కెసిఆర్ కరోనా రాజకీయాల్ని కడిగి పారేసిన పొన్నాల

ముఖ్యమంత్రి
‘కేసీఆర్’ గారిని…
ప్రశ్నిస్తున్న ప్రజా’గొంతు’
‘పొన్నాల లక్ష్మయ్య’గారు
          ◆◆★◆◆
★ ముఖ్యమంత్రి గారు సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్పగలరా?

★ వలస కార్మికుల విషయంలో, మీరేమో
మొదట్లో మూడున్నర లక్షలని ఈరోజు
ఏడున్నర లక్షల మంది అన్నారు, మీ తనయుడేమో ఆరు లక్షలన్నాడు, నగరానికి చెందిన మరో మంత్రేమో పన్నెండు లక్షలన్నాడు. మీరు చెప్పే విషయంలో మీకే పొంతన లేకుండా ఉంది.

★ మీరు కరోనా విషయంలో టెస్టింగ్ కిట్స్ గురించి మాట్లాడారు. నిజంగా నాకు చాలా బాధ కలుగుతుంది. ఇంత సుధీర్ఘ సమావేశం తర్వాత కూడా బెంగుళూరు నుండి తీసుకొస్తుంటే ఆ ప్రభుత్వం ఆపిందని చెప్పారు. పది లక్షలు ఆర్డర్ చేసామని చెప్పారు. పోయిన నెలలో మున్సిపల్ శాఖ మంత్రి మూడున్నర లక్షల కిట్లు మా దగ్గరున్నాయి అన్నాడు. ఆరోగ్య శాఖ మంత్రి నాలుగు లక్షలన్నాడు. కేంద్రం నుండి వచ్చిన మానిటరింగ్ టీమ్’తో ప్రభుత్వ శాఖాధికారులు అయిదు లక్షల యాభై ఒక్క వేలున్నాయన్నారు.
మళ్లీ మీరేమో పది లక్షలు ఆర్డరిచ్చాము. అయిదు లక్షలు సిద్ధంగా ఉన్నాయి. మిగితావి కూడా వచ్చినట్లే అవసరము అనుకుంటే మనమే పక్క రాష్ట్రానికి సాయం చెయ్యెచ్చు అంటున్నారు.
నాది ఒకటే ప్రశ్న?
అవి మన దేశంలో తయారైతున్నాయా? దిగుమతి చేసుకున్నారా? ఎప్పుడు తీసుకున్నారు? ఎలా తీసుకున్నారు? ఎంతకు తీసుకున్నారు? ఎంతకు ఆర్డరిచ్చారు? ఎప్పుడు డెలివరీ అయ్యాయో చెబుతారా?
జిల్లాలో ఉన్న డిఎంఎచ్ఓలను అడిగితే మా దగ్గర నాలుగొందలు కూడా లేవంటున్నారు. ప్రభుత్వంలో పనిచేసిన ప్రముఖ వైద్య నిపుణులు గాంధీ హాస్పిటల్లో పరిక్ష చేయడానికి కిట్లు లేనే లేవు అంటున్నారు. సర్ధుబాటు చేయాల్సిన అవసరముందా లేదా? ముఖ్యమంత్రి గారు దయచేసి ఇది విమర్శ ఆనుకోకండి. మీకు ప్రతిపక్షం వాళ్లు మాట్లాడితేనే బీపీ పెరుగుతుంది. మీ మాట కాదంటే, మీ మాటల్లో పొరపాటుందంటే, మీకు ఎందుకంత ఆవేశం. ఇది ప్రజా జీవితం. ప్రజల కోసం మనం జీవిస్తున్నామన్న నినాదం కానీ, విధానం కానీ, నమ్మకం గానీ, ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నాను.

★ ప్రొక్యూర్మెంట్ గురించి, కొనుగోలు కేంద్రాల గురించి, దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నారు. చాలా సంతోషం ఇది చేయాల్సిన పనే. ఐకేపీ సెంటర్లు ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇప్పుడు అదనంగా పెడుతున్నారు. ఆ ఆలోచన మాదే కదా? ఎంత వరకు చేసారన్నది పక్కన పెడితే, ప్రతీ గింజ కొంటామంటున్నారు. మీ లెక్కలు సరిగా ఉన్నాయా? మొన్ననేమో ముప్పైవేల కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. ఇవ్వాలేమో ముప్పైఅయిదు వేల కోట్ల రూపాయల గ్యారెంటీ ఇచ్చామన్నారు.

★ గత సంవత్సరం కొనుగోళ్లతో పోలిస్తే ఇప్పటి వరకు కనీసం ఇరవై శాతం కొనుగోళ్లు చేయక ముందే (అధిక ధాన్యం దిగుబడి ప్రచారం) గన్నీబ్యాగుల కొరతతో రోజుల తరబడి వేచి ఉండటం. ప్రకృతి వైపరీత్యాల ద్వారా నష్టపోవడం,
ఇదే ముందస్తు ప్రణాళికలు లేకుండా మీరు చేసే వ్యవహారమంతా ‘డొల్లతనం’ అని తేటతెల్లమైంది.

మీరు ముందస్తుగా ఏర్పాట్లు చేయకపోవడం అత్యంత శోచనీయం.
మీరెంత కొన్నా, రబీలో ఎంత పంట వస్తుందో తెలియదా? గత సంవత్సరం పండిన పంటెంతో మాకు తెలియదా? అంతా కొంటే ఎంతైతదో తెలియదా? ఎందుకయ్యా! ఈ మాటలు ఇప్పటిదాకా అంటే నెలరోజుల వరకు రైతులకు డబ్బులు అందలేదన్న విషయం మీ దాకా రాలేదా?

మీరేమో వెంటనే ఇస్తామంటారు.
డిపార్ట్’మెంట్ వారేమో వారం రోజులంటారు. కానీ ముప్పై రోజులైనా పడిగాపులు కాస్తున్న రైతులకు డబ్బందలేదు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో రైతులచేతుల్లో డబ్బుంటే ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగు పడుతుందనే ప్రాధమిక సూత్రాన్ని అర్థం చేసుకొమ్మని కోరుతున్నాను. ( మీరేమో హెలికాఫ్టర్ మనీ గురించి మాట్లాడే వారు )

★ రైతులకు ఖరీఫ్’లో విత్తనాలు, ఎరువులు కావాలి వీటన్నింటికి డబ్బులు కావాలి. ఇది నిర్మాణాత్మక దృష్టితో చూడమని కోరుతున్నాను. డబ్బు అందటం లేదు. కందులకైతే రెండు నెలల నుంచి చెల్లింపులు లేవు. మనమే ఆ రైతులమైతే ఆ బాధ అర్ధమైతుందని తెలియచేస్తున్నాను. మీరైతే ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తారు.
ఇది విమర్శ కాదు. మీ దృష్టికి తీసుకువస్తున్నాను. రైతుల బాధలు మీకు అర్థమైతాయా?

★ రైతులు తాలు తెస్తున్నారని, రైతుల మనోభావాలు దెబ్బతినే విధంగా, అవమానకరంగా, వారిని కించపరిచే విధంగా మాట్లాడిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో నిలిచి పోతారు.

★ ఇదొక ప్రభుత్వం, మనదొక వ్యవస్థ, వాస్తవాలను చెప్పడంలో మీరు తప్పటడుగు వేస్తున్నారు, వాస్తవాలు చెప్పడం లేదన్న విషయాన్ని గుర్తించుకొమ్మని కోరుతున్నాను. రెండోది కూలీలకు పన్నెండు కిలోలు ఇస్తున్నాము, పదిహేను వందల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. కానీ అందుతుందా లేదా? అందితే ఎంతందుతుంది? అది గతంలో కంటే ఎక్కువనా? తక్కువనా? అని విశ్లేషించే విషయాన్ని మీరు విస్మరిస్తున్నారు. గతంలో వీరికి మనిషికి ఆరుకిలోలు ఇచ్చేవారు. ఇప్పుడు సరైన పర్యవేక్షణ, అజమాయిషీ లేక దళారులు, ఇష్ఠారాజ్యంగా వ్యవహరిస్తూ, ప్రజా సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నారు. సహాయం అందక తల్లడిల్లుతున్న వారి పరిస్థితి ఏమిటి? వారిని ఆదుకునేదెరరు? ఇది మీ దృష్టికి రాలేదనుకుంటాను.
ఇది అన్యాయం కాదా? వారి విషయంలో వాస్తవాలు తెలుసుకొమ్మని కోరుతున్నాను. దయచేసి ఈ విషయంలో సంబందిత శాఖా అధికారుల నుండి సరైన సమాచారం తెప్పించుకొండి. వారి సంఖ్యలో స్పష్టత, వారికి అందచేస్తున్న సంక్షేమం విషయం గతం కంటే మెరుగ్గా ఉందా లేదా? వాస్తవాలను తెలుసుకొమ్మని కోరుతున్నాను.

★ పార్టీల గురించి మాట్లాడారు. ఏం పార్టీలని అన్నారు. మీరెక్కడ నుండి వచ్చారు? ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీలో ప్రజా ప్రతినిధిగా పనిచేసారు? పార్టీ ఎందుకు వీడారు?
ఇప్పుడేమో ఈ పార్టీలకు ఏమున్నది. అంతా మేమే గెలిచామని చెబుతున్నారు.
2009 లో కాంగ్రెస్’ను విభేదించి తెలంగాణ వ్యతిరేకులతో పొత్తు పెట్టుకుంటే మీకెన్ని సీట్లు వచ్చాయి? కేవలం పదిసీట్లే కదా? అంటే తెలంగాణ వాళ్లు తెలంగాణ వద్దని చెప్పినట్లా? తీర్పు ఇచ్చినట్లా?
ఎన్నికల వేరు, ప్రజాక్షేమం వేరు, అభివృద్ధి వేరు, ఇవి ఆ కోణంలో చూస్తే మీరు పొరపాటు పడ్డట్టే.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కోసం తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ ఇచ్చింది. రాజకీయ పార్టీలను అవహేళన చెయ్యెద్దు. రాజకీయ పార్టీలను నిందించొద్దు. మీరు ఆ కోణం నుండి వచ్చిన వారే, ఇప్పుడేమో డబ్బెక్కువై అధికారంతోని, అహంకారంతోని, ఎవర్నీ లెక్క చేయకుండా మాట్లాడే మాటలు మంచివి కావు.

★ ప్రజలు ఈరోజు కాకపోయినా రేపైనా మిమ్మల్ని ఛీ…కొడతారు.

★  అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసానని గొప్పగా చెబుతున్నారు. హ…హ…హ
మాట్లాడితేనే సస్పెండ్ చేసే మీ నీచ చరిత్ర, దౌర్భాగ్య చరిత్ర, ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేనిది ప్రజలు గమనిస్తున్నారు.

★ అసెంబ్లీలో  మాస్కుల గురించి చెబితే అవహేళన చేసి మాట్లాడి, ఇప్పుడేమో మాస్కులే ప్రాణాధారం అంటున్నారు.
మీ ద్వంద్వ వైఖరిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.

★ గుడంబా అరికట్టడానికి మద్యం దుకాణాల ఓపెనింగ్ అంటున్నారు. గతంలో విజయవంతంగా గుడంబా అరికట్టేందుకు ఎలా పని చేసారో, అలాగే ఇప్పుడు కూడా చేయొచ్చు కదా! ఎక్సైజ్ శాఖంతా ఖాలీగానే ఉన్నారు కదా!

★ ఇరవై మూడు వందల పొడుగునా నాలుగు రాష్ట్రాల సరిహద్దులున్నాయి. స్మగ్లింగ్ అరికట్టేందుకు మద్యం ఓపెన్ అంటున్నారు. చెక్ పోస్టులన్ని ఏమైనవి?
ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకు?
ధైర్యంగా రాబడి కోసమేనని చెప్పండి.

★ మీరడిగితే జూబ్లీ హాలులో అయిదున్నర గంటలు సంక్రాంతి పండుగ నాడు చర్చించ లేదా? మీరు తోక ముడువలేదా?
నలబై ఎనమిది ప్రాజెక్టుల దగ్గర ఓపెన్ డిబేట్ పెట్టలేదా? రాజకీయ నాయకులు, నిపుణులు, ఇంజనీర్లు, సామాజికవేత్తలు, శాస్త్రవేత్తలు, అందరితో మాట్లాడలేదా?
అది కాకుండా అసెంబ్లీలో రోజుల తరబడి చర్చించలేదా? అవకాశం ఇవ్వలేదా? మీరెప్పుడైనా టైమిచ్చారా? 
మీరెక్కడైనా మాట్లాడారా?
చేసామని గొప్పలు చెప్పుకుని, దాని ద్వారా  లబ్ది పొందాలని, తప్పిదాలను కప్పిపుచ్చుకోవాలని చూసే మీరు దాయలేరు. దాగని వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇది చరిత్ర సాక్ష్యం. చరిత్రలో నిలబడి పోతుంది.

★దురదృష్టవశాత్తు అత్యంత క్లిష్టమైన పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితి చూస్తామని ఊహించ లేదు. కాడెడ్ల మొద్దు బండి స్థాయి నుండి, ఆముదపు దీపపు స్థాయి నుండి, ఈరోజు సాంకేతికంగా మనం ఎంత ముందుకు వెళ్లామో తెలుసు. అయినా ఇటువంటి చూడగూడని పరిస్థితికి వచ్చాము. మనమంతా సమన్వయంతోఉండాలి, ధైర్యంతో ఉండాలి, అండగా ఉండాలి.

★ ఆదాయం తగ్గిందంటున్నారు. మేం కాదంటున్నామా?
మార్చి,ఏప్రిల్, మాసాల్లో కరోనాకు కాకుండా ఇతర పద్దులు ఏం చెల్లించారో చెప్పగలరా?
ఒక శ్వేతపత్రం విడుదల చేయగలరా? ధైర్యంగా ముందుకు వచ్చి చెబుతారా?
చెప్పరు అసలు మీ నిరాహారదీక్షనే దొంగ నిరాహారదీక్ష
ఏడువందలయాభై కిలో క్యాలరీల ద్రవ ఆహార పదార్థాలు తీసుకోన్న చరిత్ర మీది. దాచింది మీరు…

★ ఈరోజు మీకనుకున్న వారికి డబ్బు సంపాదన కోసం, ప్రభుత్వ సొమ్మును చెల్లిస్తూ వాస్తవాలను దాస్తున్నారు.

★ కాస్త సరదాగా అంటున్నాను. చస్తే పది మంది మాత్రమే, పెళ్లికి ఇరవై మంది మాత్రమే, అంటున్నారు. మరి మందుకు మాత్రం ఎంత మందైనా పర్వాలేదు. దూరాన్ని మాత్రం పాటించమంటున్నారు.

★ ఇవి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.

★ మీ ఆటిట్యూట్ ఎందో బయట పడుతుందని తెలియ చేస్తున్నాను.

★ ధన్యవాదాలు కేసీఆర్ గారు ప్రజలకు అండగా నిలబడండి.

★ మనం ఆశించిన, తెలియచేసిన విధానాలు, లాభాల్లో, ప్రజలకు చేరేవిధంగా సమీక్షించండి.

★ ప్రజలకు చేరితేనే మన విధానం మంచిదని ఋజువు అవుతుంది.

★ దయచేసి ఆ…కోణంలో ఆలోచించండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల ప్రజా జీవితంలో మీరే కాదు చాలామందిమి ఉన్నామని గుర్తించి, సరియైన సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నాను…

ధన్యవాదాలు… కేసీఆర్ గారు.

#Ponnala_Lakshmaiah
Media Briefing April 05, 2020.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *