Polytricks.in

వాజేడు ఎస్సై ఆత్మ‌హత్య వెనుక అస‌లు కార‌ణాలివే! విచార‌ణలో వెలుగులోకి కీల‌క విష‌యాలు

ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ ఆత్మ‌హ‌త్య క‌ల‌క‌లం సృష్టిస్తోంది. స‌ర్వీస్ రివాల్వ‌ర్ తో కాల్చుకొని ఆయ‌న ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డారు. రెండు రోజులుగా ఆయ‌న ప‌నిచేస్తున్న పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో వ‌రుస ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఇన్ ఫార్మ‌ర్ల నెపంతో ఇద్ద‌రిని మావోయిస్టులు చంపేశారు. ఆ త‌ర్వాత రోజే భారీ ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. ఇందులో ఏడుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు. మ‌రుస‌టి రోజు తెల్ల‌వారుజామున ఎస్సై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. దీంతో ఆయ‌న మ‌ర‌ణానికి కార‌ణాల‌పై అనేక క‌థ‌నాలు వ‌చ్చాయి. ఎన్ కౌంట‌ర్, ఇన్ ఫార్మ‌ర్ల హ‌త్య‌కు లింక్ పెట్టి వార్త‌లు వ‌చ్చాయి. కానీ పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో మాత్రం ఇది పూర్తిగా వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో జ‌రిగిన ఆత్మ‌హ‌త్య‌గా తేలింది. ఆయ‌న‌కు ఉన్న వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల‌నే ఆయన సూసైడ్ చేసుకున్నార‌ని స‌న్నిహితులు కూడా చెప్తున్నారు.

ఆత్మ‌హత్య‌కు పాల్ప‌డ్డ ఎస్సై హ‌రీష్ స్వ‌స్థ‌లం జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా రేగొండ మండ‌లం వెంక‌టేశ్వ‌ర‌ప‌ల్లి గ్రామం. ఆయ‌న‌కు ఈ నెల 14న నిశ్చితార్ధం నిర్ణ‌యించారు. అయితే ఇంత‌కుముందే ఎస్సై హ‌రీష్ కు మ‌రో యువ‌తితో ప్రేమ వ్య‌వ‌హారం ఉంద‌ని, ఇదే క్ర‌మంలో ఆమెను ఆదివారం క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. ఆమెతో క‌లిసి హ‌రిత రిసార్ట్ లో రూమ్ తీసుకున్నారు హ‌రీష్. పెళ్లి విషయంలో ప్రియురాలితో మాట్లాడేందుకు ఆయ‌న రూం తీసుకున్న‌ట్లు భావిస్తున్నారు. అయితే నిశ్చితార్ధం గురించి ఇరువురి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుందా? లేక‌పోతే కుటుంబ స‌భ్యులు ఆయ‌నకు ఇష్టం లేకుండా ఎంగేజ్ మెంట్ ఏర్పాటు చేశారా? అన్న‌ది విచార‌ణ‌లో తేల‌నుంది. అంతేకాదు సూసైడ్ చేసుకున్న స‌మ‌యంలో హ‌రీష్ ప్రియురాలు కూడా అక్క‌డే ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై లోతుగా విచార‌ణ జ‌రుపుతున్నారు.

ఏది ఏమైనా ప‌ని ఒత్తిడి కార‌ణంగా హ‌రీష్ ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డార‌న్న వార్త‌లు మాత్రం నిజం కాద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. పూర్తిగా వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే ఆయ‌న ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డ‌ట్లు విచార‌ణ‌లో వెల్ల‌డ‌యింది.

Exit mobile version