Site icon Polytricks.in

బిగ్ బ్రేకింగ్ – ఆప్ కు ఇందిరా శోభన్ రాజీనామా

ఆమ్ ఆద్మీ పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాసేపటి క్రితమే మీడియాకు రిలీజ్ చేశారు. పార్టీని ఎందుకు వీడుతున్నారో స్పష్టత ఇవ్వలేదు కాని ఇన్నాళ్ళు పార్టీలో తనను ప్రోత్సహించిన నేతలకు  రాజీనామా లేఖలో ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అయితే…అవినీతి పరుడైన కేసీఆర్ కు ఆప్ మద్దతు ఇవ్వడంతోనే ఇందిరా శోభన్  రాజీనామా చేసినట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెప్పుకోచ్చాయి. బీఆర్ఎస్ నిర్ణయాలకు ఆప్ వత్తాసు పలకడం మనస్తాపానికి గురి చేసిందని.. అందుకే పార్టీ  వీడినట్లు  చెప్పారు.

ఇందిరా శోభన్ కాంగ్రెస్ ను వీడిన నాటి నుంచి ఆమె రాజకీయ పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఇందిరా శోభన్ ఆ తరువాత వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు. షర్మిలకు కుడిభుజంగా ఉన్న ఆమె పార్టీలో ఆధిపత్య,గ్రూప్ రాజకీయాలకు ఇమడలేక వైఎస్సార్ తెలంగాణ పార్టీని వీడారు.

ఆ తరువాత ఆమె రాజకీయ భవితవ్యం డైలామాలో పడింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆప్ తీర్ధం పుచ్చుకున్నారు. ఆ పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగిన ఆమె రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. దాంతో ఆమె నాయకత్వంలో ఆప్ కాస్త అయిన పుంజుకుంటుందని పార్టీ నేతలు ఆశించారు. కాని ఇందిరా శోభన్ నాయకత్వంలోనూ ఆప్ బలోపేతం కాలేదు. అడపాదడప పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా అవన్నీ పేపర్ ప్రకటనలకే పరమితం అయ్యాయి తప్పితే బలమైన ముద్రను వేయలేకపోయాయి.

ఇటీవల ఖమ్మం బహిరంగ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తోనూ ఇందిరా శోభన్ భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితులపై చర్చించారు. ఇంతలోనే ఆమె పార్టీని వీడుతున్నట్లు ప్రకటన విడుదల చేశారు. గతంలోనూ కాంగ్రెస్ లో కొనసాగిన సమయంలో ఇదే ట్విస్ట్ ఇచ్చారు. రేవంత్ పాదయత్రలో కనిపించి పాదయాత్ర ముగిసిన రెండు రోజుల్లోనే లోటస్ పాండ్ లో కనిపించి షాక్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే చేశారని అంటున్నారు.నిలకడలేని రాజకీయంతో తన రాజకీయ భవితవ్యాన్ని ఆమె నవ్వులపాలు చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఆప్  కు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆమె ఏ పార్టీలోకి వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version