ఆ రాత్రి మామా అల్లుళ్ల మధ్య ఏం జరిగింది ?

కేసీఆర్ కుటుంబానికి, మంత్రి హరీష్ రావుకు మధ్య ఏదో తేడా కొడుతోంది. అలాంటిది ఏమీ లేదని హరీష్ పదే పదే వివరణ ఇచ్చినా… ఇటీవల కాలంలో జరుగుతోన్న పరిణామాలను గమనిస్తే నిప్పు ఎక్కడుందో తెలియదు కానీ… పొగమాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా తనయుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీటం పై కూర్చోబెట్టాలని సీఎం కేసీఆర్ ఆతృత పడుతున్నారు. కేసీఆర్ రాజకీయ వారసుడిగా తాను ఎదగాలని హరీష్ చాలా కాలం నుంచి ఆశలు పెంచుకున్నారు. తీరా కుటుంబ వరసుడు కేటీఆర్ వచ్చి పదవి తన్నుకుపోతుండటంతో పార్టీలో హరీష్ బాగా ఉక్కపోతకు గురవుతున్నారు.


రాజకీయ వ్యవహారాల్లో తెర వెనుక చక్రం తిప్పడంలో హరీష్ దిట్ట. ఆయనను మరో చంద్రబాబుగా తెలంగాణ రాజకీయవర్గాలు అభివర్ణిస్తుంటాయి. ఎన్టీఆర్ ను దించి… చంద్రబాబు సీఎం అయినట్టు… కేసీఆర్ ను దించో లేక కేసీఆర్ తర్వాతో హరీష్ సీఎం అవుతారన్న ఊహాగానాలు కూడా అప్పుడప్పుడు జనాల్లో వినిపిస్తుంటాయి. హరీష్ తన మనసులో కోరిక బయటపడకుండా జాగ్రత్తగా వ్యవహారం చక్కబెడుతుంటారు. తనకు మామే సర్వస్వం అని గంటాపథంగా చెబుతుంటారు.
ఇదే క్రమంలో పార్టీ పై పట్టుపెంచుకోవడం కోసం హరీష్ తెర వెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. తనకంటూ బలమైనవర్గం ఉండేలా ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఒదేలుతో పాటు టికెట్లు దక్కని చాలా మంది నాయకులకు హరీష్ తనదైన శైలిలో భరోసా ఇస్తున్నాట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ తో పాటు, ఆయన తరఫున బలంగా నిలబడే మంత్రి ఈటెల రాజేందర్ ను ఓ వారం రోజుల క్రితం పిలిపించుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇద్దరిని రాత్రి 11 గంటల ప్రాంతంలో పిలిచి తెల్లవారుజామున నాలుగు గంటలకు వదిలినట్టు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ రాత్రి ఏం జరిగిందన్నది క్వశ్చన్ మార్క్. అయితే, ఆ తర్వాత టీవీ ఛానెళ్లకు హరీష్ ఇస్తోన్న ఇంటర్వ్యూలు, సిద్ధిపేట ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపూర్ లో ఒకింత భావోద్వేగంతో చేసి వ్యాఖ్యాలు చూస్తుంటే… ఆ రాత్రి హరీష్ కు కేసీఆర్ గట్టి స్ట్రోకే ఇచ్చినట్టున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆ స్ట్రోక్ ఏమిటన్నది కొంత సస్పెన్స్ గా ఉంది. బీజేపీ అగ్రనేతలతో హరీష్ టచ్ లో ఉన్నారని చాలా కాలంగా ప్రచారం ఉంది. ఆ ఇష్యూ మీదే పిలిపించారా… లేక పార్టీ అంతర్గత వ్యవహారాల్లో హరీష్ రచించుకుంటోన్న వ్యూహాన్ని పసిగట్టి పిలిపించారా అన్నది సస్పెన్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *