Site icon Polytricks.in

బీసీ కులవృత్తుల్లో అందరికీ సర్కార్ సాయం అందని ద్రాక్షేనా..?

బీసీ కులవృత్తుదారులకు సర్కార్ అందిస్తామన్న లక్ష సాయం అర్హులందరికీ ఇప్పట్లో అందటం కష్టమే. ఆ పథకానికి అప్లై చేసుకోవాలని సర్కార్ ప్రకటనతో మొత్తం 5.5లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సర్కార్ సాయం అందాలంటే 5.5 వేల కోట్లు అవసరం అవుతాయి.

కానీ ప్రభుత్వం కేవలం తాజాగా రూ. 400కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇలాగె ప్రతి ఏటా అరకొర నిధులు రిలీజ్ చేసుకుంటూ పోతే అప్లై చేసుకున్న 5.5లక్షల మందికి లక్ష సాయం అందాలంటే పుష్కర కాలం పడుతుంది. సర్కార్ విడుదల చేసిన అరకొర నిధులతో ఈ పథకం అమలుపై ఆదిలోనే అనేక అనుమానాలు ముసురుకున్నాయి. అసలు ఈ పథకాన్ని కొనసాగిస్తారా..? మధ్యలోనే అటకెక్కిస్తారా..? అనేది చర్చ జరుగుతోంది.

ప్రతి నెల విడతల వారీగా అర్హులకు సర్కార్ సాయం అందిస్తామని చెబుతోంది. ప్రతి నెల ఎంపిక ప్రక్రియ చేపట్టి ఆ నెల 15న లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ నెల 15న ఎంతమందికి ఆర్థిక సాయం చేస్తారనే చర్చ జరుగుతోంది. కుల వృత్తులకు సాయం కోసం 400కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం…ఈ నిధులతో 40 వేల మందికి మాత్రమే సాయం అందించగలదు. అంటే ఒక్కో నియోజకవర్గంలో సుమారు 300మందికి మాత్రమే ఆర్థిక సాయం అందనుంది.

ఇలా విడతల వారీగా సాయం చేసుకుంటూ పోతే ఈ పథకం అమలు కావడానికి పన్నెండు ఏళ్ళు పడుతుంది. దీంతో ఈ పథకాన్ని నిధుల సాకుతో మధ్యలోనే స్కిప్ చేస్తారన విమర్శలు ప్రారంభమయ్యాయి.

Also Read : మోడీ, అమిత్ షా ఎందుకు తెలంగాణకు రావడం లేదు..?

Exit mobile version