Site icon Polytricks.in

లిక్కర్ ఆదాయంపై కేసీఆర్ ఫోకస్ – అందుకోసమేనా ఈ హడావిడి..?

పెండింగ్ లోనున్న హామీలను ఎన్నికల ముంగిట నెరవేర్చాలని భావిస్తోన్న బీఆర్ఎస్ సర్కార్ నిధుల సమస్యను అధిగమించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం లిక్కర్ బిజినెస్ నుంచి ఆదాయం సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే నవంబర్ తో ముగిసే మద్యం షాపుల గడువుకు ఆగస్ట్ లోనే టెండర్లు పిలుస్తున్నారు. టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. టెండర్లో పాల్గొనే వారు ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది.

తెలంగాణలోని రెండు వేలకు పైగా మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానించారు. గతేడాదికి సంబంధించిన వైన్ షాపుల లైసెన్స్ గడువు నవంబర్ వరకు ఉంది. డిసెంబర్ నుంచి కొత్త లైసెన్స్ షాపులు చెలామణిలోకి రానున్నాయి. నిజానికి వచ్చే ఏడాదికి సంబందించిన ఎక్సైజ్ లైసెన్స్ షాపుల కోసం అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇచ్చి, నవంబర్ లో లైసెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొన్ని హామీలను నెరవేర్చేందుకు నిధుల సమస్య ప్రభుత్వానికి సంకటంగా మారడంతో.. దీని నుంచి బయటపడేందుకు మద్యం లైసెన్స్ కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది.

సాధారణంగా ఒకటి, రెండు నెలల ముందు లైసెన్స్ లను రెన్యువల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం మూడు నెలల ముందు నుంచే ఇందుకు సంబంధించిన ప్రక్రియను స్టార్ట్ చేశారు. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి భారీ మొత్తంలో సొమ్ము సమకూరుతుంది. దాదాపు మూడు వేల కోట్ల దాకా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులను ఏదో ఒక పథకం అమలుకు వెచ్చించాలని ప్రభుత్వ ఆలోచన కావొచ్చు అందుకే నిధుల సమస్యను ఎదుర్కొనేందుకు ఈ తరహ వ్యూహం అనుసరిస్తూ ఉండొచ్చు.

Also Read : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వెనక పెద్ద స్టొరీ..!

Exit mobile version