Site icon Polytricks.in

బాయి మోటర్లకు మీటర్లు అంశంలో నిజమెంత..?

అప్పు చేసి పప్పు కూడు…
*********************
బాయి దగ్గర మీటర్లు పెట్టాలని విద్యుత్ సవరణలు కేంద్రం తెస్తుందంటూ ముఖ్యమంత్రి పదే, పదే చెబుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు.

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదంటూ కేంద్రం తన విధానాన్ని జూలై, 2021 లో (Revamped Distribution Sector Scheme-RDSS) ప్రకటించింది. దానికి అనుగుణంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు 2022 లో ఎక్కడా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టాలన్న అంశం చేర్చలేదు.

పంపు సెట్లకు మీటర్లు పెట్టడానికి టి‌జే‌ఏ‌సి వ్యతిరేకం. (ట్రాన్స్ ఫార్మర్ వద్ద కానీ, ఫీడర్ వద్ద కానీ మీటర్లు పెట్టడం శాస్త్రీయం). కానీ విద్యుత్ సంస్థలు ప్రభుత్వ ఆదేశాలమేరకు వినియోగదారులకు సరఫరా చేస్తున్న రాయితీ విద్యుత్తుకు పూర్తి సబ్సిడీలు ప్రభుత్వమే చెల్లించాలి. లేకుంటే విద్యుత్ సంస్థలు కుప్పకూలి పోతాయి. వినియోగదారులకు ఉచిత విద్యుత్తు కాదు కదా… అసలు సరఫరా చేయడానికి విద్యుత్తు కొనలేని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితులు ఇప్పటికే నెలకొన్నాయి.

అప్పు చేసి పప్పు కూడు లా మన రాష్ట్ర ప్రభుత్వ విధానం ఉంది. తెలంగాణ వచ్చిన 8 ఏళ్లలో విద్యుత్ సంస్థలు 50 వేల కోట్ల నష్టాల్లో పీకల్లోతు కూరుకు పోయాయి. అదనంగా ప్రభుత్వ బకాయిలు 18000 కోట్ల రూపాయలు దాటాయి. విద్యుత్ సంస్థలు ఏర్పడ్డప్పడినుండి ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. చరిత్రలోలేని విధంగా, మన విద్యుత్ సంస్థల రేటింగు C – (సీ-మైనస్) కు పడిపోయింది. బ్యాంకులు అప్పులివ్వడానికి జంకుతున్నాయి. ఈ పరిస్థితులనుండి విద్యుత్ సంస్థలను బయట పడేయాలంటే, ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు, బకాయిలు తక్షణం చెల్లించాలి. లేకుంటే విధ్యుత్ సంస్థలు చేతులెత్తేసే రోజులు ఎంతో దూరంలో లేవు…

Exit mobile version