హెచ్‌ఆర్‌సీకి గ్రూప్‌-2 సెలెక్టెడ్‌ అభ్యర్థుల మొర..!

న్యాయం కోసం హెచ్‌ఆర్‌సీలో పిటిషన్‌
‘గ్రూప్‌-2 ఉద్యోగాల నియామకంలో టీఎస్ పీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా మూడేళ్లుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నాం. ప్రభుత్వ పెద్దలను కలిసినా న్యాయం చేయడంలేదు. సమస్య కోర్టు పరిధిలో ఉందంటూ దాటవేస్తున్నారు. టీఎస్ పీఎస్సీ చేసిన తప్పునకు మేం చస్తూ బతుకుతున్నాం. అందుకే మా అందరి కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వండి’’ అంటూ 2015 గ్రూప్‌-2 సెలెక్టెడ్‌ అభ్యర్థులు 3147 మంది మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ)ను ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను హెచ్‌ఆర్‌సీ విచారణకు స్వీకరించింది.

2015 డిసెంబరులో 439 గ్రూప్‌-2 పోస్టులకు, 2016 సెప్టెంబరులో మరో 593 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటికి 2016 నవంబరులో పరీక్షలు నిర్వహించారు. మెరిట్‌ జాబితా ప్రకటనకు ముందు కొంతమంది అభ్యర్థులు తాము ఓఎంఆర్‌ షీట్‌లో వైట్‌నర్‌ ఉపయోగించామని, తమను పరిగణనలోకి తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్‌ చేసింది. వైట్‌నర్‌ అభ్యర్థుల విషయంలో టీఎస్ పీఎస్సీ స్పందించి ఓఎంఆర్‌ షీట్లను పరిశీలించింది. అనంతరం 3147 అభ్యర్థులతో మెరిట్‌ జాబితాను ప్రకటించింది. వీరిలో 338 మంది వైట్‌నర్‌ ఉపయోగించిన అభ్యర్థులున్నారు. వీరి ఎంపికతో మెరిట్‌ జాబితాలో స్థానం కోల్పోయిన అభ్యర్థులు ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

టీఎస్ పీఎస్సీ నిర్ణయాన్ని తప్పుబట్టిన కోర్టు.. వైట్‌నర్‌ అభ్యర్థులను మెరిట్‌ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఆ మేరకు కమిషన్‌ నూతన జాబితాను ప్రకటించగా.. పరీక్ష కేంద్రాల నిర్వాహకుల తప్పిందం వల్లే తాము వైట్‌నర్‌ను ఉపయోగించామంటూ 338 మంది అభ్యర్థులు పిటిషన్‌ వేశారు. వాదనలు ఫిబ్రవరి 14న ముగిశాయి. ఇన్విజిలేటర్ల తప్పిదం వల్ల ఎవరైనా వైట్‌నర్‌ ఉపయోగించారేమో తెలుపుతూ వివరాలు ఇవ్వాలని హైకోర్టు టీఎస్ పీఎస్సీని ఆదేశించింది. కమిషన్‌.. కోర్టుకు ఎలాంటి వివరాలు అందజేయలేదని సెలెక్టెడ్‌ అభ్యర్థులు తెలిపారు. కోర్టులో అడ్డంకులు తొలగించాలంటూ తాము టీఎస్ పీఎస్సీ ముందు పలుమార్లు ధర్నాలు చేపట్టామని, ప్రగతి భవన్‌ను ముట్టడించామని, గవర్నర్‌నూ కలిశామని, న్యాయం జరగలేదని వాపోయారు, పరీక్షా కేంద్రాల్లో వున్న ఇన్విజిలేటర్ల బాధ్యతా రాహిత్యం వల్ల ఇంకేన్నిరోజులు ఇలా నిరుద్యోగిగా బతకాలో అర్ధంకావటం లేదంటు ఎర్రటి ఎండలో, రోడ్డేక్కిన విద్యార్థులు తమ నిస్సహాయతను, నిరసనను తెలియజేస్తున్న ఎవ్వరు పట్టించుకోకపోవటం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *