Site icon Polytricks.in

ఆ రెండు పథకాలే కేసీఆర్ ను ప్రధానిని చేస్తాయనుకుంటున్నారా..?

తమది జాతీయ పార్టీ అని ప్రచారం చేసుకుంటున్న కారు పార్టీ నేతలకు ఎన్నికల సంఘం ఇటీవల షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును తెలంగాణకు మాత్రమే పరిమితం చేసింది. ఎన్నికల సంఘం ప్రకటన వెలువడిన రెండు రోజులకే కేసీఆర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని ప్రకటించారు. ఆయన ధీమా ఏంటో కానీ కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఆ పార్టీ నేతలకు కూడా నవ్వు తెప్పించి ఉండొచ్చు. కేసీఆర్ ది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా దేశాన్ని ఏలేందుకు ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయని అభిప్రాయపడుతున్నాయి రాజకీయ వర్గాలు.

బీఆర్ఎస్ ను జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా నిలబెట్టేందుకు రెండే రెండు పథకాలు చాలునని కేసీఆర్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకటి రైతు బంధు. రెండోది దళిత బంధు. ఈ రెండు పథకాలతో బీఆర్ఎస్ ను దేశప్రజలు సొంతం చేసుకుంటారని కేసీఆర్ అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. దళిత బంధు , రైతు బంధు రెండు నగదు బదిలీ పథకాలే. ఈ రెండు పథకాల్లో ఎలాంటి ఆంక్షలు లేవు. దళిత బంధు అర్హతకు కేవలం దళితుడు అయితే చాలు. రైతు బంధుకు అర్హత సాధించాలంటే కొంచెం సొంతం భూమున్న చాలు. ఈ రెండు పథకాలతో సర్కార్ సాయం పొందొచ్చు. ఈ రెండు పథకాలే బీఆర్ఎస్ ను బలంగా మార్చుతాయని.. అవే ప్రధాని పీఠాన్ని ఎక్కిస్తాయని  కేసీఆర్ ధీమాగా ఉన్నట్టు చెబుతున్నారు.

దళిత బంధు పథకం ద్వారా కుటుంబానికి పది లక్షలు అందిస్తున్నామని ఇప్పటివరకు నలభై వేల కుటుంబాలకు అందించామని…బీఆర్ఎస్ కు అవకాశం ఇస్తే దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెబుతున్నారు. రైతు బంధు ద్వారా ఎకరానికి సంవత్సరానికి పదివేల చొప్పున ఇస్తున్నారు. ఐదు ఎకరాలు ఉంటె సంవత్సరానికి యాభై వేలు. ఈ పథకాలకు ఆకర్షితులు కానీ వారెవరు ఉండరనేది కేసీఆర్ భావన. అందుకే రైతు బంధు, దళిత బంధు పథకాల గురించి విశేషంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. దేశ ప్రజలు ఈ పథకాలను విశ్వసించాలంటే తెలంగాణలో అమలు చేసినట్లు చూపించాలని అనుకుంటున్నారు. అందుకే పొరుగు రాష్ట్రాల్లో ప్రచారం ప్రారంభించారు.

తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు బోలెడు ఉన్నా ఈ రెండు పథకాల గురించే ఎక్కువ ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్. స్థానిక పథకాలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభించేలా చేసుకోవడంలో కేసీఆర్ ను మించిన రాజకీయ నాయకుడు ఎవరూ లేరు. అందుకే ఈ రెండు పథకాలే బీఆర్ఎస్ ను దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మార్చుతాయని కేసీఆర్ అనుకుంటున్నట్లు కనిపిస్తోంది.

Also Read : కర్ణాటకను వదిలేసి మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభ – ఇవేం జాతీయ రాజకీయాలు..?

Exit mobile version