బీఆర్ఎస్ పేరుతో కొత్త ముసుగులో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రజలను మభ్య పెట్టేందుకు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందు కెసీఆర్ ఇచ్చిన హామీలను ఇంత వరకు ఏ ఒక్కటి అమలు చేయలేదని అ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ళలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాలను కెసీఆర్ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఆనాడు ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణలో అభివృద్దిని పట్టించుకోకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో రాష్ట్ర ప్రజల దృష్టిని మార్చాలని ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించింది.
కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం లేదని మండిపడ్డారు. అమరులు కలగన్న ఆకాంక్షలను కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పేరు మార్చి తెలంగాణతోనున్న అనుబంధాన్ని తెంచుకున్నారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని గద్దె దింపి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీని ఆధికారంలోకి తెచ్చేందుకు ఎన్నికల కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారన్నారు.
ఈ మేరకు హత్ సే హత్ జోడో యాత్ర ప్రాధాన్యత వివరిస్తూ రాష్ట్ర పభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చార్జిషీట్ ను విడదల చేసింది. ఏఐసీసీ కార్యక్రమాల కమిటి ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడుదల చేసిన ఈ చార్జిషీట్ లో కేసీఆర్ నెరవేర్చుతానన్న 13 హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. తెలంగాణ ప్రజలు, మేధావులు, దళితులు, గిరిజనులు, నిరుద్యోగులు మరియు రైతులు మాటల పోశెట్టి ట్రాప్ లో పడొద్దని కోరారు.
కాంగ్రెస్ చార్జిషీట్ లో బీఆర్ఎస్ పై మోపిన అభియోగాలివే….
*తొమ్మిదేళ్ళయినా కేజీ టూ పీజీ నిర్భంధ విద్యను ఎందుకు అమలు చేయలేదు..?
*నియామకాలు ఎక్కడకు పోయాయి?నిరుద్యోగులకు ఇస్తానన్న రూ.౩ వేల నిరుద్యోగ భృతి ఏమైంది?
*కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తా అంటూ ఎందుకు రద్దు చేయడం లేదు?
*డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఎందరికిచ్చరో చెప్పాలి.
*దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్న మాటేమాయే?
*తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగమని చెప్పి.. అసెంబ్లీలో ఆ మాట అనలేదని మాట మార్చడం నిరుద్యోగులను మోసం చేయడం కాదా?
*దళితులు, గిరిజనులకు మూడేకరాల భూ పంపిణి ఏమైంది?
*రైతులకు ఉచిత ఎరువులు ఏవి?
*ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ అమలేది?
*గొల్ల కుర్మలకు గొర్లేవి..?
*ఎస్సీ,ఎస్టీలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ఏమైంది.?
*ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు ఎక్కడ పారింది.?
*ప్రతి నియోజకవర్గానికో మెడికల్ కాలేజీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ,పాలీ టెక్నిక్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఏమయ్యాయి ?