కొండపోచమ్మ కాల్వకు గండి…కొండపోచమ్మ రిజర్వాయర్ కే గండిపడితే…?

కొండపోచమ్మ కాల్వకు గండి…కొండపోచమ్మ రిజర్వాయర్ కే గండిపడితే…? జరిగే ఆస్తి, ప్రాణ నష్టాలకు బాధ్యత ఎవరిది…?


👉కొండపోచమ్మ కాల్వకు శివారు వెంకటాపూర్ గ్రామం వద్ద గండి పడింది… గ్రామంలో ఇళ్లలోకి, పొలాల్లోకి పెద్దఎత్తున నీళ్ళు వచ్చాయి. జరిగిన నష్టం వివరాలు ఇంకా తెలియలేదు.

👉అధికారిక అంచనాల ప్రకారమే కొండపోచమ్మ రిజర్వాయర్ కు నీళ్ళు ఎత్తిపోయడానికి ఒక టి‌ఎం‌సి కి అయ్యే విద్యుత్ ఖర్చు సుమారు రూ 45 కోట్లు. దీనికి పెట్టుబడి, వడ్డీలు, నిర్వహణ ఖర్చులు మొత్తం కలిపితే ఒక టి‌ఎం‌సి కి అయ్యే ఖర్చు వంద కోట్ల రూపాయల పైమాటే…పడిన గండికి కాంట్రాక్టరు మట్టి పూడ్చి చేతులు దులుపుకుంటాడా? లేక కోట్ల రూపాయల నీటి ఎత్తిపోతల ఖర్చును కూడా కాంట్రాక్టరు నుండి వసూలు చేస్తారా?

👉కాంట్రాక్టరు బాధ్యత నిర్మాణం పూర్తయ్యాక ఒకటో , రెండు సంవత్సరాలో ఉంటుంది. ఆ తరువాత బయటపడే లోపాలకు కాంట్రాక్టరు బాధ్యత వహించడు. దశాబ్దాలు మన్నాల్సిన కాంక్రీటు కట్టడాలలో నెలలోనే ఇన్ని లోపాలు బయటపడుతున్నాయంటే, ఏడాది, రెండేళ్ల గ్యారెంటీ పీరియడ్ తరువాత జరిగే నష్టాలకు బాధ్యత ఎవరిది? ప్రజల నెత్తిన రుద్దాల్సిందేనా? సివిల్ కట్టడాలలో నిర్మాణ లోపాలు మొదట్లోనే సరిదిద్దకుంటే, రిపేర్ల వ్యయం దీర్ఘకాలంలో భారీగా ఉంటుంది.

👉కొండపోచమ్మను అట్టహాసంగా ప్రారంభం చేసిన నెలరోజుల్లో కాల్వకు గండిపడడం ఇది రెండో సారి… కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయిన ప్రతీ ఛోటా పెద్ద ఎత్తున రేపేర్లు… ఇది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతపై అనుమానాలు రేకెత్తిస్తున్నది…

👉కాల్వకు గండిపడితేనే పరిస్తితి ఇలా ఉంది… ఇక 13 టి‌ఎం‌సి ల సామర్ధ్యం గల కొండపోచమ్మ రిజర్వాయర్ కు గండి పడితే పరిస్థితేంటి…? (13 టి‌ఎం‌సి లు అంటే ట్యాంక్ బండ్ సామర్ధ్యం కన్నా 15-20 రేట్లు ఎక్కువ). రిజర్వాయర్ ఇంకా పూర్తిగా నిండలేదు. రిజర్వాయర్ నాణ్యత ఇంతకన్నా భిన్నంగా ఉంటుందని గ్యారెంటీ ఏమిటి? రిజర్వాయర్ కు గండి పడితే జరిగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వూహించగలమా? వేలకోట్లు తీసుకుని కాంట్రాక్టర్లు ఇంత నాసిరకం కట్టడాలు నిర్మించడమేమిటి? బాధ్యత ఎవరిది?

👉భారీ అప్పులతో నిర్మించిన ప్రాజెక్టుల జీవితకాలం మూడునాళ్ళ ముచ్చట కాకూడదు. డబ్బులు తీసుకుని కాంట్రాక్టరు ఉడాయించే ప్రమాదం ఉంది. లక్ష కోట్లపైగా పెట్టుబడి పెట్టి కట్టిన మొత్తం ప్రాజెక్టుల నాణ్యతపై ప్రభుత్వం ఇంజనీరింగ్ నిపుణుల కమిటీతో రివ్యూ చేయించాలి. లోపాలుంటే యుద్దప్రాతిపదికన సరిదిద్దే చర్యలు తీసుకోవాలి. నిర్మాణంలో ఉన్న మల్లన్న సాగర్ లాంటి అతి భారీ ప్రాజెక్టుల నాణ్యతపై, సాంకేతిక అంశాలపై నిర్మాణ దశనుండే మరింత జాగ్రత్త వహించాలి. లేకుంటే భారీ ఆస్తి నష్టం తో పాటు ప్రాణనష్టం తప్పదు.


తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ,
రాష్ట్ర కమిటీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *