Polytricks.in

పల్లె, పట్టణం తేడా లేదు…అన్నిచోట్లా కాంగ్రెస్‌ హవా పంచాయతీ ఎన్నికల్లో 56 శాతం స్థానాల్లో గెలుపు

ఎన్నికలు ఏవైనా సరే తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ రోజురోజుకూ పెరుగుతూనే వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం ఓట్‌షేర్‌తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గడిచిన రెండేళ్లలో ప్రజలు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్‌షేర్ పెరుగుతూనే వస్తుంది. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏకంగా 50 శాతానికి పైగా ఓట్‌షేర్ దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ ఉండదు.

అయితే జూబ్లీహిల్స్‌లాంటి అర్బన్ ఏరియాలో మాత్రమే కాదు..పల్లెల్లో కూడా మూడురంగుల జెండాకు నీరాజనం పట్టారు ప్రజలు. తాజాగా మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధులు జయకేతనం ఎగురవేశారు. ఏకంగా 56 శాతం స్థానాలను దక్కించుకున్నారు. అంతేకాదు ఓట్‌ షేరింగ్‌లోనూ గత రికార్డులను బద్దలు కొట్టింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీతో పోలిస్తే ..కేవలం రెండేళ్లలోనే ఏకంగా 16 శాతం ఓట్‌ షేరింగ్‌ పెంచుకోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రజాపాలనపై పల్లె, పట్టణం అని తేడా లేకుండా ప్రతిచోటా నమ్మకం పెరుగుతుందనడానికి ఇదే నిదర్శనం.

తెలంగాణలోని మొత్తం 31 జిల్లాల్లోని 12,733 పంచాయతీ సర్పంచి పదవులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 3,502 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. బీజేపీ 688 స్థానాలు పొందగా… ఇతరులు 1,505 స్థానాల్లో గెలిచారు. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కాంగ్రెస్‌ తిరుగులేని మెజార్టీతో దూసుకుపోయింది.

Exit mobile version