Site icon Polytricks.in

మనీ పాలిటిక్స్‌ కాదు…ప్రజా పాలిటిక్స్‌! తెలంగాణ రాజకీయాల్లోనూ మార్పు తెస్తున్న కాంగ్రెస్‌

ఆమె కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముఖ్యనేత.. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీకి కొత్త ఇంచార్జి జనరల్ సెక్రెటరీ. ఇలాంటి సందర్భంలో ఇంచార్జి దృష్టిలో పడటానికి కాంగ్రెస్ నాయకులు పడని పాట్లు ఉండవు, బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టిక్కెట్లు వేయడం, భారీ కాన్వాయ్ లు, ఫ్లెక్సీలు గట్రా కట్టి హడావుడి చేయడం కామన్. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పని చేసిన గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ లు గాంధీ భవన్ వస్తె హైదరాబాద్ మొత్తం పబ్లిసిటీతో నిండిపోయేది. అలాంటిది దేశంలోనే రిచేస్ట్ స్టేట్ తెలంగాణ స్టేట్ ఇంచార్జి అంటే ఇంకొంచెం ఎక్కువగానే ఆర్భాటం ఉంటుంది…కానీ సీన్ కట్ చేస్తే…. ఆమె మాత్రం ట్రెయిన్ లో నుండి దిగింది. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్ రూటే సపరేటు. ఆమె అసలు సిసలైన గాంధేయవాది. సుధీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు కానీ ఆమెకు రాజకీయ నాయకులకు ఉండే హంగు ఆర్భాటాలు అబ్బలేదు. అంతేకాదు రాహుల్‌ గాంధీ కోర్‌ టీమ్‌లో కీలకమైన సభ్యురాలు. పైరవీలు, పుకార్లు అంటే ఆమెకు అస్సలు పట్టదు. పనిచేసే కార్యకర్తలకే పట్టం కట్టాలన్నది మీనాక్షి నటరాజన్ నైజం.

ఎక్కడికి వెళ్లాలన్నా కేవలం ఆటోల్లో ప్రయాణిస్తారు. దూర ప్రయాణాల కోసం రైలు జర్నీ చేస్తారు. అత్యవసరమైతే తప్పితే ఫ్లైట్ ఎక్కరు. అంతేకాదు ప్రతి శనివారం మౌనవ్రతం పాటిస్తారు మీనాక్షి నటరాజన్. ఖాదీ బట్టలను మాత్రమే ధరిస్తారు. ఇక మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణతో గతంలోనూ అనుబంధం ఉంది. భూదాన ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2022లో యాదాద్రి భూదాన్​ పోచంపల్లి నుంచి మహారాష్ట్ర సేవగ్రామ్​ వరకు 600 కిలోమీటర్లు యాత్ర చేశారు ఆమె. సర్వోదయ సంకల్ప పాదయాత్ర పేరిట…ఏకంగా 600 కిలోమీటర్లు నడిచారు. గాంధేయవాదాన్ని, కాంగ్రెస్‌ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ ఆమె యాత్ర సాగింది. ఇందులో నాటి పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డితో పాటూ పలువురు ముఖ్యనేతలు ఆమె వెంట నడిచారు.

మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా నియమించడం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. పదేళ్ల పాటూ తెలంగాణలో నిరంకుశ పాలనను చూసిన ప్రజలు…ఏడాదిన్నరగా స్వేచ్ఛావాయువులు అనుభవిస్తున్నారు. కొద్దికాలంలోనే పాలనలో సుస్పష్టమైన మార్పు తెచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం…ఇప్పుడు రాజకీయాల్లో కూడా సమూల మార్పు తేవాలని భావిస్తోంది. అందుకే మీనాక్షి నటరాజన్‌ను ఇంచార్జ్‌గా నియమించారు. గతంలో బీఆర్ఎస్‌ పాలనలో దోచుకున్న సొమ్ముతో మొత్తం మనీ పాలిటిక్స్ చేశారు. కానీ రేవంత్‌రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ప్రచారంపై కంటే పని మీద దృష్టి పెడుతున్నారు. అలా కొంత మార్పు తెచ్చారు. అయితే మీనాక్షి నటరాజన్‌ను ఇంచార్జ్‌గా నియమించడం ద్వారా కాంగ్రెస్‌ అసలైన గాంధేయ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి, డబ్బుల్లేకుండా కూడా రాజకీయాలు ఎలా చేయొచ్చు అనేది ప్రజలకు చాటి చెప్పడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే ఆమె సాదాసీదాగా భుజాన ఒక బ్యాగు, చేతిలో ఒక సంచితో రైల్లో నుంచి దిగారు. అంతేకాదు కనీసం బొకే, పూలదండ కూడా వేసుకోకుండా…కేవలం కాంగ్రెస్ కండువాతో సాధారణంగా విచ్చేశారు. తనకోసం ఫ్లెక్సీలు కట్టొద్దని, పూల బొకేలు తేవొద్దని ముందుగానే క్యాడర్‌కు చెప్పారు. తొలి ప్రసంగం, తొలి పర్యటనలోనే తనదైన మార్క్‌ చూపించారు. ఇవన్నీ చూసిన అసలైన కాంగ్రెస్ వాదులు, పార్టీకోసం కష్టపడే కార్యకర్తలు…తమకు మంచి రోజులు వచ్చాయని సంబురపడుతున్నారు. గతంలో పార్టీ ఇంచార్జ్‌ వస్తున్నారంటే ఎయిర్‌పోర్టు నుంచి గాంధీ భవన్‌ వరకు ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌తో నిండిపోయేది. కానీ ఇప్పటి పరిస్థితిని చూసి కాంగ్రెస్ వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version