కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితి

Kodandaram Sir Party

తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో ఏర్పాటుకానున్న తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) పార్టీ విధివిధానాలు, లక్ష్యం, మార్గం తదితరాలపై కసరత్తు పూర్తయింది. టీజేఎస్‌ గుర్తుపై కూడా స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. రైతు నాగలి గుర్తుతో పార్టీని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

జేఏసీలోని కీలకనేతల సమాచారం ప్రకారం కోదండరాం పార్టీకి సంబంధించి ఫిబ్రవరి రెండోవారంలో ప్రకటన వెలువడనుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ జనసమితి పేరు దాదాపుగా ఖరారైంది. అయితే తెలంగాణ సకల జనుల పార్టీ, తెలంగాణ ప్రజాసమితి అనే పేర్లు కూడా జేఏసీ నేతలు, వారికి దగ్గరి సంబంధాలున్న వారి పేరుతోనే కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తులు అందాయి.

తెలంగాణ సకల జనుల పార్టీ పేరు పొడవుగా ఉందని, పలకడానికి సులభంగా ఉండదనే అభిప్రాయం వ్యక్తమైంది. తెలంగాణ ప్రజాసమితి పేరుకు గతంలో ఉన్నదే. దీంతో తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) పేరువైపే కోదండరాం మొగ్గు చూపుతున్నారు. ఏవైనా సాంకేతిక అవరోధాలొస్తే తప్ప టీజేఎస్‌ అనే పేరే ఖరారు కానుంది.

#రైతు_నాగలి_గుర్తు..
పార్టీకి రైతు నాగలి గుర్తును ఎంపిక చేసుకోవడానికి మొగ్గు చూపుతోంది. ఇప్పటిదాకా ఈ గుర్తు జాతీయస్థాయిలో జనతా పార్టీకి ఉండేది. జాతీయస్థాయిలో క్రియాశీలకంగా లేని పలు రాజకీయపార్టీల గుర్తింపును రద్దుచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నిర్ణయం తీసుకుంది. వీటిలో జనతాపార్టీ కూడా ఉన్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించాక 2001లో జరిగిన జిల్లా, మండల ప్రజా పరిషత్‌ ఎన్నికల్లో రైతు నాగలి గుర్తుతోనే పోరాడింది.

ఈ గుర్తుతో టీఆర్‌ఎస్‌కు సానుకూల ఫలితాలు కూడా వచ్చాయి. ఈ కారణంతో పాటు రైతు సమస్యలపై ఇప్పటికే పలు కార్యక్రమాలను జేఏసీ నిర్వహించింది. రైతులకు దగ్గరయ్యేందుకు రైతు నాగలి గుర్తు ఉపయోగపడుతుందని జేఏసీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో రైతు సమస్యలపై జేఏసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుంది. వ్యవసాయ సంక్షోభం, రైతు సమస్యలు, పరిష్కారాలపైనే ఈ సమావేశంలో చర్చించనున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. ఫిబ్రవరి రెండో వారంలో పార్టీని ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.

జేఏసీకి మరో సారథి..?
టీజేఎస్‌ పేరుతో ఏర్పాటు కాబోతున్న పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కోదండరాం వ్యవహరించనున్నారు. రాజకీయపార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ జేఏసీకి సారథిగా ఉండటం సరికాదనే యోచనకు కోదండరాం వచ్చినట్లు తెలుస్తోంది.

జేఏసీ ఆవిర్భావం నుంచి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కోదండరాం మిలియన్‌ మార్చ్, సాగరహారం వంటి కీలక ఘట్టాలకు సమర్థంగా సారథ్యం వహించారు. కోదండరాం స్థానంలో మరో నాయకుడికి సారథ్య బాధ్యతలు అప్పగించే అంశంపై కూడా అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. జేఏసీలో ముఖ్యపాత్ర పోషిస్తున్న కంచర్ల రఘు పేరు కీలకంగా వినిపిస్తోంది. ప్రొఫెసర్‌ ఇటిక్యాల పురుషోత్తం పేరుపైనా చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *