లోగుట్టు మామా అల్లుల్లకెరుక // కాళేశ్వరం కట్టు కథలు

కాళేశ్వరం వరమో శాపమో పక్కకుపెడితే ప్రాజెక్టులనేటియి మనకవసరం.. దాంట్ల ఏ పార్టీవోడు వేలెత్తి చూపనీకే లేదు.. కాకపోతే ఎంత మూల్యానికి అనేదే కావాలిప్పుడు.. ఆకలైతుందని రోకలి మింగుతమా..? దూపైతుందని శెర్ల దుంకుతమా..? ఇప్పుడు మనకు నీళ్ళు కావాలి అనే ఒకే ఒక్క సాకుతో తెలంగాణకు గుదిబండ ప్రాజెక్టులను నిర్మిస్తున్నరు..

తెలంగాణ భౌగోళిక పరిస్థితి ప్రకారం మనకు లిఫ్టు ప్రాజెక్టులే దిక్కు.. అది ఒప్పుకోవలసిన నిజం.. కాకపోతే భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్కొని అవసరమైన జాగల లిఫ్టులు పెట్కొని తతిమా జాగలల్ల గ్రావిటీ తోని ఒచ్చేటట్టు చేస్కుంటే భారం తగ్గుతుండే..

ఇంగ అసలు ముచ్చటకొస్తే మనకు కావల్శిన నీళ్ళు తుమ్మిడిహట్టి దగ్గరనే దొర్కుతుంటే కింద మేడిగడ్డ దాంక ఒచ్చి సుట్టుముట్టు తిరుక్కుంట ఎల్లంపల్లిదాంక మూడు బ్యారేజీలు కట్టి 75 మీటర్లు ఎత్తిపోసుడేందో అల్లకే తెల్వాలే.. మొదాలేమో మహారాష్ట్ర ఒప్పుకోదంటిరి ఇప్పుడేమో ఆడ నీళ్ళు లేవంటిరి.. 152 కి ఒప్పుకోకపోతే 148 ఒప్పిచ్చిర్రు కదా అట్ల కట్టినా నీళ్ళొస్తుండె కదా..దానికే కదా ఎయిర్ పోర్ట్ నుంచి మీ ఇంటికాడిదాక ర్యాలీలు తీపిచ్చుకుర్రు.. తెలంగాణ కోసం బొంతపురుగును ముద్దు వెట్టుకుంటా అంటివి ఫడ్నవిస్ కాళ్ళు వట్టుకొనన్న ఒప్పిస్తే ఐపోతుండే కదా..

మేడిగడ్డ తాన కుడ ప్రాణహిత కెల్లి ఒచ్చే నీళ్ళే ఆధారం.. సరే నీటి లభ్యతనే కావాల్నంటే ఇంకో 20 కి.మీ ల కింద ఇంద్రావతి నది కలుస్తది ఆడ కట్టొచ్చు కదా మల్ల.. ఎక్కడ తీస్కున్నా గదే 180 టీఎంసీలే కదా మనక్కావలశింది.. అవ్వి సుత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడితే గాని రావు.. కేవలం మహారాష్ట్రల 1800 ఎకరాలు ముంపుకు బాధైతుంది గాని ఇక్కడ ఏకంగ లక్ష ఎకరాలు ముంచుడు భావ్యమా..?

ఇగ బ్యారేజీలది మరో లెక్క.. 18 లక్షల ఎకరాల ఆయకట్టు, 6 లక్షల ఎకరాల స్థిరీకరణ కావాల్నంటే ఒచ్చినయి ఒచ్చినట్టు ఎత్తిపోశినా సుత కష్టం అసోంటిదానికి నీటి నిల్వకు ఆస్కారం ఎక్కడుంటది.. అంత పెద్ద రిజర్వాయర్లు కట్టుకునుడెందుకో మరి.. భవిష్యత్ అవసరాల కోసం అని చెప్తున్నా సుత మీరు చెప్పే లెక్కలకు పొంతన లేదు..

ఎందుకంటే ఒక మల్లన్నసాగర్నే తీస్కుంటే 50 టీఎంసీల కోసం 14 ఊర్లను ముంచుతున్నరు.. సరే అవసరం అనుకుందాం.. అక్కడ సహజ వనరులేమన్న ఉన్నయా ఇమాంబాద్ కెల్లి లిఫ్టు చేసిన గోదావరి నీళ్ళు తప్ప వేరే ఏ నది అక్కడ లేదు.. కనీసం కొండలు గుట్టలు కుడ లెవ్వు.. కేవలం భూమి మీదనే కట్టలు పోశి నిర్మించే జలాశయం.. సరే అది కూడా అవసరమే అనుకుందాం.. అక్కడ రోజుకు 0.75 టీఎంసీలే ఎత్తిపొయ్యడానికి ఆస్కారముంది.. వానలు పడే 120 రోజుకు ఎత్తిపోశినా 90 టీఎంసీలే అక్కడ ఉండేది( అది కూడా భారీ వానలు పడితే).. మీరు చెప్పిన లెక్కల ప్రకారం 30 టీఎంసీలు హైద్రావాద్ తాగునీటికి 26 టీఎంసీలు పారిశ్రామిక అవసరాలకు పోతే మిగిలిన 44 టీఎంసీలల్ల మీరు చెప్పిన 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఒస్తదా..? ఇంక అక్కడికెల్లి గందమల్ల, బస్వాపూర్, కొండపోచమ్మ రిజర్వాయర్లకు 27 టీఎంసీలు పంపాలే.. ఇవన్ని పంపుకుంట కుసున్నంక నీళ్ళసలు ఉంటయా ఎర్ర రొయ్యలు ఉంటయా మల్లన్నసాగర్ల… దానికి 50 టీఎంసీల రిజర్వాయరు అవసరమేంది అన్ని ఊర్లను ముంచుడేంది..?

ఇంక భూములున్నోల్లు పువ్వులల్ల పెట్టి మీకప్పజెప్తమన్నరా ఎవలన్న.. లేకుంటే మమ్మల్ని నిర్వాసితులం చెయ్యకుంటే సచ్చిపోతం అన్నరా..? చిన్నప్పటికెల్లి ఉన్న ఊర్లు పోతుంటే ఎవలన్న కొట్లాడుతరు కేసులేస్తరు.. మీరు పొయ్యి దైర్ణం చెప్పలే ప్రతిపక్షాలు పొయ్యి మద్దతు తెలిపినయి.. అంతే గాని కేసులేస్తే తెలంగాణ ద్రోహిలెక్క చిత్రీకరించుడేంది..?

 

ఇక్కడ నీళ్ళ గురించి అడిగినోన్ని ద్రోహి లెక్క ఒక ముద్ర ఏసుట్ల మాత్రం విజయం సాధించిర్రు.. నీళ్ళ అవసరం ఎంతుందో భవిష్యత్తులో తెలంగాణ మీద భారం పడకుండా ఉండడం కూడా ముఖ్యం.. కేవలం విద్యుత్ ఖర్చులే సంవత్సరానికి 8 వేల నుంచి 12 వేల కోట్లు అయితుంది.. ఐతెమాయే మనకు నీళ్ళు కావాలే అనుకుంటే తల్లెల మన్ను వొస్కొని బుక్కినట్టే ఉంటది.. మనకు ప్రాజెక్టులు కావాలే భారం పడకుంట ఉండాలే..

ఏమన్నంటే ట్రబుల్ షూటర్ మాట్లాడాలే అయిపోతది ప్రెస్ మీట్ పెట్టాలే మూస్కుంటరు అని బేకార్ ముచ్చట్లు మాట్లాడకుర్రి.. మాట్లాడితే అబద్ధాలు నిజాలైతయా..? శాతనైతే కింద పోతిరెడ్డిపాడు కెల్లి ఆంద్రోల్లు రోజుకు 70 వేల క్యుసెక్కుల నీళ్ళు దొబ్బుకపొతుర్రు దాని మీద మాట్లాడుర్రి.. ఇప్పుడు కృష్ణా మీద కట్టనీకే ఏం మిగలలే కాబట్టి మాట్లాడరు.. ఎన్కకెల్లి ఏనుగు పొయ్యినా ఏం గాదు గాని ముంగటికెల్లి శీమ కుడ పోవద్దు అంతేనా..?

మనకు నీళ్ళు కావాలే ప్రాజెక్టులు కావాలే తెలంగాణకు అవసరంగ ఉండాలే.. అంతేగాని ఇష్టమొచ్చినట్టు కట్టుకుంటం తెలంగాణ పేరు చెప్పి అంటే ఇది మీరన్నట్టు గుడ్డి తెలంగాణనో ఎడ్డి తెలంగాణనో కాదు.. కాంగ్రెసోల్లు సొక్క పూసలు కాదనే కదా మిమ్మల్ని కుసీవెట్టినం.. ఇంక ఆల్ల మీద పడి ఏడిశి ఎన్ని దినాలు పబ్బం గడుపుతరు.. ఇంక జై తెలంగాణ నినాదం కాదు మనక్కావలశింది జాగో తెలంగాణ..

ఇంక ఆఖరికి చెప్పొచ్చేదేందంటే కాళేశ్వరం యాత్రలు అని చెప్పి కాశీ యాత్ర లెక్క చేపిస్తున్నరు ఎలక్షన్లు ఒచ్చినయి కదా అని.. ఆ యాత్రల పైసలతోటి శిన్నపాటి బ్యారేజ్ కట్టొచ్చు.. కాళేశ్వరం కథలు కాశీ మజిలీ కథలు ఆపుర్రి రాష్ట్రంల ఇంక మస్తు సమస్యలున్నయి.. వాస్తవాలను నమ్ముదాం కథనాలనో కథలనో కాదు.. 60 ఏండ్లకెల్లి ఎవడో చెప్తే నమ్మినం ఇప్పుడు వీళ్ళు చెప్తే నమ్ముతున్నం.. ఇగ నమ్ముకుంటనే కుసుందామా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *