తెలంగాణ ఆకాంక్షల కోసం పుట్టి…ఆత్మను వదిలేసి త్వరలోనే కాలగర్భంలో కలిసిపోనున్న పార్టీ బీఆర్‌ఎస్. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి పట్టించుకోలేదు. అధికారం పోయిన తర్వాత కార్యకర్తల్ని ఆగం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ ఈ స్థితికి వచ్చేందుకు ప్రధాన కారణం కేటీఆర్ అనే వాదన కార్యకర్తల్లో వినిపిస్తోంది. ఎప్పుడైతే కేటీఆర్ చేతికి పార్టీ పగ్గాలు వెళ్లాయో..అప్పుడే బీఆర్ఎస్ నాశనానికి పునాది పడిందనే అభిప్రాయంలో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వాదుల్ని దూరం పెట్టి కేసీఆర్ తప్పు చేస్తే…వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్టీ జెండా మోసిన కార్యకర్తల్నే పక్కన పెట్టారు కేటీఆర్. దీంతో అసలు బ్యాచ్ మొత్తం పక్కకు వెళ్లింది…కేవలం కేటీఆర్ కోటరీ మాత్రమే మిగిలింది.
2020 సంవత్సరంలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీ క్రమంగా ఉనికి కోల్పోతూ వస్తున్నది. వరుస పరాజయాలతో పార్టీని అధఃపాతాళానికి పడిపోయేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక టీఆర్‌ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చారు. అప్పుడే పార్టీ ఆత్మ పోయింది. ఇక కేటీఆర్ అహంకారపూరిత మాటలు, వ్యవహారశైలితో బీఆర్ఎస్ ను మొదటి నుంచి ఆదరిస్తూ వస్తున్న మాస్ జనాలు క్రమంగా దూరమయ్యారు. బీఆర్ఎస్‌ను ఒక పార్టీలాగా కాకుండా కార్పొరేట్ కంపెనీలాగా తయారు చేశాడని కేటీఆర్‌ను బహిరంగా విమర్శించే కట్టర్ గులాబీ కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. జనాల్లోకి వెళ్లి ప్రచారం చేయడం మానేసి…కేవలం సోషల్ మీడియాను మాత్రమే చూసి మురిసిపోతున్నాడని విమర్శిస్తున్నారు. కేవలం కార్యకర్తలే కాదు…నిన్నటికి నిన్న కవిత కూడా బహిరంగంగా కేటీఆర్‌కు ఇదే సూచన చేసింది. వాపును చూసి బలుపు అనుకోవద్దు…జనంలోకి వెళ్తే మన పరిస్థితి ఏంటో తెలుస్తుందని కేటీఆర్‌కు సూచించింది.

కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది. ఆ వెంటనే వచ్చిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టపోయినట్లు ఎడ్జ్‌లో బయటపడింది. వెనువెంటనే వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో చావు దెబ్బ తిన్నది. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అధికారానికే దూరమైంది. ఆ తర్వాత ఆరు నెలలకే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్నాకు పరిమితమైంది. సిట్టింగ్ స్థానాలైన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌లో ఎలా ఘోర పరాజయం పాలైందో అంతా చూశారు. ఇలా ఎన్నిక ఏదైనా సరే కేటీఆర్ అడుగు పెట్టాడంటే బుగ్గిపాలు అన్నట్లు తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి.
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఒక కోటరీని తయారు చేసుకొని…సోషల్ మీడియాలో తనపై తానే బిల్డప్ వీడియోలు తయారు చేయించుకొని..వాటిని ఫేక్ అకౌంట్లతో వైరల్ చేయించి సంబురపడుతున్నాడని కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పార్టీని నడపడటం అంటే ఏదో సాఫ్ట్ వేర్ సంస్థను నడపడం అన్నట్లు ఉన్న కేటీఆర్ వ్యవహారశైలి సరికాదంటున్నారు. కేవలం వ్యక్తగత స్వార్ధం మినహా పార్టీకోసం ఎన్నో ఏళ్లుగా గ్రౌండ్‌లో పనిచేస్తున్న మంచి చెడు ఎన్నడూ చూడలేదని వాపోతున్నారు. ఒకవైపు కేసీఆర్ ఫామ్‌హౌజ్ వదిలి రాడు…మరోవైపు కేటీఆర్ సోషల్ మీడియా ఇప్పట్లో వదిలేడా లేడు…అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో విలీనం చేసేందుకే కావాలని పార్టీని నాశనం చేస్తున్నారని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు.