Site icon Polytricks.in

హిడ్మా సేఫ్‌ – మావోయిస్టు కేంద్రకమిటీ ప్రకటన

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో బుధవారం జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందాడన్న వార్తలపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ కాల్పుల్లో హిడ్మా మృతి చెందలేదని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరుతో ఈ లేఖ విడుదలైంది. హిడ్మా చనిపోయినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన సేఫ్‌గానే ఉన్నట్టుగా చెప్పారు.

దక్షిణ బస్తర్ జంగిల్ కొండలపై పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు.. డ్రోన్‌లు, హెలికాప్టర్ ద్వారా దాడులు చేశాయని లేఖలో ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులు ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారని అందులో భాగంగా దాడులు జరిగాయని పేర్కొన్నారు. పాలకులకు వ్యతిరేకంగా ప్రగతిశీల, విప్లవ, ప్రజా సంఘాలు ఏకం కావాలని లేఖలో మావోయిస్టులు పిలుపునిచ్చారు.

బుధవారం తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతిచెందినట్టుగా వార్తలు వచ్చాయి. హిడ్మా మరణాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించనప్పటికీ.. సీఆర్‌పీఎఫ్ కోబ్రా బెటాలియన్ సిబ్బంది మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్‌లు చేపడుతున్నట్లుగా ఛత్తీస్‌గఢ్ సెక్టార్ ఐజీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దాడులు జరగడంతో హిడ్మా మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసి ఈ వార్తలను ఖండించింది.

Exit mobile version