‘కమ్మ’ని ప్రేమలో కల్వకుంట్ల విషం!

టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజకీయ చరిత్రను లోతుగా అధ్యయనం చేస్తే స్పష్టంగా ఓ విషయం అర్థమవుతుంది. ఆయన రాజకీయం ఆద్యాంతం విషపూరితం. మాట విషం, చేత విషం, ఆలోచన విషం, ఆచరణ విషం. ఆయనొక నిలువెత్తు విషపు మనిషి! మిగతా విషయాల సంగతి అటుంచితే…కమ్మ సామాజికవర్గం కేసీఆర్ రాజకీయ క్రీడలో ఎలా పావుగా మారిందన్నది చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.
కుల ప్రస్థావనతో ఓ అంశాన్ని చర్చకు పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ, నేటి రాజకీయం మొత్తం కులాల చట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సందర్భంలో ఆ ప్రస్థావన లేకుండా ఏ అంశాన్ని మనం చర్చించుకోలేం.
కేసీఆర్ చెబుతోన్న 14 ఏళ్ల పోరాటం తెలంగాణ కోసం కాదు! కమ్మ సామాజికవర్గం పై ఆయన సొంత కక్ష తీర్చుకోవడమే ఉద్యమ రహస్య ఎజెండా. దానికి తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ ముసుగు తొడిగారు…అంతే! కేసీఆర్ రాజకీయ ప్రయోగ శాలలో కమ్మ సామాజికవర్గం వస్తువుగా మారింది. ఆర్థికంగా ఎదిగిన గుప్పెడు కమ్మ ప్రముఖులను చూపించి…మొత్తం సామాజికవర్గం పై విషం నూరిపోయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.
తెలుగుదేశం వ్యవస్థాపకులు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన కమ్మ సామాజికవర్గం నుంచి వచ్చారు. ఇదేమీ రహస్యం కాదు. టీడీపీ ఏ నాడు ఓ కులంవైపు మొగ్గు చూపలేదు. విశ్వవిఖ్యాతుడు స్థాపించిన తెలుగుదేశం బలహీనవర్గాల చరిత్రను ఎలా తిరగరాసిందో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ పేరు చెబితే స్పందించని బీసీ హృదయం ఉండదు. దాని గురించి మరోసారి చర్చించుకుందాం.
అలాంటి పార్టీలో కేసీఆర్ నాయకుడుగా ఎదిగారు. 1999లో అధికారంలోకి వచ్చాక మంత్రిపదవి దక్కకపోవడం టీఆర్ఎస్ స్థాపనకు మూలం అన్నది విదితమే. అప్పుడే…తెలంగాణ అనే సున్నితమైన అంశాన్ని పట్టుకుని కేసీఆర్ సరికొత్త రాజకీయం మొదలుపెట్టారు. వాస్తవానికి కేసీఆర్ మొదలు పెట్టింది తెలంగాణ ఉద్యమం కాదు…తెలుగుదేశం పార్టీ పై పోరాటం. ఆయనకు తెలంగాణ ప్రజల పై ప్రేమ కాదు…టీడీపీ పై ద్వేషం. దానికి ముసుగు…తెలంగాణ ఉద్యమం… అంతే!
దేశంలో, రాష్ట్రంలో ఇతర అగ్రవర్ణాలు ఏవీ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందనట్టు… కేవలం కమ్మ సామాజికవర్గం మాత్రమే ఎదిగినట్టు విషం నూరిపోశారు. పైగా అదంతా తెలంగాణను దోచుకుని ఎదిగినట్టు కలర్ ఇచ్చారు. ఇదంతా కేసీఆర్ విష ప్రయోగంలో భాగమే. తన వాక్చ్యాతుర్యంతో తెలంగాణ సమాజంలో ఈ విషాన్ని కేసీఆర్ నూరిపోశారు. తెలంగాణ ప్రజల బుర్రల్లోకి ఇంకిపోయేలా చేశారు. రాయపాటి, లగడపాటి, కావూరి అంటూ కమ్మ సామాజికవర్గ పారిశ్రామిక వేత్తలను మాత్రమే ఎత్తి చూపుతూ… తెలంగాణ సమాజంలో నరనరానా విద్వేషపు విషం ఎక్కించారు.
తను రాజకీయంగా బతికిబట్టకట్టాలంటే…తెలుగుదేశం చావాలని కోరుకున్నారు. కమ్మ సామాజికవర్గం పై తెలంగాణ సమాజపు మెదళ్లలో విష ప్రయోగం చేస్తేనే ఆ పార్టీ చస్తుందని లెక్కలు కట్టారు. లగడపాటి, రాయపాటి, కావూరి లాంటి నాయకులు కమ్ వ్యాపారవేత్తలు కాంగ్రెస్ అండగా ఎదిగారు తప్ప…వారికి ఏ నాడు తెలుగుదేశం నాయకత్వం నుంచి లబ్ధి జరిగింది లేదు. కానీ, టీడీపీ చస్తే తప్ప తన అస్థిత్వం మిగలదని విశ్వసించిన కేసీఆర్ దానికోసం కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసుకున్నారు. పరోక్షంగా దీనివల్ల బీసీలకు రాజకీయంగా తీరని నష్టం జరిగింది.
ఈ క్రమంలో కాంగ్రెస్ పుణ్యమా అని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. టీడీపీ అస్థిత్వం బాగా దెబ్బతిన్నది – కేసీఆర్ కోరుకున్నట్టుగా – రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఇప్పుడు కేసీఆర్ కు కమ్మ సామాజికవర్గంతో అవసరం ఏర్పడింది. ఏ కులం పై విషం చిమ్మి తన రాజకీయ పబ్బం గడుపుకున్నారో ఇప్పుడు అదే కులం పై వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తున్నారు. ఈ సామాజికవర్గం లో ఆర్థికంగా ఎదిగి, పెద్దమనుషులుగా చలామణి అవుతోన్న గుప్పెడు మందితో అంటకాగితే… ఆ కులపు ఓట్లు గుండుగుత్తిగా వచ్చిపడతాయని కొత్త లెక్కలు వేసుకుంటున్నారు. కేసీఆర్ చూపుతోన్న ఈ ప్రేమకు కమ్మసామాజికవర్గం ఉబ్బితబ్బిబ్బైతే… మరోసారి ఆయన ప్రయోగశాలలో పావుగా మారినట్టే. కమ్మవారిపై ఆయనది ప్రేమ కాదు…రాజకీయ అవసరం. అందుకే రామానాయుడు, నందమూరి హరికృష్ణ లాంటి ప్రముఖులు మరణించినప్పుడు కేసీఆర్ అండ్ కో అవసరానికి మించి హడావుడి చేస్తున్నారు.

కానీ, కేసీఆర్ చిమ్మిన విషంలో నిండా మునిగి ఉన్న తెలంగాణ సమాజపు బుర్రలు ఇంకా అమాయకంగా కమ్మసామాజికవర్గం పై ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. కేసీఆర్ అవకాశవాదపు చర్యలలోని మర్మాన్ని అర్థం చేసుకోవాల్సింది పోయి… ఓ సామాజికవర్గం పై ద్వేషం పెంచుకుంటే ఒరిగేదేమిటి?
వాస్తవానికి కేసీఆర్ రాజకీయ చదరంగంలో కమ్మవాళ్లు బాధితులు. గుప్పెడు కమ్మ ప్రముఖులను చూపి… మొత్తం గేమ్ ఆడుతున్నారు కేసీఆర్. ఆయన వల్ల కొద్ది మంది కమ్మ ప్రముఖులకు లాభం జరిగితే జరిగి ఉండవచ్చు. మిగతా అగ్రవర్ణలు ఎవరికీ లాభం జరగలేదా? కేవలం కేసీఆర్ తో అంటకాగుతోన్న ఆ గుప్పెడు కమ్మ ప్రముఖులకు మాత్రమే లబ్ధి జరిగిందా? ఆ గుప్పెడు మందిని మొత్తం సామాజికవర్గానికి ఎలా అంటకడతారు? లక్షల మంది కమ్మ సామాజికవర్గ ప్రజలు సాధారణ జీవితాలు గడపడం లేదా? కష్టజీవులుగా కాలం వెళ్లదీయడం లేదా?
ఒకప్పుడు కేసీఆర్ తన స్వార్థం కోసం విషం నూరిపోస్తే నమ్మారు… ఇప్పుడు తన స్వార్థం కోసం ప్రేమ ఒలకబోస్తున్నారు. నాటి విషంలో… నేటి ప్రేమలో ఎవరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయో అర్థం చేసుకుంటే… తెలంగాణ సమాజానికి మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *