జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగారా

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. నవంబర్ 18 నుంచి జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి తెలిపారు. నవంబర్ 18 నుంచి నవంబర్ 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఆన్ లైన్ ద్వారా కూడా నామినేషన్లను దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. నవంబర్ 21న నామినేషన్ల పరీశీలన ఉంటుందన్నారు. నామినేషన్ల తిరస్కరణకు నవంబర్ 22 మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. అదే రోజు అభర్థుల జాబితాని ఫైనల్ చేస్తామని తెలిపారు. డిసెంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అవసరమైన చోట డిసెంబర్ 3న ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు.

2016 నాటి జీహెచ్ఎంసీ ఎన్నికల రిజర్వేషనే ఈసారి కూడా వర్తిస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. జీహెచ్ఎంసీ మేయర్ పదవి మాత్రం జనరల్ మహిళకు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. 150 వార్డులకు గాను 2 ఎస్టీలకు(1 మహిళ, 1 జనరల్), 10 ఎస్సీలకు(5 మహిళ, 5 జనరల్), 50 బీసీలకు(25 మహిళ, 25 జనరల్), 44 జనరల్ మహిళలకు, 44 స్థానాల్లో జనరల్ అభ్యర్థులకు అవకాశం కల్పించింది. జీహెచ్ఎంసీలో జనరల్ అభ్యర్థుల నామినేషన్ కోసం రూ. 5 వేలు డిపాజిట్ చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు రూ.2,500 డిపాజిట్ చేస్తే సరిపోతుందని తెలిపారు. ఒక్కో అభ్యర్థి అత్యధికంగా రూ.5లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చునని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో పార్థసారథి మాట్లాడుతూ 2021 ఫిబ్రవరితో జీహెచ్ఎంసీ పాలక వర్గం గడువు ముగుస్తుందని తెలిపారు. పాలకవర్గం గడువు ముగిసే లోపు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. 2016 నాటి జీహెచ్ఎంసీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి తుదినిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈవీఎంలపై అభ్యంతరాలు రావటంతో బ్యాలెట్ పద్ధతిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 150 వార్డులకు గాను 150 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.  జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు.

జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 74 లక్షల 286 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అందులో పురుషులు 38 లక్షల 56 వేల 770, మహిళలు 35 లక్షల 46 వేల 847, ఇతరులు 669 మంది ఉన్నారని చెప్పారు. గ్రేటర్ లోని 150 వార్డులకు గాను 9248 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఉందని పార్థసారథి తెలిపారు. ఇప్పటికే ఎన్నికల కసరత్తు పూర్తి చేసినట్లు చెప్పారు. 48 వేల మంది సిబ్బందితో ఎన్నికలు నిర్వహిస్తామని సుమారు 30 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సున్నితమైన పోలింగ్ కేంద్రాలు 1,439; సమస్యాత్మక కేంద్రాలు 1,004; అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 257 ఉన్నట్లు గుర్తించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *