తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ కేసీఆర్ దూకుడు పెంచుతున్నారు. ఎవరి పనితీరు ఎలా ఉంది..? ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు.? అనే దానిపై వరుసగా సర్వేలు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 25 మంది ఎమ్మెల్యేల పని తీరు బాగాలేదని కేసీఆర్ చేయించిన సర్వే ఫలితాల్లో తేలినట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారని.. వీరికి వచ్చే ఎన్నికలో టికెట్ దక్కడం కష్టమేనని పార్టీలో చర్చ జరుగుతుంది.
కేసీఆర్ మూడు నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశముందని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అందుకే బీఆర్ఎస్ లో టిక్కెట్ దక్కించుకోవాలనే ఆశావహుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. సిట్టింగ్ లపై వ్యతిరేకత ఉండటంతో గత ఎన్నికలో టికెట్ దొరకని నాయకులు ఈసారైన ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు.
ఇద్దరి మంత్రులపై తీవ్ర వ్యతిరేకత ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో ఉత్తర తెలంగాణకు చెందిన ఒకరు 2004 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. మరొకరు 2009 నుంచి ఇప్పటి వరకు ఓడిపోలేదు. ఈ ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో సిట్టింగ్ లకే అవకాశమిస్తే బీఆర్ఎస్ కు ఈసారి చావుదెబ్బ తప్పదని తేలినట్లు సమాచారం. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు వచ్చే ఎన్నికలో ఈసారైనా ప్రతిపక్ష అభ్యర్థిని గెలిపించేందుకు ప్లానింగ్లో ఉన్నారని రహస్యంగా నిర్వహించిన ఓ సర్వే ద్వారా కేసీఆర్ ఈవిషయాన్ని గ్రహించినట్లు తెలుస్తోంది. ఈ సమాచార నేపథ్యంలో కేసీఆర్ ఆ రెండు నియోజకవర్గాల్లో సిట్టింగులకు కాకుండా కొత్తవారికి టికెట్ ఇవ్వనున్నట్లు కేసీఆర్ భావిస్తున్నారు.
అయితే వచ్చే ఎన్నికల సమయం నాటికి టికెట్ ఎవరికీ దక్కుతుందని పార్టీ అంతర్గత విషయంలో చర్చ జోరుగా సాగుతుంది. ఇదిలా ఉండగా గతంలో ఎర్రబెల్లి 25 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్ర చర్చ సాగుతోంది. అందులో తమ పేరు ఉందా?లేదా? అని చాలా మంది ఎమ్మెల్యేలు డైలమాలో వున్నట్లు సమాచారం.