Site icon Polytricks.in

వరాల జల్లు సరే..బీఆర్ఎస్ సర్కార్ వద్ద నిధులేవి..?

కేసీఆర్ తన మార్క్ పాలన ఏంటో మరోసారి చూపిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కేసీఆర్ ఆదేశించారు. నాలుగున్నరేళ్ళుగా పెండింగ్లో ఉంచిన రైతు రుణమాఫీని నేటి నుంచి ప్రారంభించాలన్నారు. సెప్టెంబర్ 2వ వారం వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. గతంలోనూ కేసీఆర్ ఇలాగే చెప్పి వెనక్కి తగ్గారు. ఇప్పుడు కూడా రైతు రుణమాఫీని పూర్తి చేస్తారా..? లేక కొంతమందికి రుణమాఫీ చేసి చేత్తులేత్తెస్తారా..?అనే అనుమానాలు కల్గుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. రుణమాఫీ చేసేందుకు కావాల్సిన రూ. 19వేల కోట్ల నిధులను నెల రోజుల వ్యవధిలో ఎలా సమీకరించుకుంటారు..? అనే అంశం ఈ అనుమానాలను రెట్టింపు చేస్తోంది.

కేసీఆర్ కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పై ఏయే వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారోనని ఆరా తీశారు. పార్టీకి ఉన్న మైనస్ లను ప్లస్ చేసుకోవాలనుకున్నారు. అందుకే ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలిన తరువాత ప్రభుత్వంలో విలీనం చేస్తామని వారిని కూల్ చేసే ప్రయత్నం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వ్యతిరేకత ఉందని తేలడంతో మెట్రో విస్తరణతో వారిని అనుకూలంగా మార్చుకున్నారు. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధులను ప్రారంభించి బీఆర్ఎస్ పట్ల కొద్దోగొప్పో వ్యతిరేకతను తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక రైతు బంధు అందుతున్నా రుణమాఫీ చేయకపోవడం బీఆర్ఎస్ కు మైనస్ గా.. కాంగ్రెస్ కు ప్లస్ గా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏక కాలంలోనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని..ఈ అంశాన్ని రైతుల్లోకి బలంగా తీసుకెళ్ళింది. దాంతో కేసీఆర్ ఎన్నికల ముంగిట నిధులను ఎలాగైనా సమీకరించుకోవచ్చు అనుకున్నారేమో. వెంటనే రేపటి నుంచే రుణమాఫీ ప్రక్రియ చేపట్టాలంటూ ఆదేశించారు. అయితే , 19వేల కోట్ల నిధుల సమీకరణ కోసం ఎంత ప్రభుత్వ భూములు అమ్మినా నిధుల సమీకరణ కష్టమే. కానీ కేసీఆర్ ఏదో మ్యాజిక్ చేయాలనుకుంటున్నారు.

కానీ ఎన్నికల నాటికీ హామీలను పూర్తిగా అమలు చేయకపోతే ఆయా వర్గాల ప్రజల ఆగ్రహం ఓటు రూపంలో ప్రతిబింబించే అవకాశం వంద శాతం ఉంది. అదే బీఆర్ఎస్ కొంప ముంచనుంది.

Also Read : కేసీఆర్ ను నమ్మొచ్చా..? ఆ భయమే ఈ హామీల ప్రకటనకు దారితీసిందా..?

Exit mobile version