Polytricks.in

ప్ర‌జా ప్ర‌భుత్వ విజ‌యోత్స‌వాల‌ను నీరుగార్చేందుకు BRS కుట్ర‌, బీఆర్ఎస్ ర‌హ‌స్య ఎజెండా ఇదే!

కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్తి అవుతున్న‌ది. కేవలం ఏడాదిలోనే రుణ‌మాఫీ, ఉద్యోగాల క‌ల్ప‌న స‌హా అనేక అంశాల్లో రేవంత్ రెడ్డి సాధించిన విజ‌యాలు బీఆర్ఎస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ల‌క్ష రూపాయ‌ల రుణ‌మాఫీ కోసం ఐదేళ్లు రైతుల్ని త‌మ చుట్టు తిప్పుకున్న కేసీఆర్ ప్ర‌భుత్వం ఎక్క‌డ‌.. ఒకే విడ‌త‌లో రెండు ల‌క్ష‌లు మాఫీ చేసిన ప్ర‌జా ప్ర‌భుత్వం ఎక్క‌డ అని రైతుల్లో చ‌ర్చ మొద‌లైంది. మెగా డీఎస్సీ ప్ర‌క్రియును చ‌క చ‌కా పూర్తిచేసిన రేవంత్ స‌ర్కారుపై నిరుద్యోగ యువ‌త ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, ఆరోగ్య శ్రీ పెంపుతో ల‌బ్ది పొందిన కుటుంబాలు ప్ర‌భుత్వాన్ని ఆశీర్వ‌దిస్తున్నాయి. దేశంలోనే అతి ఎక్కువ వ‌రి పండిచిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇలా రాష్ట్రం ప‌చ్చ‌బ‌డుతుంటే గులాబీ నేత‌ల క‌ళ్ల‌లో నిప్పులు పోసుకుంటున్నారు.

ఏడాది సంబురాల‌ను నీరు గార్చాల‌ని ప‌క్కా ప‌థ‌కం రచించారు. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కుట్ర‌లు చేసి అమాయ‌క గిరిజ‌నుల్ని రెచ్చ‌గొట్టారు. దీని వెనుకున్న కుట్ర బ‌య‌ట‌ప‌డ‌టంతో మ‌ళ్లీ డైవ‌ర్ష‌న్ మొద‌లు పెట్టారు. ఈ సారి అభం శుభం ఎరుగ‌ని గురుకుల విద్యార్ధుల‌ను స‌మిధ‌లుగా మార్చుతున్నారు. ఇందుకోసం త‌న నెట్ వ‌ర్క్ ను యాక్టివేట్ చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అధిష్టానం నుంచి వ‌చ్చిన ఆదేశాల‌ను వ‌రుస‌గా అమ‌లు చేస్తూ వ‌చ్చారు. దీంతో గ‌డిచిన ప‌ది నెల‌లుగా అంతా మంచిగానే ఉన్న గురుకులాల్లో ఇలా వ‌రుస ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. గ‌డిచిన 15 రోజులుగా గురుకులాల్లో ఫుడ్ పాయిజ‌నింగ్ జ‌రుగుతోంది. కొన్ని చోట్ల ఒక‌టికి రెండు సార్లు విద్యార్ధులు అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నారు. వీటిని త‌మ‌కు అనుకూల సోష‌ల్ మీడియాల్లో పెట్టి విస్తృత ప్రచారం నిర్వ‌హిస్తున్నారు. ఇలా వ‌రుస ఘ‌ట‌న‌లు జరుగ‌డం…బీఆర్ఎస్ పార్టీ వెంట‌నే గురుకుల బాట ప్ర‌కటించ‌డం అన్నీ ప‌క్కా ప‌థ‌కంలో భాగంగా జ‌రిగిన‌వే అని తెలుస్తోంది.

ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తే బీఆర్ఎస్ చేస్తున్న కుట్ర‌లు అర్ధ‌మ‌వుతాయి. గురుకులాల్లో ఇప్పుడున్న ఫుడ్ కాంట్రాక్ట‌ర్లు బీఆర్ఎస్ పార్టీ హ‌యాంలో నియ‌మించిన‌వారే. అంతేకాదు వాళ్లంతా ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కు స‌న్నిహితులు. వారినే ప్ర‌స్తుత ప్ర‌భుత్వం కొన‌సాగిస్తోంది. ఒక‌టి రెండు ప్రాంతాల్లోనే వ‌రుసగా ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు జ‌రుగ‌డం చూస్తే కావాల‌ని చేస్తున్న‌ది అని తెలుస్తోంది. అంతేకాదు ప‌ది నెల‌లుగా లేని ఘ‌ట‌న‌ల‌ను…వ‌రుస‌గా ఎందుకు జ‌రుగుతున్నాయి. అది కూడా ప్ర‌భుత్వం విజ‌యోత్స‌వాల‌ను ప్ర‌క‌టించిన వెంట‌నే ఫుడ్ పాయిజ‌నింగ్ ఘ‌ట‌న‌లు న‌మోద‌వుతున్నాయి. వీట‌న్నింటికి మించి బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ అధికారిగా ఉన్న‌ప్పుడు ఏర్పాటు చేసుకున్న స్వేరో నెట్ వ‌ర్క్ చాలా బ‌లంగా ప‌నిచేస్తోంది. అప్ప‌ట్లో ఆయన నియ‌మించిన అధికారులు ఇప్పుడు స్వామి భక్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కాంట్రాక్ట‌ర్లు కూడా వాటికి త‌లూపుత‌న్నారు. ఇలా బీఆర్ఎస్ హయాంలో జ‌రిగిన నియామ‌కాల‌తో గురుకులాల్లో ఫుడ్ పాయిజ‌న్ కుట్ర‌లు జ‌రుగుతున్న‌ట్లు స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది.

ఇంత జ‌రుగుతున్నా..కుట్ర‌ల‌కు సంబంధించి స్ప‌ష్టంగా ఆధారాలు క‌నిపిస్తున్నా అధికారులు, కాంట్రాక్టర్ల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. అమాయ‌క విద్యార్దుల‌ను స‌మిధ‌లుగా మార్చుతున్న బీఆర్ఎస్ కుట్ర‌ల‌పై ప్ర‌భుత్వం సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకోవాల‌ని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం తెలంగాణ గురుకుల వ్య‌వస్థ‌పై ప్ర‌భావం చూపే ఇలాంటి కుట్ర‌ల‌ను సాగ‌నివ్వ‌కూడ‌ద‌ని అంటున్నారు. కాంట్రాక్ట‌ర్లు, ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ అనుచ‌రుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డిని విద్యార్ధి నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version