ప్రజాకవి అందెశ్రీ ఇక లేరు. తెలంగాణ ఉద్యమాన్ని తన గళం, కలంతో నడిపిన ఆయన మరణవార్త యావత్ రాష్ట్రాన్ని శోకంలో ముంచేసింది. అందె ఎల్లయ్యగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అందెశ్రీగా కోట్లాది మంది ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించారు. తన పదునైన గీతాలతో ఉద్యమాన్ని ఉరకలెత్తించిన పాట రూపంలో గర్జిస్తూనే ఉంటారు.
1961, జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు అందెశ్రీగా ప్రఖ్యాతి పొందిన అందె ఎల్లయ్య. గొర్రల కాపరిగా, తాపీమేస్త్రీగా కష్టాలను మర్చిపోయేందుకు పాడిన పాటలే ఆయనను ప్రజాకవిగా, ప్రజా గాయకుడిగా తీర్చదిద్దాయి. ప్రశ్నించే తత్వాన్ని ఒంట బట్టించాయి. పల్లెనీకు వందానాలమ్మో, సూడా సక్కాని తల్లీ.. చుక్కల్లో జాబిల్లి, కొమ్మచెక్కితే బొమ్మరా… కొలిచి మొక్కితే అమ్మరా, మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు లాంటి మహత్తరమైన గీతాలు ఆసువుగా ఆయన గళం నుంచి జాలువారాయి. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ”ను రచించేదాకా ఆయన ప్రస్థానం ముక్కోటి జనాలు జనకేతనంగా మారింది.
తాపి మేస్త్రీగా అందెశ్రీ అనుభవం తెలంగాణా రాష్ట్రానికి ఇటుకలు పేర్చింది. పశువుల కాపరిగా దారి తప్పిన మందను అదిలించి జూలు విదిల్చేలా చేసింది. ఫలింతంగా తానే అందరినోటా పాటై పరవశిస్తున్నాడు. దగా పడిన తెలంగాణాకోసం కవిగా, కళాకారుడిగా తెలంగాణా పోరాటంలో అలుపెరుగని పోరు సల్పి తెలంగాణా పల్లెపల్లెలోనూ పల్లవించిన ఆయన మాటకు , పాటకు మరణంలేదు.
తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్ర మరువలేనిది. తన పాటతో తెలంగాణ ఉద్యమాన్ని గజ్జెకట్టించి ఆడించారు. తన కలంతో నిప్పుల రవ్వలు రగిల్చి…ఉద్యమకాంక్షలను పెంచారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఆయన ఎప్పుడూ గుర్తింపు కోరుకోలేదు. కానీ ఎన్నో ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ ఆగమై పోతుంటే తట్టుకోలేక పోయారు. తన పాట, మాటతో మరోసారి ముందుకు వచ్చారు. ఆయన రచించిన జయజయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించిన సందర్భంగా ఆయన కళ్లవెంట ఆనందబాష్పాలు కురిసాయి.

గత ప్రభుత్వం పట్టించుకోకపోయినప్పటికీ..రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాక జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అందెశ్రీకి ఆయనకు కోటి రూపాయల నజరానా అందించింది. అలాగే ఇంటి నిర్మాణానికి 348 గజాల స్థలాన్ని కూడా కేటాయించింది. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మున్సిపాలిటీ ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో కొత్త ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్నారు. ఇంటినిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్న తరుణంలో ఆయన కలల సౌధాన్నిచూసుకోకముందే కన్నుముశారంటూ అందెశ్రీ బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. చివరి కోరిక తీరకుండానే వెళ్లిపోయావా మల్లన్నా అంటూ సన్నిహితులు కంట తడి పెడుతున్నారు.
అయితే తెలంగాణ ఉన్నన్ని రోజులు అందెశ్రీ ఉంటారు. తన పాట రూపంలో ప్రతి నోటా నిత్యం జీవించే ఉంటారని ఆయన అభిమానులు చెబుతున్నారు.