Site icon Polytricks.in

ఎంఐఎం పోటీ చేసే ఆ 50 స్థానాలు ఇవే..?

బీఆర్ఎస్ కు వెన్నుదన్నుగా నిలిచే ఎంఐఎం ఇప్పుడు మిత్ర పక్షానికే సవాల్ విసురుతోంది. మాది ఏడు సీట్ల పార్టీ కాదు…వచ్చే ఎన్నికల్లో మేమెంటో చూపిస్తామని మంత్రి కేటీఆర్ కు అసెంబ్లీలో అక్బర్ సవాల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీ ఎప్పుడు జ‌రిగినా అక్బ‌రుద్దీన్ వ‌ర్సెస్ కేటీఆర్ సీన్ ఉంటూనే ఉంటుంది. ఆ త‌ర్వాత అంతా భాయ్- భాయి అన్నట్లుగా మింగిల్ అవుతారు. శనివారం నాడు అసెంబ్లీలో కేటీఆర్ కు మాట‌కు మాట జ‌వాబు చెప్పిన అక్బ‌ర్ సైతం మేం బీఆర్ఎస్ తోనే కలిసి సాగుతామని ప్రకటించారు. ఇందంతా బాగానే ఉన్నా క‌నీసం 15మంది ఎమ్మెల్యేల‌తో మ‌జ్లిస్ అసెంబ్లీలోకి అడుగుపెడుతుంద‌న్న అక్బర్ వ్యాఖ్య‌లే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

దారుసలేంలో ఎంఐఎం పార్టీ విస్తరణ కోసం ఎప్పటి నుంచో స్కెచ్ గీస్తున్నారు. ఈ క్రమంలోనే అక్బర్ చేసిన వ్యాఖ్యలు ఆవేశంతో కాదు. అన్ని తెలిసే అన్నట్టు తెలుస్తోంది. మజ్లిస్ కు పట్టున్న ప్రాంతాలేవి..? ఏయే స్థానాల్లో పార్టీ పోటీ చేయవచ్చు..? అనే అంశాలపై చర్చించి.. అనేక సమాలోచనల తరువాతే ఇప్పుడున్న 7 స్థానాల‌కు అద‌నంగా మ‌రో 8గెలుచుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు ఓవైసీ బ్ర‌ద‌ర్స్ అంచనాకు వచ్చారు.

ఎంఐఎం పోటీ చేస్తుందంటే.. అక్కడ ముస్లిం ఓటర్లు లెక్కను చూసుకొని బరిలోకి దిగుతుంది. ముస్లిం ఓటర్లు గెలుపును నిర్దేశించే స్థాయిలో ఉంటె..అదనంగా ఎస్సీ-ఎస్టీ సామాజిక వ‌ర్గ ఓటర్లను కూడగట్టుకునే విధంగా ట్రై చేస్తోంది. కేవ‌లం ముస్లీం నేత‌ల‌కే కాకుండా ఇత‌ర మ‌తాల లీడ‌ర్ల‌కు కూడా టికెట్ ఇచ్చి పోటీ చేయించాల‌ని, గెలిచే అవ‌కాశం ఉన్న నేత‌ల‌ను పార్టీలోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

అలా గుర్తించిన స్థానాల్లో… గ‌తంలో నిజామాబాద్ అర్బ‌న్ స్థానంలో ఎంఐఎం 23.5శాతం ఓట్లు తెచ్చుకుంది. అక్క‌డ గెలిచిన టీఆర్ఎస్ అభ్య‌ర్థికి 31శాతం ఓట్లే వ‌చ్చాయి. రాజేంద‌ర్ న‌గ‌ర్, అంబ‌ర్ పేట వంటి స్థానాల్లోనూ ఎంఐఎం బ‌లంగానే ఉంది. వీటికి తోడు… కరీంన‌గ‌ర్, ఖ‌మ్మం, సంగారెడ్డి, నిర్మ‌ల్, ముథోల్, అదిలాబాద్, బోధ‌న్, కామారెడ్డి, సిర్పూర్, కోరుట్ల‌, భువ‌న‌గిరి, వ‌రంగ‌ల్ ఈస్ట్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, జ‌హీరాబాద్, షాద్ న‌గ‌ర్, వికారాబాద్ స్థానాల్లో త‌మ గెలుపుకు అవ‌కాశం ఉంద‌ని తేలింద‌ని తెలుస్తోంది. ఈ స్థానాల‌పై ఇప్ప‌టికే ఫోక‌స్ పెట్టిన ఎంఐఎం ప‌ని ప్రారంభించింద‌ని, ఆ ఆలోచ‌న‌తోనే వచ్చే ఎన్నికల్లో యాభై చోట్ల పోటీ చేస్తామని అన్నట్లు తెలుస్తోంది. 15మంది ఎమ్మెల్యేల‌తో అసెంబ్లీకి వ‌స్తాం… 7 సీట్ల పార్టీ కామెంట్ కు జ‌వాబు చెప్తామని అక్బ‌ర్ ఎదురుదాడి చేసిన‌ట్లు తెలుస్తోంది.

పాత‌బ‌స్తీ మిన‌హా ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయ‌టం ద్వారా ఎంఐఎం గెలుపు అవ‌కాశాలు ఎలా ఉన్నా, పోటీ చేసిన స్థానాల్లో ఓట్ల చీలిక ఎక్కువ‌గా ఉంటుంద‌ని… త‌ద్వారా బీజేపీ, కాంగ్రెస్ ల‌కు లాభం ద‌క్కుండా మ‌ళ్లీ బీఆర్ఎస్ గెలుపుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Exit mobile version