యాదాద్రిలో వేశ్యా గృహాలకు ఆయనే అండ…?

చిన్న సమస్యలకు చోటా నేతల సాయం
ఆలేరు పరిసరాల్లో వందల వేశ్యా గృహాలు
ఓటు బ్యాంకు కోసమే నేత అండదండలు

చిన్నారుల్ని గద్దల్లా తన్నుకుపోయి, చీకటి గదుల్లో బంధించి పడుపు వృత్తిలోకి దింపుతున్న ముఠాలకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. యాదాద్రిలోనే కాదు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజలకోసం పోరాటాలు చేస్తున్నామని చెప్పుకొనే నాయకులే మానవత్వాన్ని మంటగలిపే చర్యలకు ఒడిగడుతున్నారు. కొన్ని కేసుల్లో వ్యభిచార గృహాల నిర్వాహకులకు, స్థానిక అధికారులకు మధ్య రాయబారాలు చేస్తున్నారు. స్థానికంగా గొడవలు జరిగిన సందర్భాల్లో సదరు వృత్తి వారికి మద్దతుగా నిలుస్తున్నారు.

వీటన్నింటికీ ప్రధాన కారణం ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నమేనని పోలీసులదర్యాప్తులో తేలింది. బంకర్లలో పిల్లల్ని దాచి, ఆరోగ్యానికి అత్యంత హానికరమైన ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్లు ఇచ్చి బలవంతంగా పడుపు వృత్తిలోకి దింపుతున్న యాదాద్రి వ్యభిచార మాఫియాకు ఓ ప్రధా న పార్టీ జిల్లా స్థాయి నేత అభయహస్తం ఉందని అధికారులు గుర్తించారు. దశాబ్దాలుగా సాగుతున్న యాదాద్రి చీకటి వ్యాపారాన్ని గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రజాప్రతినిధి ఓటుబ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు రావడంతో అధికారులు ఆయనపై దృష్టి సారించారు. యాదాద్రి వద్ద వ్యభిచార గృహ నిర్వాహకులకు రెండు వేర్వేరు పార్టీలకు చెందిన చోటా నాయకులు చిన్నాచితకా విషయాల్ని సర్దుబాటు చేయడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని తేలింది. ఆలేరు నియోజకవర్గంలో రెండు ప్రాంతాల్లో వ్యభిచారం జోరుగా సాగుతోంది. యాదాద్రి వద్ద సుమారు 150 కుటుంబాలు పడుపు వృత్తిలో ఉన్నాయి.

యాదాద్రి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరు సమీపంలో 10 కుటుంబాలు ఇదే వృత్తిలో ఉన్నాయి. ఒక్కో ఇంటి నుంచి కనీసం ముగ్గురు ఓటర్లు ఉండటంతో ఓటు బ్యాంకు చేజారకుండా నాయకులు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. వ్యభిచార గృహాల నిర్వాహకులతో టచ్‌లో ఉంటూ వారికి అవసరమైన పనులు చేసి పెడుతున్నారు. యాదాద్రిలో పోలీసు తనిఖీల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా వ్యభిచార గృహాల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు.

యాదాద్రి వద్ద వ్యభిచారం దశాబ్దాలుగా జరుగుతున్నా అక్కడ అనుసరిస్తున్న విధానాలు అత్యంత ఘోరంగా ఉన్నట్లు తాజా పోలీసు దాడుల్లోనే వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్లు కూడా లేని చిన్నారులకు పశువులకిచ్చే ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్లు ఇచ్చి, పెద్దవారిగా మార్చి పడుపువృత్తిలోకి దింపుతున్నట్లు పోలీస్‌ దాడుల్లో వెలుగులోకి వ చ్చింది. విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్న ఉన్నతాధికారులు దర్యాప్తు తీరుతెన్నుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చీకటి వ్యాపారం వెనక ఉన్న అసలు ముఠాల్ని గుర్తించేందుకు సిద్ధమవుతున్నారు. గతం లో పోలీసులు పట్టుకున్నప్పుడు ఫోన్లు చేసి న నాయకులు ఈ సారి అలా చేయడంలేదు. దర్యాప్తు ఎక్కడివరకు వచ్చిందనే వివరాల్ని ఎప్పటికప్పుడు తమకు ఉన్న పరిచయాలతో ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
రింగుమాస్టర్‌ లోపలికెళ్లడంతో
రాజకీయ నాయకుల అండదండలు, పోలీసుల స్నేహాన్ని అడ్డం పెట్టుకొని యాదగిరి అనే వ్యక్తి యాదాద్రితోపాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో చీకటి దందాకు కీలకంగా మారాడు. వ్యభిచార గృహ నిర్వహకులకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా తన నెట్‌వర్క్‌ సాయంతో మేనేజ్‌ చేసేవాడు. ప్రస్తుతం యాదగిరి జైల్లో ఉండటంతో నిర్వాహకులు ఇరకాటంలో పడ్డారు. పోలీసులు సైతం మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసి మూలాలు గుర్తించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక వయస్సు పిల్లలను అపహరించి వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్న ముఠా ఎవరనే దానిపై కూడా పోలీ్‌సలు దృష్టి సారించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *