చేవెళ్ళ సెంటిమెంటు కాంగ్రెస్ కు మరోసారి కలిసొస్తుందా?

చేవెళ్ళ. తెలంగాణాలోని 17 నియోజకవర్గాల్లో ఒక ప్రాంతం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మానస పుత్రిక పథకం అయిన “కనీస ఆదాయ పథకం” ను తెలంగాణాలో ప్రకటించడానికి చేవెళ్ళనే వేదిక అయింది. ఈ నెల 9 వ తేదీనాడు శంషాబాద్ లోని క్లాసిక్ టవర్స్ వద్ద్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఈ పథకాన్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నాడు.

ఇప్పటికే ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణా కాంగ్రెస్ నేతలు, సభ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఒకరకంగా పార్లమెంటు ఎన్నికలకు ఈ సభ ఒక దిశానిర్దేశంలా పనిచేస్తుందని భావిస్తున్నారు. గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందరు అధినేతల కంటే ముందే రాహుల్ గాంధీని రంగంలోని దింపుతున్నారు. ఈ ఎన్నికలలో గేం చేంజర్ గా భావిస్తున్న “కనీస ఆదాయ పథకం” ను చేవెళ్ళ వేదికగా ప్రజలకు వివరించనున్నారు.

ఇక చేవెళ్ళ విషయానికొస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి, పేదలకు సంబంధించి ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా చేవెళ్ళ నియోజకవర్గం నుంచే మొదలుపెట్టేవారు. 108 సర్వీసులను చేవెళ్ళలో మొదలుపెట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీటిని అందించే ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేవెళ్ళలోనే జరిగింది. వైయెస్సార్ 2009 లో ఎన్నికల సంధర్భంగా జరిపిన పాదయాత్రకు కూడా చేవెళ్ళనే వేదికగా తీసుకోవడం గమనార్హం. ఒకరకంగా కాంగ్రెస్ కు చేవెళ్ళ సెంటిమెంటుగా మారింది. సంక్షేమ పథకాల ప్రకటనకు అడ్డాగా మారిన చేవెళ్ళ, కాంగ్రెస్ ప్రవేశపెట్టనున్న గొప్ప పథకం “కనీస ఆదాయ పథకం” కు కూడా చేవెళ్ళ వేదిక కాబోతుంది. ఈ తరుణంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పెద్దలంతా రంగంలోకి దిగారు. చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తన నియోజకవర్గం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *