Site icon Polytricks.in

హీరో నితిన్ పోలిటికల్ ఎంట్రీ – ఏ పార్టీలో చేరబోతున్నారంటే..?

తెలంగాణ రాజకీయాలకు గ్లామర్ అద్దాలని బీజేపీతో సహా ప్రధాన పార్టీలు యోచిస్తున్నాయి. ఇందుకోసం టాలీవుడ్ ప్రముఖులతో చర్చలు జరుపుతున్నాయి. సెలబ్రిటీలను తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నాయి. ఏడాది కిందటి నుంచే టాలీవుడ్ ప్రముఖులతో బీజేపీ అగ్రనాయకత్వం సమాలోచనలు జరుపుతోంది. కానీ బీజేపీకి తెలంగాణలో ఆదరణ లేకపోవడంతో పలువురు హీరో, హీరోలు బీజేపీ అగ్రనాయకత్వ విజ్ఞప్తి పట్ల ఆలోచిస్తామని మాట దాటవేస్తు వచ్చారు.

ఇక దిల్ రాజు, నితిన్ లపై బీఆర్ఎస్ , బీజేపీలు గురి పెట్టాయి. ఈ ఇద్దరు నేతలు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే. నితిన్ తో ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం చర్చలు జరిపింది ఆయన మాత్రం పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నితిన్ మేనమామ నగేష్ రెడ్డి పీసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.ఆయన నిజామాబాద్ రూరల్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కానీ అక్కడి నుంచి పోటీ అధికంగా ఉంది.

నగేష్ రెడ్డి తనకు టికెట్ దక్కకపోతే లోక్ సభ ఎన్నికల నాటికీ నితిన్ కాంగ్రెస్ లో చేర్పించాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ మధుయాష్కీ పోటీ నుంచి తప్పుకుంటే నితిన్ కు టికెట్ ఇప్పించాలని అనుకుంటున్నారు. మరోవైపు… తాను ఎక్కడి నుంచి పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యేగా గెలుస్తానని దిల్ రాజు చెప్పడంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమైంది. ఏ పార్టీలో చేరుతారో క్లారిటీ లేదు.

కానీ కాంగ్రెస్ లో చేరేందుకు సానుకూలంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలకు టచ్ లోకి వెళ్ళారని…చర్చలు ఫలిస్తే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ కూడా దిల్ రాజుకు గాలం వేస్తోంది. కవిత వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తే ఎంపీ టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ ఆఫర్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది.

Also Read : ఆరని మణిపూర్ మంటల వెనక దాగిన దోషులు ఎవరు..?

Exit mobile version