టీఆర్ఎస్ ను చిత్తుచిత్తుగా ఓడించాలి.. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం
హుజూర్ నగర్ ఉపఎన్నిక
పత్రికా ప్రకటన
సమాజంలో తలెత్తే అనేకానేక సమస్యలు, సంఘర్షణల పరిష్కారానికి నిరంతరం పౌరులు చేసే సమిష్టి కృషి రాజకీయాలు. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది, సృజనాత్మకమైనది, చైతన్యశీలమైనది. ఎన్నికలు దీనికి ఆయువుపట్టు. ఇప్పుడు జరుగుతున్న హుజూర్ నగర్ ఉపఎన్నికను ఈ దృక్పథంతోనే చూడాలి.
తెలంగాణలో రెండు భిన్నమైన, పరస్పర వైరుధ్యమైన పరిణామాలు సాగుతున్నాయి. సమిష్టి పోరాటాలతో, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ప్రజలు కోరుకున్నారు. వనరుల్లో వాటా సబ్బండ వర్ణాలకు, సకల జనులకు దక్కుతాయని ఆశించినారు. మరొకవైపు అధికార పార్టీ ప్రభుత్వాన్ని స్వంత ఆస్తిగా వాడుకుంటున్నది. గుప్పెడుమందికోసం వనరులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నది.
ఈ పరిస్థితులలో ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం విధానాలు రావడం లేదు. అన్నివర్గాల ప్రజలు ఈ పాలనను నిరసిస్తూనే ఉన్నారు.
ఈ పరిమాణాలను పసిగట్టి ప్రజలు, ప్రజాసంఘాలు సంఘటితంగా టి.ఆర్.ఎస్ ను ఓడగొట్టటానికి కృషి చేయాలి. నిరంకుశ పాలనపై నిరసన తెలుపడానికి ఈ ఎన్నికలను వేదికగా ఉపయోగించాలి.
కాంగ్రెస్ పార్టీ వైఖరిపై మా అభిప్రాయాలు మాకున్నప్పటికీ టి.ఆర్.ఎస్ ఓటమి నేడు తెలంగాణ బాగుకు అత్యవసరం కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తెలంగాణ జన సమితి మద్దతు ఇస్తున్నది.
ఈ ప్రజావ్యతిరేక టి.ఆర్.ఎస్ ను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిస్తున్నం. ఎందుకంటే, ఒకవేళ టి.ఆర్.ఎస్. గెలిస్తే అది తన విధానాలకు ప్రజామద్దతు ఉందని మరింత నిరంకుశంగా పాలన సాగిస్తది. తమ న్యాయమైన డిమాండ్లకోసం ప్రజలు చేసే పోరాటాలను అణచివేస్తది.
ప్రొఫెసర్ కోదండరాం
అధ్యక్షుడు