Site icon Polytricks.in

వివాదాస్పదంగా ‘ రజాకార్ ‘ టీజర్..సినిమా విడుదల అయ్యేనా..?

సినిమాలు మనిషిలో భావావేశాన్ని వెంటనే రగిల్చెందుకు ఓ మాధ్యమంగా ఉపయోగపడుతాయి. ఇప్పుడు ఆ మాధ్యమాన్ని తమ వ్యూహాలను, ఆలోచనలను ప్రజల మెదల్లోకి చొప్పించేందుకు ఓ సాధనంగా వాడుకుంటుంది బీజేపీ. కశ్మీర్ ఫైల్స్ ను వెనకుండి ప్రోత్సహించి ప్రజల మధ్య విభజన రేఖలు గీసిన బీజేపీ పెద్దలు…ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ తరహాలో తెలంగాణలో ఓ సినిమా తెరకెక్కించి హిందూ – ముస్లిం మధ్య విష బీజాలు నాటేందుకు సినిమాను రూపొందించారు. ఆ సినిమాయే రజాకార్.

యాటా స‌త్య‌నారాయ‌ణ‌ దర్శకత్వంలో అనుష్య త్రిపాఠి హీరోయిన్ గా రజాకార్ సినిమాను బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా విజువల్స్, ఎమోషన్స్ ను అద్భుతంగా తెరకెక్కించారు కానీ, సినిమా స్టోరీ అంతా ఓ వర్గాన్ని శత్రువుగా చూపాలనే ఉత్సుకత ఉన్నట్లు తాజాగా విడుదల చేసిన టీజర్ లో స్పష్టంగా కనిపిస్తుంది. మతం మారని హిందువులను చిత్ర హింసలకు గురి చేసినట్లు, హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకొని అత్యాచారాలకు గురి చేసినట్లు, హిందువులను రజాకార్లు కత్తులతో పొడిచి చంపినట్లు విజువల్స్ ఉన్నాయి. అనేక భావోద్వేగాలతో ముడిపడిన ఈ అంశంకు సంబంధించి రూపొందించిన ఈ టీజర్ ను సెప్టెంబర్ 17నే విడుదల చేయడం వెనక బీజేపీ గేమ్ ప్లాన్ ఖచ్చితంగా ఉంటుంది. అటు ఎంఐఎం జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటున్న వేళ బీజేపీ ఈ టీజర్ ను విడుదల చేయడం కమలనాథుల ఎజెండా స్పష్టం చేస్తున్నది.

నిజానికి..స్వతంత్ర రాజ్యంగా ఉన్న హైద్రాబాద్ స్టేట్ ను నిజాం తుర్కిస్తాన్ రాజ్యంగా మార్చాలని నిజాం అనుచరులు ఒత్తిళ్లు తెచ్చినా… పాకిస్థాన్ తో కలసిపోవడంలాంటి ఆలోచనలు ఉన్నా వాటిని నిజాం వ్యతిరేకించారు. అదీ భౌగోళికంగా కూడా సాధ్యం కాదు. కానీ వీటిని విస్మరించిన దర్శక, నిర్మాతలు పక్కా పథకం ప్రకారం ఈ సినిమాను తమకు అనుకూలంగా నిర్మించారు. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు కనబడుతుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 17 న టీజర్ విడుదల చేసి..ఎన్నికల నాటికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముస్లిం సమాజాన్ని పూర్తిగా శత్రువులు అనే తరహాలో సినిమాను రూపొందించారు. ఓ వర్గం మద్దతు కోసం మరో వర్గాన్ని శత్రువుగా చూపిస్తారా..? అనే ప్రశ్నలకు దర్శక, నిర్మాతలు సమాధానం బాకీ పడి ఉన్నారు.

టీజర్ ను పరిశీలిస్తే..ఈ మొత్తం పోరాటం ముస్లిం రాజుకు వ్యతిరేకంగా సాగిన పోరాటంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ ను పరిశీలిస్తే  అర్థం అవుతుంది. రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన చారిత్రాత్మకమైన పోరాటాన్ని హిందూ వర్సెస్ ముస్లిం పోరాట నేపథ్యంగా ఈ సినిమా ఉండటం చరిత్రకు వక్రభాష్యం చెప్పడమే. సాయుధ పోరాట అమరవీరులను అవమానించడమే..కాబట్టి  సినిమా విడుదలకు అటు కమ్యూనిస్టులు కూడా అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉంది

తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ వివాదాస్పదం అవుతోంది. ఇలాంటి వివాదాలను దాటుకొని సినిమా ఎలా విడుదల అవుతుందో చూడాలి.

Exit mobile version