Polytricks.in

తారకరత్న కండిషన్ సీరియస్ – ఆసుపత్రికి ఎన్టీఆర్

నందమూరి తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన తాజా హెల్త్ బులిటెన్ ను నారాయణ హృదయాలయ వైద్యులు విడుదల చేశారు.

“మాక్సిమమ్ లైఫ్ సపోర్ట్ కొనసాగిస్తున్నాము. పలు విభాగాలకు చెందిన వైద్యులు ఆయనను ఎప్పటికప్పుడు పరిక్షిస్తున్నారు. చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉందని పేర్కొన్నారు. దీంతో నందమూరి అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

నందమూరి తారకరత్నను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం బెంగళూర్ వెళ్ళారు. తారకరత్న చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలకృష్ణ అక్కడే మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా బెంగళూర్ వెళ్ళారు.

అన్నదమ్ములిద్దరూ కుటుంబ సభ్యులతో పాటు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి వస్తున్నారని తెలుసుకొని టీడీపీ కార్యకర్తలు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి భారీగా చేరుకున్నారు. తారకరత్నకు ఏమవుతుందోనన్న ఆందోళన కొనసాగుతోంది. అయితే అభిమానులు ఆయన తిరిగి వస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జనవరి 27 మధ్యాహ్నం కుప్పంలో లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న తారకరత్నను పక్కనే ఉన్న కార్యకర్తలు, గార్డ్స్ వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తారకరత్న కండిషన్ క్రిటికల్ గా ఉందని వైద్యులు గుర్తించారు. ఆయన పల్స్ రేటు కూడా పడిపోయింది. సీపీఆర్ చేయడం ద్వారా పల్స్ మెరుగైనట్లు వెల్లడించారు.

మెరుగైన వైద్యం కోసం శుక్రవారం అర్ధరాత్రి బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నారు.

Exit mobile version