బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలి : ప్రొఫెసర్ కోదండరాం
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంగం మండల పరిధిలోని 17 గ్రామాలు, 5 తండాల నుండి 12635 ఎకరాలు సేకరించి నిమ్జ్ (జాతీయ పెట్టుబడి బరియు తయారీ రంగ సముదాయం) నెలకొల్పాలనే ప్రతిపాదనతో ముందుకు వెళుతున్న ప్రభుత్వం అన్ని రకాల చట్టాలను, సహజ న్యాయ సూత్రాలనూ, రాజ్యాంగాన్నీ తుంగలో తొక్కుతున్నది.
తాము సేకరిస్తున్నదాంట్లో అత్యధిక భాగం బీడు భూములే అని ప్రభుత్వం బుకాయిస్తున్నది. వాస్తవమేమంటే, ఇందులో వెయ్యి ఎకరాలు తప్ప మిగతా మొత్తం సాగుభూమి. సంవత్సరానికి రెండు పంటలు పండే ఈ భూముల్లో చెరుకు, అల్లం, ఆలుగడ్డ, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, కంది, పెసర, మినుము, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, సామలు, కూరగాయలు పండుతాయి. జామ తోటలకు కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధి. కూరగాయలు, పాలు సమీపంలోని బీదర్, జహీరాబాద్ పట్టణాలకు సరఫరా చేస్తూంటారు. ఎంతో మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పొందుతూ ఉన్నారు.
*భూసేకరణ ఒక ఫార్సు*
కేవలం ఒకరోజు ముందు డప్పు చాటింపు వేసేదాకా ప్రజలకు విషయం తెలియదు. పర్యావరణ నివేదిక తెలుగులో ఇవ్వలేదు. ఇంగ్లీషు కాపీ పంచాయితీ ఆఫీసులో గంటసేపు ఉంచి వెనక్కు తీసుకువెల్లిన్రు. పోలీస్ పికెట్ పెట్టి దాదాపు 4 వేలకు పైగా ప్రజలను ప్రజాభిప్రాయ సేకరణకు రాకుండా గ్రామాలలో నిర్భంధించారు. అయినా వెరవని ప్రజలు 600 వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరిగే చోటకు చేరుకున్నారు. రోడ్డు మార్గాన వచ్చేవారిని ఆపిన్రు. బైక్ ల మీద వచ్చేవాల్లను అడ్డుకుని బండ్ల తాళాలు లాక్కున్నారు. అయినా వెరవక ముందుకు కదిలినవారిపై లాఠీచార్జ్ చేసిన్రు. మహిళలు అని కూడా చూడకుండా దౌర్జన్యం చేసిన్రు. ఇంత చేసినా, 67 మంది రైతులు హాజరయినారు. అందులో 50 మంది భూసేకరణను వ్యతిరేకించడం గమనార్హం.
ప్రాజెక్టుకు అనుకూలంగా మాట్లాడడానికి ప్రభుత్వ ఉద్యోగులైన పారిశుధ్య కార్మికులు, గ్రామ కార్యదర్శులను స్థానిక తెరాస నాయకులు తరలించారు. అధికార పార్టీకి మద్దతు ఇచ్చే సర్పంచులు కూడా సభకు వచ్చారు.
ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ గ్రామాలు, తండాల నుండి 30 తీర్మానాలు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. బహిరంగ విచారణ అప్రజాస్వామికంగా, ప్రజలను అణచివేసి, అసలు అక్కడకు రాకుండా అడ్డుకుని తూతూమంత్రంగా జరిపిన్రు.
కలెక్టరు ఈ వాస్తవాలను ఢిల్లీ లోని పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని టీజేఎస్ డిమాండ్ చేస్తున్నది.
*రైతులను వ్యవసాయం నుంచి దూరం చేసే కుట్ర*
ఇప్పటికే సేకరించిన 12650 ఎకరాలలో పరిశ్రమలకు వాడింది కేవలం 6434 ఎకరాలు మాత్రమే. మిగతా భూమి హరితహారం, గృహవసతి వంటి వాటికి వాడుతామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు. ఏటా మూడు పంటలు పండే పచ్చని భూములను కాజేసి హరితహారం అనడం హాస్యాస్పదం, అమానవీయం. పరిశ్రమలకోసం పంటపొలాలు తీసుకోకూడదని చట్టాలు స్పష్టంగా చెప్తున్నా ఖాతరు చేయడం లేదు. రంగారెడ్డి జిల్లాలో కూడా ఫార్మాసిటీ పేరుతొ ఇట్లాగే బలవంతపు భూసేకరణ చేస్తున్నారు. దీని ఫలితంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కూడా కాలుష్యభరితం అవుతాయి. రైతులను వ్యవసాయం నుంచి తరిమివేసే పెద్ద కుట్రలో భాగంగ్గానే ఇది జరుగుతున్నది. దీనిని తెలంగాణ జన సమితి తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. నిన్న హైదరాబాద్ లో జరిగిన అఖిలపక్ష పార్టీల సమావేశం కూడా బలవంతపు భూసేకరణను నిరసించింది.
ఈ పత్రికా సమావేశంలో జహీరాబాద్ నిమ్జ్ భూముల బలవంతపు సేకరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న టీజేఎస్ నాయకుడు ఎం. ఆశప్ప, శ్రీశైల్ రెడ్డి పంజుగుల, యువజన సమితి నాయకుడు కొత్త రవి పాల్గొన్నారు.