కొడుకు దిద్దుతున్న ‘కాపురం’!!

”పార్టీలో ఎవరికీ అన్యాయం జరగదు. కొందరికి టికెట్లు ఇవ్వడం సాధ్యపడడం లేదు. అలాంటి వారితో మాట్లాడతాం. ఎవరికీ అన్యాయం జరగదు. పార్టీ కోసం కష్టపడుతున్న వారందరినీ కడుపులో పెట్టి చూసుకుంటా” అని కేసీఆర్ నెల కిందట 105 మంది అభ్యర్థుల ప్రకటన సందర్భంగా అన్న మాటలు. కానీ టికెట్టు తిరస్కరించిన బాబు మోహన్, కొండా సురేఖ వంటి వారితో కేసీఆర్ లేదా కేటీఆర్ మాట్లాడి నచ్చ జెప్పినదాఖలాలు లేవు. తన టికెట్టునిరాకరణకు కారణాలు చెప్పాలని కొండా సురేఖ చేసిన డిమాండుకు ఎవరూ స్పందించలేదు. అనేక మార్లు కనీసం ఫోన్ లో కేసీఆర్ తో సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన శూన్యంఅన్నది బాబూ మోహన్ ఆరోపణ. అసమ్మతివాదులను బుజ్జగించడంలో భాగంగా ఎమ్మెల్సీ పదవుల ఆశ జూపినట్టు చెబుతున్న సంఖ్య కనీసం 25 దాటినట్టు ఒక సమాచారం. ఇక టీఆర్ఎస్ లో తమ రాజకీయ భవిష్యత్తు ఆగమ్యగోచరమవుతుందని కలవరపెడుతున్న నాయకులు నెమ్మదిగా కాంగ్రెస్ వైపు ‘వలసల బాట’ పట్టేందుకు సన్నాహాల్లో ఉన్నారు. ఎవరెవరు పార్టీ ఫిరాయిస్తారన్న అంశంపై స్పష్టత లేదు. అలాంటి ‘ అనుమానితుల’ వ్యక్తుల కదలికలపై ఫామ్ హౌజ్ నుంచే కేసీఆర్ ‘ డేగ కన్ను’ వేసినట్టు తెలుస్తున్నది.

KTR KCR

అసమ్మతి నాయకుల బుజ్జగింపు చర్యలలో టిఆర్ఎస్ పార్టీ సంక్షోభ పరిష్కర్తకేటీఆర్’సక్సెస్ రేటింగ్’ పేలవంగా ఉన్నట్టు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఫామ్ హౌజ్’ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రగతిభవన్, తెలంగాణ భవన్ వ్యవహారాలన్నీ కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉన్నది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఆశావహుల’వడపోత’ ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో జరుగుతున్నది. కొన్ని నియోజకవర్గాలలో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు, అసమ్మతివాదులు, అసంతృప్తులను ‘దారిలోకి’ తీసుకు రావడానికి కేటీఆర్’ఆపరేషన్’ పూర్తిగా విజయవంతం కావడం లేదు. పైగా అది కొన్ని సందర్భాలలో వికటిస్తున సమాచారమూ వెలుపలికివస్తున్నది. అందులో కొంత నిజమూ లేకపోలేదు. హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి కేసీఆర్ గడచిన నెల రోజులుగా అపాయింట్ మెంటు ఇవ్వకపోవడం పట్ల మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నవి. ముషీరాబాద్ టికెట్టును తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి ఇప్పించుకోవాలని జరుపుతున్న నాయిని ప్రయత్నం ఫలించడం లేదు. కేటీఆర్ తో నాయిని చర్చలు జయప్రదం కాలేదు. నాయిని అంత పెద్ద శాఖకు మంత్రిగా ఉన్నా తన ‘సహజ శైలి’ ని వదిలిపెట్టలేదు.

కేసీఆర్ అపాయింట్ మెంటు దొరకడం లేదని భోళాతనంతో పరోక్షంగా చెప్పేశారు. అలాగే ఎల్బీ నగర్ లో పోటీ చేస్తే 10 కోట్లు ఇస్తామని కేసీఆర్ ఆఫర్ చేసినట్టు కూడా హొం మంత్రి అమాయకంగా బయటపెట్టారు. నాయిని వ్యాఖ్యలను అందుకొని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి టిఆర్ఎస్ పైన , కేసీఆర్ పైన ‘దుమ్మెత్తి పోశారు’. ప్రగతిభవన్ లో కర్ఫ్యూ అమల్లో ఉందని అన్నారు. ”కేసీఆర్ మంత్రివర్గ సహచరులను, కార్యకర్తలను బానిసలుగా చూస్తున్నారు. నాయినినరసింహ్మ రెడ్డికి కేసీఆర్ నెలరోజులుగా అప్పాయింట్ ఇవ్వడంలేదు. ముషీరాబాద్ టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ నియోజకవర్గం మారితే పదికోట్లు ఇస్తానని నాయిని చెబుతున్నారు. టి.ఆర్.ఎస్ లో మొదటి నుంచి కేసీఆర్ కు వెన్నంటి ఉన్న నాయినికినెలరోజులుగాఅపాయింట్మెంట్ ఇవ్వలేదంటే అది అవమానం కాదా ?

నాయిని వ్యాఖ్యల ను సుమోటోగా తీసుకోవాలి. టికెట్ ఇవ్వకపోయినా, నాయినికి కనీసం అపాయింట్ ఇవ్వడం లేదంటే, టీఆరెస్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాయిని ప్రకటన ను ఈసీ సుమోటోగా తీసుకుని కేసుపెట్టాలి.ఉద్యమకారుడు, నీతి నిజాయితీ అని చెప్పుకునే కేసీఆర్ ఎన్నికల్లో నియోజకవర్గానికి 10 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు” అనిరేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్టును తన సోదరుడు వినోద్ కు ఇవ్వకపోతే తనకు పెద్దపల్లి ఎంపీటికెట్టు కూడా అవసరం లేదని మంత్రి కేటీఆర్‌తో వివేక్ తెగేసి చెప్పినట్టు వార్తలు వెలువడ్డాయి.

చెన్నూరు అసెంబ్లీ అభ్యర్థిగా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ను పంపినందున సుమన్ ను మార్చేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. దీంతో ‘వివేక్ బ్రదర్స్ ‘ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. గతంలో వినోద్ ఈ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించారు. వినోద్‌కు కాకుండా బాల్క సుమన్‌కు టీఆర్ఎస్టిక్కెట్టు కేటాయించడంపై వివేక్ , వినోద్‌లు అసంతృప్తితో ఉన్నారు. వివేక్ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల పర్యటించారు. కానీ ప్రచారంలో పాల్గొనలేదు. వివేక్ అనుచరులు కూడ ప్రచారానికి దూరంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కె.కేశవరావుతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడి ‘ వివేక్ బ్రదర్స్’ టీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చారు.2014 ఎన్నికల్లో వివేక్, వినోద్ లు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు టిఆర్ఎస్ లో వారు ‘ఉక్కపోత’కు గురవుతున్నట్టు తెలుస్తున్నది. స్టేషన్ ఘన్ పూర్ టికెట్టు తన కూతురు డాక్టర్ కావ్య కు ఇప్పించుకోవడానికి ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్టేషన్ ఘన పూర్ అభ్యర్థి డాక్టర్ రాజయ్యకు మద్దతు ఇవ్వడానికి ముందుగా కొంత తటపటాయించారు. రాజయ్య, కడియం లతోకేటీఆర్ మాట్లాడి నచ్చజెప్పారు. ”కేసీఆర్ కోసం రాజయ్యను గెలిపించాలి” అన్నదికేటీఆర్హితబోధ. నాగార్జున సాగర్ ఎపిసోడ్ కూడా అంతే. ఆ పార్టీ అభ్యర్థి నోముల నర్సింహయ్యకు టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎం.సి.కోటిరెడ్డి నుంచి ‘అసమ్మతి ముప్పు’ ఎదురు కావడంతో వాళ్ళిద్దరినీ, ఆ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డిని పిలిపించి చర్చించారు. చర్చలు ఫలించినట్టుగా నోముల, ఎం.సి. కేటీఆర్ తో కలిసి గ్రూపు ఫోటోలు దిగారు. మరికొన్ని నియోజకవర్గాల సమస్యలనూ కేటీఆర్ పరిష్కరించారు. రాజేంద్ర నగర్ టికెట్టు ఆశించి భంగపడిన శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం ఉన్నది. ఆయన ఎమ్మెల్సీ టర్మ్ మరికొన్ని నెలల్లో పూర్తి కావస్తున్నది. కనుక తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన ఆందోళనకు గురికావడం సహజమే. అసంతృప్తులు, అసమ్మతివాదుల జాబితాలో ప్రస్తుతానికి టిఆర్ఎస్ ప్రముఖుల్లో కడియం, స్వామిగౌడ్, నాయిని, వివేక్ బ్రదర్స్ ఉన్నారు.

నాయిని, కడియం, స్వామిగౌడ్… ఎమ్మెల్సీలు గా ఉన్నారు. వరంగల్ లోక్ సభ సీటు వస్తుందో, రాదో అన్న అనుమానాలు కూడా కడియంకు ఉన్నాయేమో తెలియదు. కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా ప్రచారంలో ఉన్న నాయకుల్లో వీరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నవి. ”టీఆరెస్ నుంచి చాలా మంది ప్రముఖులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు. త్వరలో వాళ్ళు మా పార్టీలోకి రాబోతున్నారు ” అనిటిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం విలేకరుల ఇష్టాగోష్టి లో చెప్పడం కాకతాళీయం కాదు. ఉత్తమ్, జానారెడ్డి, టి.కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్కుంతియా ఒకే వాహనంలో ‘సెక్యూరిటీ’ లేకుండా వెళ్లి శుక్రవారం టిఆర్ఎస్ నాయకులు కొందరితో మంతనాలు జరిపివచ్చారు. ఉత్తమ్ టీమ్ ‘ఎవరితో ‘ మాట్లాడిందన్న అంశం పైన కానీ, కాంగ్రెస్ నాయకులతో ‘టచ్’ లో ఉన్న టిఆర్ఎస్ నాయకులు ఎవరన్న విషయం పైన కానీ స్పష్టత లేదు. కానీ ఏదో వ్యవహారం రహస్యంగా జరుగుతున్నది. టిఆర్ఎస్ లో అసమ్మతి కార్యకలాపాలు ప్రత్యక్షంగా, బహిరంగంగా కనబడకపోవచ్చు. అంత మాత్రాన అసమ్మతి సద్దుమణిగిందని నిర్ధారణకు రాలేం. టిఆర్ఎస్ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ. టిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏదో విధంగా సర్దుకుపోవచ్చునని భావించే వాళ్ళు కొందరు ఉన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చినా తమ భవిష్యత్తు ఆశాజనకంగా ఉండకపోవచ్చునని, ‘అప్రజాస్వామిక ధోరణులు’ ఇంకా ప్రబలుతాయని అంచనాకు వస్తున్న వాళ్ళు, కాంగ్రెస్ కూటమి ‘గ్రాఫ్’ పెరుగుతున్నందున, ఆ పార్టీ విజయావకాశాలు మెరుగుపడుతున్నందున అందులో అవకాశాలు వెతుక్కుందామని అనుకుంటున్న వాళ్ళు… టిఆర్ఎస్ కు ‘గుడ్ బై’ చెప్పేందుకు ఆలోచిస్తున్నట్టు తెలియవచ్చింది. అయితే టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు అంత సులభంగా జరగకపోవచ్చు. టిఆర్ఎస్ ‘ఓటమి అంచున’ ఉన్నట్టు ధ్రువపరచుకున్న తర్వాతే కాంగ్రెస్ కు భారీ వలసలు ఉండవచ్చు.

Credits : S K Zakir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *