రాజకీయాల కారణంగా వైఎస్సార్ టీపీని కూడా వీడారు. అనంతరం స్వతంత్రంగా రాజకీయాలు చేసిన ఇందిరా శోభన్ కొంతకాలం తరువాత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ లో చేరారు. ఆ పార్టీ బలోపేతం కోసం బాగానే కష్టపడ్డారు. పాదయాత్రలు చేశారు. ఢిల్లీ మోడల్ అంటూ గ్రేటర్ హైదరాబాద్ లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు.కానీ అరవింద్ కేజ్రీవాల్ – కేసీఆర్ తో జట్టు కట్టాడన్ని వ్యతిరేకిస్తూ ఆప్ కు రాజీనామా చేశారు ఇందిరా శోభన్.
దాంతో ఇందిరా శోభన్ తిరిగి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. ఆ తరువాత బీజేపీలో చేరనున్నారని కథనాలు వచ్చాయి. వీటిని ఇందిరా శోభన్ ఖండించారు. బీసీలకు న్యాయం చేసే పార్టీలోకి , మహిళలకు రాజకీయ రంగంలో అధిక ప్రాధాన్యత ఇచ్చే పార్టీలోకి తను వెళ్తానని స్పష్టం చేశారు. అంటే ఈ లెక్కన ఆమె టీడీపీలో చేరనున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టీడీపీ మహిళా నేత ద్వారా ఇందిరా శోభన్ తో సంప్రదింపులు జరుగుతున్నాయని..అవి ఓ కొలిక్కి వచ్చాయని త్వరలోనే ఆమె టీడీపీలో చేరనున్నట్లు చెబుతున్నారు.
ఇటీవల తెలంగాణపై కూడా చంద్రబాబు దృష్టిపెట్టడం.. కాసాని జ్ఞానేశ్వర్ టీ. టీడీపీ అద్యక్షుడిగా నియమించాక ఆ పార్టీలో కొంత కొత్త జోష్ కనిపిస్తోంది. పార్టీని గతంలో వీడిన నేతలంతా తిరిగి పార్టీలోకి రావాలని చంద్రబాబు ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ తెలంగాణలో కాస్త పుంజుకోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.పైగా గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీకి మంచి ఆదరణ ఉంది. గ్రేటర్ నుంచే ఇందిరా శోభన్ టికెట్ ఆశిస్తున్నారు. కాబట్టి తన టికెట్ కు ఎలాంటి డోఖా ఉండొద్దని..అలాగే గెలుపు అవకాశాలు టీడీపీ నుంచి కూడా మెరుగ్గానే ఉంటాయని అంచనా వేస్తోన్న ఇందిరా తనకు రైట్ ఛాయిస్ గా టీడీపీని ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.