రాజి రమణీయత –End of Two Men Show (Modi-Sha)

మార్పు తీసుకురావాలంటే సానుకూల దృక్పథం అవసరం. వ్యతిరేక ఆలొచనలున్నవారు ఎంతసేపు విభజనలు, వైరుధ్యాల కోసమే ఆలోచిస్తారు. జాతి నిర్మాణ క్రతువులో అలాంటి వ్యక్తులు భాగం కాలేరు. ఎదుటి వ్యక్తులపైన, అవతలివారి కుటుంబాల పైనా, దేశంపైన విశ్వాసం ఉంచాలని హిందుత్వం చెప్తుంది. కాంగ్రేస్ ముక్త్ భారత్ అనేది పూర్తి రాజకీయ నినాదం, అది సంఘ్ భాషలో భాగం కాదు. ముక్త్ అని ఏ ఒక్కరిని మినహాయించే భాషను సంఘ్ ఎప్పుడు ప్రయోగించబోదు…RSS చీఫ్ మోహన్ భగత్(గత ఏప్రేల్ 1న విదేశాంగ శాఖ కార్యదర్శి ధ్యానేశ్వర్ మూలే రచించిన ఆరు పుస్తకాలను పూణేలో ఆవిష్కరణ సభలో) .

BJP, RSS మధ్య గత నాలుగు సంవత్సరాలలొ పెరిగిన సైధాంతిక భిన్న అభిప్రాయాలను మోహన్ భగత్ మాటల్లో గమనించవొచ్చు. మోహన్ భగత్ మాటలు ఎవరిని తాకుతాయో తెలియని సగటు భారతీయుడు ఉండదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడ పెద్దగా ఉపయోగించని “కాంగ్రేస్ ముక్త్ భారత్” నినాదాన్ని కాశ్మీరులొ PDP తో భాగస్వామ్య పక్షంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి మోడి ప్రతి సందర్భంలో వాడుతున్నారు.

ప్రణబ్ ముఖర్జీ RSS సమావేశంలో పాల్గొనటం మీద మీడియా చేస్తున్న ఊహాగానాలు ముఖ్యంగా 2019లో BJPకి పూర్తీ మెజారిటి రాని పక్షంలో RSS ప్రణబ్ ను ప్రధానిగా ప్రతిపాదిస్తుందని రాసున్న పేజీల కొద్ది వార్తలు, గంటల కొద్ది ప్రసారాల్లో వాస్తవికత పాలు దాదాపు శూన్యం. ఇప్పుడు ప్రణబ్ ను కాని గతంలో ఇతర నాయకులను కాని RSS ఆహ్వానిచటం కేవలం భిన్న ఆలోచనల గురించి మొదటి పేరాలో రాసిన కోణంలోనే చూడాలి. ప్రణబ్ ను RSS ప్రత్యామ్నాయ ప్రధాని అభ్య్రదిగా పరిశీలిస్తుంది అన్నది కనీసం చర్చనీయాంశం కూడా కాదు.

ఈవారం మరో సంచలన వార్త RSS సర్వేలో BJPకి కేవలం 130 స్థానాలే వస్తాయని తేలిందని “దైనిక్ భాస్కర్”లో వొచ్చిన కథనం. ప్రతి పార్టి మరియు వాటి అనుబంధ సంస్థలు అంతర్గత సర్వేలు నిర్వహించటం రివాజు. కాని అలాంటి సర్వేల వివరాలు బయటకి రావటం కద్దు. మరి 2019 BJPకి అనుకూలంగా ఉందా? ఇప్పుడే 2019 ఫలితాల అంచనాలు వెయ్యటం కన్నా పార్టీలు ఎన్నికలకు ఎలా సిద్దం అవుతున్నాయి అన్నది తెలుసుకోవటమే ముఖ్యం.

గత 4 సంవత్సరాలుగా నడిచిన మోషా (మోడి-అమిత్ షా) ద్వయం హవా,“Two Men Show”కు ఇప్పుడు అదనపు పాత్రధారులు అవసరం అయ్యారు. 2014లో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వొచ్చిన BJP ఇక తమకు ఎదురు లేదన్న రీతిలో “హర హర మోడి” అంటూ మిత్రపక్షాలను నిర్లక్షం చెయ్యటం, పాలనలో ఏకపక్ష నిర్ణయాలతో సాగింది.NDA కూటమిలో BJP తరువాత అత్యధిక స్థానాలు గెలిచినా శివసేన(18) తో పొట్టు తెంచుకొని 2014 అక్టోబర్లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలో పెద్దపార్టీగా అవతరించిన తరువాత BJPకి తామే స్వయంగా దేశం మొత్తం విస్తరిచగలమన్న విశ్వాసం వొచ్చింది.

డిల్లి,బీహార్ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలినా ఉత్తరప్రదేశ్ ఎన్నికల గెలుపుతో దూకుడు మీద ఉన్న అమిత్-మోడి ద్వయానికి గత సంవత్సరంగా ఉప ఎన్నికల్లో ఎదురవుతున్న ఓటములు తమ కాళ్ళ కిందకి నీళ్ళు చేరుతున్న వాస్తవాన్ని తెలియచేశాయి.

2014 నుంచి BJP 13 సిట్టింగ్‌ స్థానాలతో కలిపి మొత్తం 27 లోకసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా బిజెపి గెలిచింది కేవలం ఐదు స్థానాలలోనే,అంటే BJP 8 సిట్టింగ్ సీట్లలో ఓడిపోయింది. వీటిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రులు ఖాళి చేసిన గోరక్ పూర్,ఫూల్ పూర్ ఉండటం BJPని ఆందోళనకు గురిచేసే అంశం. 2013 ముజఫర్ నగర్ అల్లర్లకు నాయకత్వం వహించిన “హుకుం సింగ్” మరణంతో మే చివరి వారంలో జరిగిన కైరానా నియోజకవర్గం ఉప ఎన్నికలో హుకుం సింగ్ కూతురు BJP తరుపున ఓడిపోవటం BJPకి ద్రిగ్భ్రాంతిని కలిగించింది.

భారత్ సైన్యంలో పనిచేసిన హుకుం సింగ్ కైరానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున 1974-1993 మధ్య కాంగ్రెస్ తరుపున, 1996-2014 మధ్య BJP తరుపున మొత్తంగా ఏడుసార్లు MLAగా, ఒక సారి MPగా గెలిచారు. ఈ ప్రాంతంలో బలమైన నాయకుడిగా ఎదిగిన హుకుం సింగ్ అజిత్ సింగ్ కుటుంబ ఆధిపత్యాని తగ్గించారు. అలాంటి హుకుం సింగ్ మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కూతురు BJP తరుపున ఓడిపోవటానికి ప్రతిపక్షాల ఐక్యతే కారణం అని BJP సమర్ధించుకో లేదు.ఉత్తరప్రదేశ్ రైతులు ముఖ్యంగా ముజఫర్ నగర్ ప్రాతంలో చెరకు రైతుల ఎదుర్కుంటున్న సమస్యలను పట్టించుకోని BJP కైరానా ఫలితాలు వొచ్చిన మూడోరోజే చెరకు రైతుల బాకాయలు చెల్లించటానికి 8300 కోట్ల ప్యాకేజీని ప్రకటించటం దిద్దుబాటు చర్యల్లో భాగమే.

BJPకి అసలు కునువిప్పు గుజరాత్ ఎనికల్లోనే కలిగింది.చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు మెజారిటీకి కేవలం 99 సీట్లు అంటే కనీస మేజారితీకన్న 7 సీట్లు అధికంగా సాధించి ఓటమి నుంచి తప్పించుకున్న BJPకి కాంగ్రేస్ 77(మిత్రపక్షాలతో కలిపి 80) స్థానాలలో గెలవటం షాక్.

BJP గెలుపును లోతుగా విశ్లేషిస్తే మొత్తం 18 స్థానాలున్న ఆరు జిల్లాలలో బాజపా ఒక్క స్థానం కూడా గెలవలేదు. BJP ఏ ఒక్క జిల్లాలో కూడ మొత్తం స్థానాలను గెలవకపోయింది.కాంగ్రేస్ మొత్తం ఏడు స్థానలున్న రెండు జిల్లాలలో ఖాతా తెరవలేక పోయింది కాని ఆరు జిల్లాలలొ మొత్తం స్థానాలు గెలిచింది. BJP అహ్మదాబాదులో 21 స్థానాలలో 17,వడొదరలో పదికి తొమ్మిది, సూరతులో మొత్తం 12 స్థానాలు గెలిచింది.అంటే బాజపా రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన 99 స్థానాలలో 38 స్థానాలు మూడు పట్టణ ప్రాంతాల్లోనే సాధించింది.

2014 లోక్ సభ ఎన్నికల లెక్కల ప్రకారం బాజపా 165 అసెంబ్లీ స్థానాలలో ఆధిక్యం సాధించగా, కాంగ్రేసుకు కేవలం 17 స్థానాలలోనే ఆధిక్యత వొచ్చింది.2017 అసెంబ్లీ ఎన్నికల్లొ బాజపా 99 ,కాంగ్రేస్ 77(మిత్రపక్షాలతో కలిపి 80) స్థానాలలో గెలిచాయి.

ఈ బలా బలాలు 2019 ఎన్నికల్లొ మారొచ్చు కాని బాజపా 2014లో లాగా మొత్తం 26 లోక్ సభ సీట్లు గెలిచే అవకాశం మృగ్యం. కాంగ్రేస్ సున్నా నుంచి 10 స్థానాలకు ఎదిగినా అది మోడి-షాలకు పెద్ద దెబ్బ.

1985 నుంచి ప్రతిసారి ప్రభుత్వం మారుతున్న మరియు BJP,కాంగ్రెస్ ముఖాముఖి తలపడిన కర్ణాటకలో చిత్రమైన ఫలితాలు వొచ్చాయి.BJP కన్నా 6 లక్షల 40 వేల ఓట్లు ఎక్కువ సాధించిన కాంగ్రేసుకు కేవలం 78 సీట్లు రాగా భాజపాకు 104 సీట్లు దక్కాయి.కాంగ్రేసుకు 38% ఓట్లు ,భాజపాకు 36.2 % వోట్లు రావటానికి ప్రధాన కారణం తాము గెలిచే అవకాశం ఏమాత్రం లేని నియోజకవర్గాల్లొ ముఖ్యంగా మైసూర్ జోన్లో భాజపా తమ వోట్లను జేడిస్ కు మళ్ళించటం.జేడిస్ కూడ ఉత్తర కర్ణాటకలో కొన్ని చోట్ల తమ వోట్లను భాజాపాకు వేయించింది.

కర్ణాటక లో భాజపా 5,కాంగ్రేస్ 4 జిల్లాలలో ఖాతా తెరవలేదు.పాత మైసూర్ ప్రాంతంలో అనేక స్థానాల్లొ భాజపా జేడిస్ కు మద్దతు ఇవ్వటంతో మాండ్య,హసన్,కొడుగు జిల్లాలలో కాంగ్రేస్ ఒక్క సీటు గెలుచుకోలేదు. చిక్బళ్ళాపూర్,కోలార్,బెంగుళూరు గ్రామీణ, రామ్ నగర్, మాండ్య జిల్లాలొ భాజపాకు ఒక్క స్థానం దక్కలేదు. ఎన్నికల ముందు భాజపా,జేడిస్ మధ్య నడిచిన అవగాహన రాజకీయం ఫలితాల తరువాత బెడిసింది.

వోట్ల కన్నా సీట్లు ఎక్కువ వొచ్చిన వారిదే అధికారం కాబట్టి కాంగ్రేసుకు ఎక్కువ ఓట్లు రావటం చట్టపరంగా పెద్ద విలువైనది కాదు.కాని ఫలితాల విశ్లేషణలో ఈ అంశాని విస్మరించలేము. ప్రభుత్వ వ్యతిరేకతే నిజం అయితే కాంగ్రేసుకు భాజపా కన్నా ఎక్కువ ఓట్లు రాకుడదు. ముఖ్యంగా బెంగుళూరు లాంటి పట్టణంలో భాజపా ఎక్కువ స్థానాలు సాధించాలి కాని కాంగ్రేస్ 13 గెలిస్తే భాజపా 11 మత్రమే గెలిచింది.

రెండు వారాల కిందట కైరానా ఉప ఎన్నికతో పాటు జరిగిన బెంగుళూరు పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ ఉప ఎన్నికల్లొ కాంగ్రేస్ 44,000 మెజారిటీతో గెలవటం గమనార్హం.ఇక్కడ భాజపా కు 85,000 జేడిస్ కు 60,000 ఓట్లు వొచ్చాయి. యడ్యూరప్ప మీద భాజపా మీద సానుభూతి ఉంటే ఈ ఉప ఎన్నికలో భాజపా గెలిచి ఉండాలి.

2014 సార్వత్రిక ఎన్నికల తరువాత BJP గెలిచినా రాష్ట్రాల్లో అత్యధికం కాంగ్రేసు మరియు ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలే.ఒక్క గుజరాత్ తప్ప చెప్పుకోదగ్గ పెద్ద BJP పాలిత రాష్ట్రం లేదు.ఈ రాష్టాలు అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటు వోసినట్లా?లేక BJPకి అనుకూలంగా ఒటువేసినట్లా? 2019 ఎన్నికలకు పార్టీలు చేసుకునే సన్నాహాలకు ఇది కీలక అంశం. పంజాబ్లో కాంగ్రెస్, బీహారులో కాంగ్రెస్ మిత్రపక్షంగా మహాకూటమి గెలవటం, గోవా, మణిపూర్, మేఘాలయలో అతిపెద్ద పార్టీగా నిలబడటం తదితర అంశాలు కాంగ్రెస్ ముక్త భారత్ ప్రచారంలో డొల్లతనాన్ని వెల్లడిచేస్తాయి.

మరో వైపు BJP తొలిసారి మహారాష్ట్ర, హర్యానా, అస్సాం, త్రిపురలో గెలిచినా తమిళనాడు, కేరళాలో ప్రభావం చూపలేక పోవటం, పంజాబ్, బీహార్లలో ఓడిపోవటం, వరుస ఉప ఎనికల్లో ఓడిపోవటం (అది కూడా సిట్టింగ్ సభ్యుల మరణాలతో జరిగిన స్థానాలలో) ఈ నవంబరులో ఎన్నికలు జరగవలసిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీష్ ఘడ్ BJP పాలిత రాష్ట్రాలు కావటం BJPకి అగ్నిపరీక్ష!

ఈ పరీక్షకు సిద్దం అయ్యే క్రమంలోనే 2014 గెలుపు తరువాత 75 సంవత్సరాల వయస్సు నిబంధనతో పక్కన పెట్టిన సీనియర్లు అద్వాని, మురళీమనోహర్ జోషీలను నాలుగు సంవత్సరాల తరువాత మోడి, అమిత్ షా కలవటం. 2019లో అద్వాని, జోషీలు మరోసారి పోటికి BJP దింపుతుందని ఫీలర్లు కూడా ఇందులో భాగమే.

అద్వానికి 2014 తరువాత మంత్రి పదవి,తదుపరి రాష్ట్రపతి పదవి ఇవ్వకపోవటం లాంటి వాటికన్నా పెద్ద అవమానం BJP పార్లమెంటరి కమిటీలో స్థానం ఇవ్వక పోవటం. మార్గదర్శక మండలి అని ఏర్పాటు చేసి అద్వాని,మురళి మనోహర్ జోషీలకు స్థానం కల్పించారు కాని అది ఎర్పడ్డప్పటి నుంచి ఒక్కసారి కూడ సమావేశం కాకపోవటం అద్వానికి అతిపెద్ద అవమానం. మొన్న త్రిపుర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం వేదిక మీద అద్వాని నమస్కారాన్ని పట్టించుకోని మోడి మూడు నెలలలో అద్వాని ఇంటికి వెళ్లి ప్రభుత్వ విజయాల మీద నివేదిక ఇవ్వటం కూడ మారిన పరిస్థితులకు అద్దంపడుతుంది.

పార్లమెంటులో సమాధానం చెప్పని ప్రధాని,అధికారపక్షం ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొని “సంపర్క్ ఫర్ సమర్ధన్ ” పేరుతొ మాధురిదీక్షిత్,సంజయ్ దత్ లాంటి సినిమా వాళ్ళతో సహా అనేక పక్షాలను BJP నేతలు కలవటం మోషా వ్యవహార శైలిలో మార్పుగా చూడాలి.

NDAలో BJP తరువాత ఎక్కువ సీట్లు గెలిచిన శివసేన(18), తెలుగుదేశం(16) దూరం అవ్వటం,ఉప ఎన్నికల ఓటమి తరువాత బీహారులో నితీష్ BJPతో దూరం పెరుగుతున్న పరిస్థితి.మొత్తంగా ఇప్పుడు BJPకి కొత్త మిత్రులు కావాలి, పాత మిత్రుల సహకారం కొనసాగాలి …

ఫలితాల అంచనాకి ఇంకా సమయం ఉంది కాని హార హర మోడి నినాదాలు వినపడవు,56 ఇంచుల ఛాతి నుంచి కూడ అహంకార ఉపన్యాసాల కన్నా వివిధ వర్గాలతో సర్దుకుపోయే వినయం ఇకపై చూస్తాం.దీనికి తోలి సంకేతంగా నిన్న అమిత్ షా కాంగ్రెస్ ముక్త భారత్ అంటే కాంగ్రెస్ లేని అని కాదు గాంధి కుటుంబ పాలన లేని అని కొత్త నిర్వచనం ఇవ్వటం!

Post By : Siva Racharla

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *