రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర కీలక నేతలకు అగ్నిపరీక్ష పెట్టేందుకు హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అగ్రనేతలపై బీజేపీలో ఆదరణ కల్గిన నేతలను బరిలో నిలిపేలా సమాలోచనలు జరుపుతోంది. గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీకి దిగుతానని గతంలో స్పష్టం చేసిన ఈటల రాజేందర్ ను గజ్వేల్ నుంచి పోటీలో నిలపాలని చూస్తున్నారు. ఆయనకు ఈ అంశంపై స్పష్టత ఉందేమో మరేదో కారణం స్పష్టత లేదు కానీ ఈటల మాత్రం గజ్వేల్ లో పర్యటనలు చేపడుతున్నారు .
మరోవైపు…బండి సంజయ్ ను కూడా కేటీఆర్ పై పోటీలో నిలపాలని ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి బండి వేములవాడ లేదా కరీంనగర్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ అధిష్టానం మాత్రం సిరిసిల్ల నుంచి బండి సంజయ్ ను బరిలో నిలపాలని భావిస్తోంది. సిద్దిపేటలో హరీష్ రావుపై బూర నర్సయ్యను, కామారెడ్డిలో కేసీఆర్ పై అరవింద్ ను పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది..? అని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తోంది. మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పై డీకే అరుణను, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పోటీలో నిలపాలని అనుకుంటున్నారు.
బీఆర్ఎస్ అగ్రనేతలపై బీజేపీ కీలక నేతలను బరిలో నిలపడం ద్వారా రెండు పార్టీలు ఒకటి కావనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపినట్లు అవుతుందని జాతీయ నాయకత్వం భావిస్తోంది. పార్టీ అధిష్టానం వ్యూహాలు ఎలా ఉన్నా…సిరిసిల్ల, గజ్వేల్ , సిద్దిపేటలో పార్టీ కీలక నేతలను పోటీకి దింపి వాళ్ళను బలి చేయనుందా..? అనే ప్రశ్నలు ఆ పార్టీ నాయకులే వ్యక్తపరుస్తారు. ఏదీ ఏమైనా… బీజేపీ పార్టీ ఓ రిస్క్ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుంది. ఇందుకోసం 20మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేయనుంది.
కేసీఆర్ పై ఈటల..కేటీఆర్ పై బండి.. హరీష్ పై బూర నర్సయ్యలు పోటీ… బీజేపీ జాబితా, స్ట్రాటజీ ఇదేనా..?
