అప్పుల్లో తెలంగాణ‌, ఎవ‌రు గెలిచినా…అష్ట‌క‌ష్టాలే. అప్పుల తెలంగాణ బ‌కాయిలు ఇవే

బంగారు తెలంగాణ పేరుతో… టీఆర్ఎస్ పార్టీ అప్పుల తెలంగాణ చేసింద‌ని ఆర్థిక శాఖ మేధావులు,ప‌లు సంస్థ‌లు కోడై కూస్తున్నాయి. ముందుచూపు లేని ఆర్థిక వ్య‌వ‌హ‌రాల‌తో… కార్పోరేష‌న్లు ఏర్పాటు చేసి అప్పులు చేశార‌ని, ఇప్పుడా అప్పులు క‌ట్టేందుకు, ఉన్న ఖ‌ర్చుల‌కే ఇప్పుడున్న వ‌న‌రులు స‌రిపోనున్నాయి.

telangana Debts

ఒక్క సాగునీటి శాఖలోనే 7000 కోట్ల బిల్లులు పెండింగ్

ఆర్ అండ్ బి పెండింగ్ బిల్లులు రెండు వేల కోట్ల వరకూ

సర్కారుకు రుణాలు ఇఛ్చేందుకూ బ్యాంకులూ వెనకంజ

జీతాల చెల్లింపుల కోసం దిక్కులు చూస్తున్న జీహెచ్ఎంసీ

పెండింగ్ బిల్లులతో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ

ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఆర్థిక నిర్వహణ సవాలే

వివిధ శాఖలకు చెందిన కాంట్రాక్టర్లకు సర్కారు చెల్లించాల్సిన బకాయిలు పది వేల కోట్ల రూపాయల పైమాటే. ఒక్క సాగునీటి శాఖలోనే పనులు పూర్తి చేసి..చెల్లించాల్సిన బిల్లులు 7000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంతే కాదు..మరో వెయ్యి కోట్ల రూపాయల బిల్లులు క్లెయిం చేయాల్సి ఉంది. రోడ్లు, భవనాల శాఖలో పెండింగ్ బిల్లుల మొత్తం 1800 కోట్ల రూపాయల వరకూ ఉంది. రుణాలు తెచ్చుకునేందుకు ఇబ్బడిముబ్బడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఆర్ అండ్ బి శాఖకు చెందిన ఓ కార్పొరేషన్ కు బ్యాంకుల కన్సార్షియం 4000 కోట్ల రూపాయల రుణం మంజూరుకు ఓకే చేసింది. ఇది జరిగి..నాలుగైదు నెలలు అయింది. కానీ అందులో నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కారణం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చూసి బ్యాంకులు కూడా సర్కారుకు రుణం ఇవ్వటానికి సిద్ధపడం లేదు.

మిగులు రాష్ట్రం..మిగులు రాష్ట్రం అంటూ ఊదరగొట్టిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. బకాయిలు చెల్లించని కారణంగా రాష్ట్రమంతటా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి ఆస్పత్రులు. అంతే కాదు..అత్యంత కీలకమైన జీహెచ్ఎంసీ తన ఉద్యోగులుకు వేతనాలు చెల్లించేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి. గతంలో ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టు చేపట్టినా బడ్జెట్ ఆధారంగానే కేటాయింపులు చేసేవి. లేదంటే అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇఛ్చే ప్రపంచ బ్యాంకు లేదంటే ఇతర ఆర్థిక సంస్థల మార్గాన్ని ఎంచుకునేవారు. ఎందుకంటే అక్కడ వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. కానీ కెసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల కోసం అంటూ బ్యాంకుల నుంచి 8 నుంచి 8.5 శాతం వడ్డీకి భారీ ఎత్తున రుణాలు తీసుకున్నారు. అసలు వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ప్రాజెక్టులు కట్టాలనే ప్రతిపాదనే సరైన విధానం కాదని ఆర్థిక శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

ప్రభుత్వంలో ఉన్న వారు ఇష్టానుసారం అప్పులు చేసి వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేశామని చెప్పి..అంతే వేగంగా తాము కూడా అన్ని రకాలు ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని..దీని వల్ల అంతిమంగా ప్రజలపై తీవ్ర భారం పడనుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉంటే..ఇప్పుడు కొత్తగా ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చుకుంటూ వెళుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా..మహాకూటమి గెలిచినా ఆర్థిక నిర్వహణ కత్తిమీద సాముగా మారనుందని..ఈ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చటం ఏ మాత్రం సాధ్యంకాదని చెబుతున్నారు. షెడ్యూల్ వరకూ ఆగి ఎన్నికలకు వెళితే తెలంగాణ ఆర్థిక పరిస్థితి బహిర్గతం అయి..గెలుపు అవకాశాలను మరింత దెబ్బతీస్తుందని..ముందస్తు ఎన్నికలకు వెళటానికి ఇది కూడా ఓ ప్రధాన కారణం ఆర్థిక శాఖ వర్గాలు చెప్పటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *