Polytricks.in

అరాచ‌కానికి ప‌రాకాష్ట నెక్కొండ ఎస్సై, ఫిర్యాదులు తీసుకోకుండా స్టేష‌న్ లోనే మ‌ధ్యాహ్నం కునుకు

వ‌రంగ‌ల్ జిల్లాలోని ఆ పోలీస్ స్టేష‌న్ లో అస‌లు కేసులే రిజిస్ట‌ర్ అవ్వ‌వు. ప్ర‌తి సంవ‌త్సరం ముగింపులో జ‌రిగే మ‌దింపులో వారి పీఎస్ ప‌రిధిలోనే అతిత‌క్కువ కేసులు న‌మోద‌వ‌తున్నాయి. అబ్బా ఎంత చ‌క్క‌టి ప‌రిపాల‌న‌, శాంతిభ‌ద్ర‌త‌లు ఎంత చక్క‌గా కాపాడుతున్నారు. ఇదే క‌దా మీ మ‌దిలోకి వ‌చ్చిన ఆలోచ‌న‌. నిజానికి ఇక్క‌డ ప‌నిచేస్తున్న‌ది పోలీసుల స‌మ‌ర్ధ‌వంత‌మైన ప‌హారా కాదు. స్థానిక ఎస్సై బెదిరింపులు, అమ్యామ్యాలు. ఇంతకీ ఆ పోలీస్ స్టేష‌న్ ఎక్క‌డ‌నే క‌దా మీ అనుమానం. న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని నెక్కొండ పోలీస్ స్టేష‌న్. కేసులు పెట్టేందుకు ఎవ‌రైనా స్టేష‌న్ కు వ‌చ్చారంటే అంతే సంగ‌తులు. వారి జేబులు ఖాళీ అవ్వాల్సిందే. వారి కేసు న‌మోదు అయ్యేందుకు తిరిగి, తిరిగీ చెప్పులు అర‌గాల్సిందే. ఎన్ని ఆధారాలున్నా అక్క‌డ ప‌నిచేయ‌వు. కేవ‌లం అక్క‌డ ప‌నిచేసేంది లంచాలు మాత్ర‌మే. చేయి త‌డ‌ప‌నిదే ఆ పోలీస్ స్టేష‌న్ లో పని జ‌రుగ‌దు. ఒక‌వేళ కేసు రిజిస్ట‌ర్ చేయాల్సిందే అని మ‌నం ప‌ట్టుబ‌డితే నెక్కొండ ఎస్సై ద‌గ్గ‌ర మ‌రో మంత్రం కూడా ఉంది. ఈ చిల్ల‌ర పంచాయ‌తీలు ఏంటి? పెద్ద మ‌నుషుల ద‌గ్గ‌రికి వెళ్లి సెటిల్మెంట్ చేసుకొండి అంటూ ఉచిత స‌ల‌హా ప‌డేస్తారు. స‌ల‌హా అయితే ఉచిత‌మే కానీ…పంచాయ‌తీ ఉచితం కాదు. ఆయ‌న మాట విని పెద్ద మ‌నుషుల ద‌గ్గ‌రికి వెళ్తే జేబులో ఉన్న‌ది క్ష‌వ‌రం అవ్వ‌డం మాత్ర‌మే కాదు బ‌య‌ట నుంచి అప్పు కూడా తేవాల్సిందే. ఒక‌వేళ పెద్ద‌మ‌నుషుల పంచాయ‌తీకి ఒప్పుకోక‌పోతే ఎస్సై మ‌ళ్లీ సీన్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఆర్మీ నుంచి వ‌చ్చాను. తప్పు ఒప్పుల గురించి నాకంటే నీకు బాగా తెలుసా? అంటూ ఓ డైలాగ్ వ‌దులుతారు. అయినా విన‌క‌పోతే బూతు పంచాంగం అందుకుంటారు.

ఇటీవ‌ల నెక్కొండ పీఎస్ ప‌రిధిలో ఓ గ్రామంలో జ‌రిగిన గొడ‌వ‌పై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వ్య‌క్తికి చేదు అనుభ‌వం ఎదురైంది. కేసు పెట్టేందుకు ఉద‌యం 10 గంట‌ల‌కు వెళ్లిన అత‌న్ని…సాయంత్రం 4 గంట‌ల వర‌కు బ‌య‌టే కూర్చొబెట్టారు. గ‌ట్టిగా నిలదీయ‌డంతో ఎస్సై ఏదో ప‌నిపై అర్జెంటుగా బ‌య‌ట‌కు వెళ్తున్నారు రేపు పొద్దేన్నే వ‌చ్చెయ్ అంటూ తిరిగి పంపేశారు. అలా నాలుగు రోజులు తిప్పుకున్న త‌ర్వాత కంప్లైంట్ తీసుకున్నారు. అయితే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేదు. ఫిర్యాదుదారుడ్ని ఓ వారం రోజులు నానా తంటాలు పెట్టిన త‌ర్వాత తీరిగ్గా ఓ విష‌యం చెప్పారు. ఇది ఎఫ్ఐఆర్ చేయాల్సినంత పెద్ద కేసు కాదు. అవ‌తలి పార్టీని పిలిపిస్తా సెటిల్ చేసుకో అన్నారు. పెద్ద‌మ‌నుషుల్లో కూర్చొని మాట్లాడుకోవాల‌ని చెప్పారు. దీంతో పంచాయ‌తీ పెట్టినందుకు ఫిర్యాదుదారుడు పెద్ద‌మ‌నుషుల చేతులు త‌డ‌పాల్సి వ‌చ్చింది. పైగా అవ‌తలి వ్య‌క్తి త‌ప్పేమీ లేద‌ని కూడా తేల్చేశారు పెద్ద‌మ‌నుషులు. ఇదేంది సారూ అని మ‌ళ్లీ పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చిన వ్యక్తికి భంగ‌పాటు ఎదురైంది. అస‌లు నీది ఒక కేసే కాదు. ఇంకా దాన్ని ఎఫ్ఐఆర్ చేయాలా? అంటూ అవ‌మానించి పంపించారు. ఇదొక్కటే కాదు అన్ని సాక్ష్యాధారాల‌తో పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కినా కూడా బాధితుల‌కు న్యాయం జ‌రుగ‌డం లేదు. నెక్కొండ ఎస్సై అరాచ‌కాల నుంచి త‌మ‌ను ఎవ‌రు కాపాడుతారా? అంటూ వారు దీనంగా ఎదురుచూస్తున్నారు. ధైర్యం చేసిన కేసు పెట్టేందుకు వెళ్తే బూతు పురాణం కూడా వినాల్సి వ‌స్తుంద‌ని బాధితులు వాపోతున్నారు. అయితే ఇదంతా పేద‌ల‌కు మాత్ర‌మే. బడా బాబులు, రాజ‌కీయ నాయ‌కులకు నెక్కొండ పీఎస్ లో స‌ప‌రేట్ రూల్స్ ఉంటాయి. వారికి స‌క‌ల మ‌ర్యాద‌ల‌తో కేసులు ప‌రిష్క‌రిస్తారు.

ఇక నెక్కొండ ఎస్సై ద‌గ్గ‌ర మ‌రో క‌ళ కూడా ఉంది. పేరుకు మాత్ర‌మే ఆయ‌న డ్యూటీ చేస్తారు. పోలీస్ స్టేష‌న్ లోనే ఉంటారు కానీ ఫిర్యాదు దారుల్ని క‌ల‌వ‌రు. ఆయ‌న కోసం స్టేష‌న్ లోనే ఉండే ప్ర‌త్యేక‌మైన రూంలో రెస్ట్ తీసుకుంటారు. మ‌ధ్యాహ్నం కాసేపు కునుకు తీస్తారు. దీంతో ఆ స్టేష‌న్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే ఎస్సై ఎప్పుడు నిద్ర లేస్తారా? అని గంట‌ల త‌ర‌బ‌డి వేచి చూడాల్సి వ‌స్తుంద‌ని ప్ర‌జ‌లు అంటున్నారు. ఒక‌వేళ ఆయ‌న మెల‌కువ‌లో ఉన్నప్పుడు వెళ్లినా…కేసు రిజిస్ట‌ర్ చేయ‌కుండా తిప్పించుకుంటార‌ని చెప్తున్నారు. ఇలా నెక్కొండ ఎస్సై ప్ర‌వర్త‌న‌తో పోలీస్ శాఖ‌పై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం మ‌రింత స‌న్న‌గిల్లుతోంది.

Exit mobile version