ఆప్ కు రాజీనామా చేసిన ఇందిరా శోభన్ పొలిటికల్ చౌరస్తాలో నిలుచున్నారు. కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీ , ఆ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీలు మారారు. బీఆర్ఎస్ తో ఆప్ దోస్తీ చేస్తుందంటూ ఇందిరా శోభన్ ఇటీవల ఆప్ కు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఆమె ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది.
ఆరు దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర కళను సాకారం చేసిందని 2014లో కాంగ్రెస్ లో చేరారు ఇందిరా శోభన్. పార్టీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఆమె పార్టీ వాయిస్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు. నిత్యం టీవీ డిబేట్ లో కనిపిస్తూ ప్రత్యర్ధి పార్టీలకు చెందిన నేతలను ఇరుకునపెట్టేవారు. అలా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ఆమె కూడా పాల్గొన్నారు. అదే సమయంలో మహిళా కాంగ్రెస్ అద్యక్షురాలిగా ఇందిరా శోభన్ పేరు వినిపించింది.అంతలోనే ఆమె లోటస్ పాండ్ కు వెళ్లి వైఎస్ షర్మిలతో సమావేశమై పార్టీ మారుతున్నట్లు ప్రకటన చేసింది.
కాంగ్రెస్ ను వీడుతు నాటి పీసీసీ చీఫ్ గానున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేసింది. ఉత్తమ్ కుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతం కాదని..కష్టపడి పని చేసే నేతలను ఉత్తమ్ అసలే పట్టించుకోరని విమర్శించింది. రాజన్న ఆశయాలను నెరవేర్చేందుకు పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిలతో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అలా వైఎస్సార్ తెలంగాణ పార్టీలో ఆమె కీలకంగా వ్యవహరించారు. షర్మిలకు రాజకీయ సలహాలు ఇవ్వడం..పార్టీ సమావేశాల్లో లీడ్ రోల్ పోషిస్తూ యాక్టివ్ గా పని చేశారు. కాని అక్కడి గ్రూప్ రాజకీయాల వలన ఆమె పార్టీని వీడాల్సి వచ్చింది.
Also Read : బిగ్ బ్రేకింగ్ – ఆప్ కు ఇందిరా శోభన్ రాజీనామా
వైఎస్సార్ తెలంగాణ పార్టీని వీడిన కొంతకాలం ఆమె స్వతంత్రంగానే కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించి ఆప్ మరోసారి విజయం సాధించడం ఇందిరా శోభన్ ను ఆకర్షించింది. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్మన్ గా కీలక బాధ్యతలో కొనసాగారు. ఆమె నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు కాని అవేవి పెద్దగా జనాలను ఆకర్షించలేదు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా ఆప్ లోకి వలసలు ఉంటాయని అంచనా వేశారు కాని తెలంగాణలో పేరు మోసిన ఒక్క నేత కూడా ఆ పార్టీలో చేరలేదు. ఆ పార్టీ ఉనికి కూడా అంతతంగనే ఉండింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ఇస్తుండటం ఇందిరా శోభన్ కు నచ్చలేదు.
దేశంలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెబుతూనే..ఆయనకు మద్దతు తెలపడం సరైంది కాదంటూ ఆప్ కు రాజీనామా చేశారు ఇందిరా శోభన్. ప్రస్తుతం ఆమె ఏ పార్టీలో చేరుతారనేది సస్పెన్స్ గా మారింది. పార్టీకి రాజీనామా చేసిన తరువాత పలు ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ లోనే తనకు ప్రాధాన్యత దక్కిందని..ఆ పార్టీ ద్వారానే ఎక్కువ గుర్తింపు వచ్చిందని చెప్తున్నారు. దాంతో ఆమె కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారానికి బలం చేకూరినట్టు అవుతోంది.
తనకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం అందలేదని ఇందిరా శోభన్ చెప్తున్నారు. ఒకవేళ..ఇందిరా శోభన్ కాంగ్రెస్ లో చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంగీకరిస్తారా..? అనే అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒకవేళ.. పార్టీలో చేరినా మునుపటి ప్రాధాన్యత దక్కుతుందా..? లేదా..? పార్టీ నేతల నుంచి సహకారం ఉంటుందా..? అనే విషయాలను బేరీజు వేసుకొని పార్టీ మార్పుపై ఇందిరా శోభన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ..కాంగ్రెస్ లో చేరాలనే ఆహ్వానం అందితే.. ముషీరాబాద్ టికెట్ హామీపై పట్టుబట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి.. అక్కడ టికెట్ పై కన్నేసిన అనిల్ కుమార్ యాదవ్ ను కాదని ఇందిరా శోభన్ కు కట్టబెడుతారా..? అంటే కష్టమనే చెప్పాలి.