Site icon Polytricks.in

అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి

తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు తెలుస్తోంది. 22 రోజులుగా బెంగళూర్ నారాయణ హృదలయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. మరికాసేపట్లో నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.

కోమాలోకి వెళ్లిన తారక రత్నను స్పృహ లోకి తీసుకొచ్చేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. ఇటీవల ఆయనకు బ్రెయిన్‌ స్కాన్‌ చేశారు. తారకరత్న ను కాపాడుకునేందుకు విదేశీ వైద్యుల బృందంను ఇండియాకు రప్పించారు.వారి ఆధ్వర్యంలో తారకరత్నకు ప్రత్యేక చికిత్స కొనసాగుతోంది. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగు పడటం లేదని సమాచారం.

మరోవైపు… తారకరత్న ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది అనే సమాచారం అందుకున్న నందమూరి కుటుంబ సభ్యులు వెంటనే బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి బయల్దేరి వెళ్లారు. హీరో బాలకృష్ణ తన షెడ్యూల్ ను కూడా పక్కన పెట్టేసి హుటాహుటిన బెంగళూర్ బయల్దేరారు.

జనవరి 26న టీడీపీ యువనేత నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. ఈ క్రమంలో లోకేష్‌ తో పాదయాత్ర చేస్తూ తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను హుటాహుటిన కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.

ఆపై మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి తారకరత్న కోలుకునేందుకు వైద్యులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విదేశీ వైద్యులను పిలిపించి మరీ తారకరత్నకు వైద్యం అందిస్తున్నారు. మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుతున్నారు.

Exit mobile version