Site icon Polytricks.in

ఊడుతున్న ఉద్యోగాలు – అమెరికాలో భారతీయుల వెతలు

ఆర్ధిక మాంద్యం ప్రభావంతో ఐటీ సంస్థలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. నవంబర్ లో మొదలైన ఈ కోత జనవరి నెల నాటికీ పీక్స్ దశకు చేరుకుంది. ఇప్పటివరకు వేయికి పైగా టెక్ కంపెనీలు రెండు లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో 30నుంచి 40శాతం మంది భారతీయులే ఉన్నారు.

ఉద్యోగాలు కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులంతా హెచ్‌-1బీ, ఎల్‌- వీసాలతో అమెరికాలో ఉంటున్నారు. ఈ వీసా నిబంధనల ప్రకారం 60రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. లేదంటే స్వదేశాలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఉన్నపళంగా ఉద్యోగం కోల్పోవడం.. పేరుమోసిన టెక్ సంస్థలు సహా చిన్న చితక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటంతో హెచ్‌-1బీ వీసా దారులు ఆందోళనకు గురి అవుతున్నారు. కొత్త ఉద్యోగం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తెలిసిన వారి ద్వారా ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. కాని పెద్దగా ఉపయోగం ఉంటున్నట్టు లేదు.

గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెజాన్‌, ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా, ట్విట్టర్‌ వంటి పెద్ద టెక్‌ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు యత్నిస్తున్నాయి. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 12వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఆల్ఫాబెట్‌, ప్రొడక్ట్‌ ఏరియాస్‌, ఫంక్షన్స్‌ తదితర విభాగాల్లో ఉద్యోగ కోతలు ఉంటాయని పిచాయ్‌ తెలిపారు. ఇలా సడెన్ గా ఉద్యోగులను తొలగిస్తున్నందుకు ఆయన క్షమాపణలు చెప్పారు. మరో ఐటీ దిగ్గజ సంస్థ విప్రో కూడా ఉద్యోగులను తొలగిస్తుంది. 450మంది ఫ్రెషర్లపై వేటు వేసింది. జనవరి మొదటి నుంచి 20వ తేదీ వరకు 173 కంపెనీలు 56 వేల మందిని తొలగించాయి. సగటున రోజుకు 2వేల 800 మంది ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారని అర్థం అవుతోంది.

భారత్‌తో సహా అంతర్జాతీయంగా అమెజాన్‌ 18వేల మందిని, గూగుల్‌ 12వేల మందిని, మెటా 11 వేల మందిని, మైక్రోసాఫ్ట్‌ 10 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించాయి. సామాజిక మాధ్యం షేర్ చాట్‌ 500 మందిని, స్విగ్గీ 380 మందిని, మెడి బడ్డీ 200 మందిని, ఓలా 200 వందిని డుంజో 80 మందిని, సాఫాఫ్‌ 450 మందిని తొలగించనున్నాయి. గత ఏడాది వరకు యూఎస్ లో లైఫ్ బిందాస్ రా మావా.. అని జబ్బలు చర్చుకున్న టెక్కీలలో ఇప్పుడు ఆందోళన కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా రిక్రూట్ చేసుకునే కంపెనీలు లేవు. హెచ్‌-1బీ నిబంధనల మేరకు 60రోజుల్లో కొత్త ఉద్యోగం దొరకడం కష్టమేనని భావిస్తున్నారు. దాంతో స్వదేశానికి వెళ్ళాలా…? ఎదో ఒక ఉద్యోగం వెతుక్కొని కొన్ని రోజులు వెయిట్ చేయాలా అని అనేక విధాలుగా ఆలోచిస్తున్నారు.

Also Read : అమెరికాలో మనోళ్ళకు కష్టకాలం..!

Exit mobile version